మంచిర్యాల టౌన్, ఏప్రిల్ 20 : మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఆదివారం ఉదయం తలెత్తిన సాంకేతిక సమస్య వల్ల నాలుగు గంటలపాటు బస్సులు నిలిచిపోయాయి. టికెట్ ఇష్యూయింగ్ మిషిన్(టిమ్)లకు సంబంధించిన సర్వర్‌లో ఏర్పడిన సాంకేతిక లోపంతో వాహనాలు బయటకు రాకపోగా, ప్రయాణికులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఉదయం మూడు గంటల నుంచే టికెట్ మిషిన్లు పనిచేయడం మానేశాయి. తెల్లవారు జామున ఐదు గంటలనుంచి బస్సులు ప్రారంభమైన సందర్భంలో టిమ్‌లలో ఏర్పడిన సమస్యను కండక్టర్లు, డ్రైవర్లు గుర్తించారు. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు టిమ్‌లను పునరుద్ధరించడానికి ప్రయత్నం చేశారు.
ఆదివారం కావడంతో సిబ్బంది అందుబాటులో లేని కారణంగా జాప్యం జరిగినట్లు తెలుస్తోంది. చివరకు ఉదయం తొమ్మిది గంటల ప్రాంతంలో బస్సులు యథావిధిగా నడిచాయి. అత్యంత రద్దీగా ఉండే రూైట్లెన గోదావరిఖని, బెల్లంపల్లి, లక్షెట్టిపేట, చెన్నూరు, కరీంనగలకు బస్సులు లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. ఇతర డిపోలకు చెందిన బస్సుల ద్వారా కొందరు తమ గమ్యస్థానాలకు చేరుకున్నారు. మరికొందరు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించారు. ఈ విషయంపై మంచిర్యాల ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్దన్‌ను వివరణ కోరగా.. డాటాబేస్‌లో ఫైల్స్ కరప్ట్ కావడంతో టిమ్ మిషిన్లలో అప్డేట్ కాలేదని, సమస్యను సత్వరమే పరిష్కరించి బస్సులను నడిపించామన్నారు.
టిమ్ మిషిన్లలో సాంకేతిక సమస్యలు ఏర్పడడానికి సిబ్బందికి బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించడమే కారణమన్నట్లు తెలుస్తోంది. కంప్యూటర్ ఆపరేటర్లకు సెక్యురిటీ సిబ్బంది బ్రీత్ ఎనలైజర్ పరీక్షలు చేయాలని పట్టుబట్టడమే ఆలస్యానికి దారితీసినట్లు సమాచారం. సాధారణంగా డ్యూటీలోకి తీసుకునే ముందు డ్రైవర్లకు, కండక్టర్లకు బ్రీత్ ఎనలైజర్‌తో పరీక్షలు చేస్తుంటారు. గడిచిన కొన్ని రోజులుగా డీఎం కార్యాలయంలో పనిచేసే డాటా ఎంట్రీ, కంప్యూటర్ ఆపరేటర్లకు కూడా పరీక్షలు చేయాలని చూడడంపై నిరసన వ్యక్తమవుతోంది. వాస్తవానికి వీక్లీఆఫ్ రోజుల్లో కూడా వీరు సంస్థకు సేవలు అందిస్తున్నారు.
మంచిర్యాల ఆర్టీసీ డిపో కార్యాలయానికి సంబంధించిన తాళాలు మాయమైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో గ్యాస్ కట్టర్ సాయంతో ఆఫీసు తాళాలను తెరిచినట్లు తెలుస్తోంది. గురువారం సాయంత్రం విధులు ముగించుకున్నాక యథావిధిగా డిపో కార్యాలయ సిబ్బంది సెక్యూరిటీ కార్యాలయంలో తాళాలను అందజేసి వెళ్తారు. శుక్రవారం గుడ్‌ఫ్రైడే సెలవు కావడంతో అటువైపుగా ఎవరూ వెళ్లలేదు. కానీ, శనివారం ఉదయం 10 గంటలైనా డీఎం కార్యాలయానికి తాళాలు తెరవక పోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సెక్యూరిటీ విభాగం వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతోందని పలువురు విమర్శిస్తున్నారు.