తాండూర్ : మంచిర్యాల జిల్లాలోని తాండూరు మండలానికి మంజూరైన జూనియర్ కళాశాల ( Junior College ) ను వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తాండూరు మండల కేంద్రం ఐబీలో జాతీయ రహదారిపై బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ ఆధ్వర్యంలో ధర్నా ( BRSV Dharna) నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో జూనియర్ కళాశాలలు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గత సంవత్సరం హంగు ఆర్భాటాలతో జూనియర్ కళాశాల మంజూరు చేసినట్లు హడావుడి చేసినా నేటి వరకు తరగతులు ప్రారంభం చేయలేదని ఆరోపించారు.

కేవలం పేపర్లకు పరిమితం కాకుండా ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్లక్ష్యంతో తరగతులు ఇంకా ప్రారంభం కాలేదని విమర్శించారు. మండలంలో పదవ తరగతి చదువుకునే సుమారు 200 నుంచి 300 మంది విద్యార్థులు ఇంటర్ విద్య అందక నష్టపోతున్నారని వెల్లడించారు. పోలీసులు బలవంతంగా బీఆర్ఎస్ నాయకులను ధర్నా నుంచి తొలగించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ జిల్లా నాయకులు సూర్య(చింటూ), బెల్లంపల్లి పట్టణ ప్రధాన కార్యదర్శి బుద్ధర్తి సుమంత్, రాకేష్, రిజవాన్, వెంకటేష్, చోదన్, సారయ్య, ప్రశాంత్, సాయి, అక్రమ్, జుబైర్, సాహెల్, జాడి పొశం, ముబీన్, రమేష్, హర్ష వర్ధన్, సాయి ప్రసాద్, గంధం క్రిష్ణ, కుమార్, ఫెరోజ్ తదితరులు పాల్గొన్నారు.