మంచిర్యాల, జూలై 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మొన్నటికి మొన్న మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో సొంత పార్టీ దళిత ఎంపీ వంశీకృష్ణను అడ్డుకున్నది అధికార కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గం. పెద్దపల్లి ఎంపీ పరిధిలోకి వచ్చే మంచిర్యాల నియోజకవర్గంలోనే ఆయన స్వేచ్ఛగా తిరగలేని దుస్థితి. మంత్రి వివేక్‌ది దాదాపు ఇదే పరిస్థితి. దళితులైన కారణంగానే ఎంపీని, మంత్రిని చిన్నచూపు చూస్తున్నరని దళిత సోదరుల్లోని ఓ వర్గం వాదిస్తున్నది. ఎంపీని అడ్డుకొని కాంగ్రెస్ పార్టీ దళితులను అవమానించిందని ఆరోపిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో లక్షెట్టిపేటలో రైతు సదస్సు నిర్వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దళితుల మనసులు గెలుచుకొన్నారు. ఏ లక్షెట్టిపేటలోనైతే ఎంపీని అడ్డుకున్నారో, అదే లక్షెట్టిపేటలోని రంగపేట గ్రామంలో గల దళితవాడల్లో కేటీఆర్ పర్యటించారు.
కేసీఆర్ హయాంలో దళితబంధు కింద లబ్ధిపొందిన లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి దళితుల బాగుకోసం తమ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం వారి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో ఆరా తీశారు. దళితబంధు కింద కొనుగోలు చేసిన ఆవు పాలతో చేసిన ఛాయ్ తాగారు. తెలంగాణ ఉద్యమకారుడు, దళితనేత చిప్పకుర్తి నారాయణ ఇంట్లో భోజనం చేసి అభిమానం చాటుకున్నారు. రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో కనిపించిన ప్రతివారి బాగోగులను ఆరా తీశారు. అవ్వా పింఛన్ వస్తుందా? మహిళలకు రూ.2500 వస్తున్నాయా? అంటూ ఆప్యాయంగా పలకరిస్తూ స్థానికులతో మమేకమయ్యారు. దీంతో మంచిర్యాల జిల్లాలో దళితులను కాంగ్రెస్ అవమానిస్తే, బీఆర్ఎస్ అభిమానం చాటుకుందన్న చర్చ స్థానికంగా నడుస్తున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా వచ్చి అందరిని పలకరించిండు అంటూ స్థానికులు తెగసంబురపడిపోతున్నారు.

ఈ ఏడాది మే 5వ తేదీన అకాల వర్షాల నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రంలోని పంటను కాపాడుకొనేందుకు వెళ్లి గోడ, షెడ్డు కూలి రైతులు తనుగుల నాగరాజు, అభిరామ్, గుండారపు వెంకటేశ్, నెల్కి లచ్చలు చనిపోయారు. సర్కారు నిర్లక్ష్యంతో మృతి చెందిన ఆ రైతులకు న్యాయం చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, మాజీ మంత్రి జీవన్‌రెడ్డిలు దాదాపు 8 గంటలపాటు లక్షెట్టిపేటలో ధర్నా చేశారు. కానీ.. కాంగ్రెస్ సర్కారు మనసు కరగలేదు. సర్కారు నుంచి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కాకుండా ఇంకా ఏదైనా ఎక్కువ సాయం అందేలా చూస్తామని మాటిచ్చారు. కానీ.. రెండున్నర నెలలు అవుతు న్నా.. నలుగురులో ఒక్క రైతుకే రైతుభరోసా కింద రూ.5 లక్షలు వచ్చాయి.
మిగిలిన రైతులకు సాయం అందలే దు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు బీఆర్ఎస్ అండ గా నిలిచింది. ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షల సాయం అందించి.. కేసీఆర్ ఆదేశాల మేరకు స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వచ్చి బాధితులకు చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో రైతులకు న్యాయం జరగాలంటే మళ్లీ కేసీఆర్ రావాలంటూ మాట్లాడారు. రైతులకు భరోసా కల్పించారు. సర్కారు నిర్లక్ష్యంతో బలైపోయిన రైతులకు బీఆర్ఎస్ అండగా నిలబడిన తీరుపై రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది కదా కావాల్సింది. రైతులకు ఏం కావాలో బీఆర్ఎస్కు, రైతు పక్షపాతి కేసీఆర్‌కే తెలుసని చెప్తున్నారు.
మంచిర్యాల నియోజకవర్గంలో కేటీఆర్ పర్యటన రైతులతోపాటు మహిళలు, వృద్ధులు అన్ని వర్గాల్లో జోష్ నింపింది. ముఖ్యంగా రంగంపేట దళితవాడలో ఆయన పర్యటన స్థానికుల హృదయాల్లో నిలిచిపోయింది. రైతు సదస్సులో రైతు సమస్యలతోపాటు మహిళలు, వృద్ధులు, నిరుద్యోగ యువత ఇలా అన్ని వర్గాలను ఆలోచింపచేసే విధంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ తరహాలో ఇచ్చిన హామీలు నెరవేర్చని ఈ సర్కార్‌ను నిలదీయాలని పిలుపునిచ్చి అందరిలోనూ జోష్ నింపారు. మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఇన్ని రోజులు మిమ్మలను ఇబ్బందులు పెట్టిన వారి పేర్లు రాసిపెట్టుకోవాలని, వచ్చేది మన ప్రభుత్వమే ఎవ్వరిని వదిలిపెట్టేది లేదంటూ భరోసా కల్పించారు. అదే సమయంలో స్థానిక అధికార పార్టీ నాయకులను హెచ్చరించారు. తీరు మార్చుకోవాలని ప్రజా సమస్యలు, ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టాలి తప్ప, బీఆర్ఎస్ నాయకులను క్షోభ పెట్టాలని చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్యకర్తలు, నాయకులను కాపాడుకొనేందుకు ఎంతదూరమైన వెళ్తామని స్పష్టం చేశారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణుల్లోనూ కేటీఆర్ టూర్ జోష్ నింపింది. రైతు సదస్సుకు తరలివచ్చిన వేలాది మందికి దిశానిర్దేశం చేసింది.

దండేపల్లి, జూలై 22 : చేతికొచ్చిన వడ్లను అమ్ముకోవడా నికి ప్రాణాలు కోల్పోయిన రైతులను ఆదుకోవడానికి వచ్చిన కేటీఆర్‌కు రైతులోకం అండగా ఉంటుంది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు గాలిలో కలిసి పోతే ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ కేసీఆర్ ఆదేశా ల మేరకు రైతులకు రూ.5 లక్షల సాయం అందించ డం గొప్ప విషయం. సంఘటన జరిగినప్పుడు న్యాయం కావాలని కోరుతూ జీవన్‌రెడ్డి సారు, దివాకర్‌రావు సారుతో కలిసి రోడ్డెక్కినం. అయినా సర్కారు కు చీమ కుట్టినట్లు కూడా కాలేదు. బీఆర్ఎస్ చేసిన సాయానికి రైతులు ఎంతో రుణపడి ఉంటారు.
– శనిగారపు వెంకటేశ్, రంగంపేట, దండేపల్లి
కేసీఆర్ సార్ పెద్ద మనసు చేసుకొని కేటీఆర్ సారును ఇక్కడికి పంపి రైతు కుటుంబాలను ఆదుకోవడం సంతోషాన్ని ఇచ్చింది. రూ.5లక్షలు ఇచ్చి కుటుంబా లకు భరోసా ఇచ్చిండు. అప్పుడు కూడా కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రైతులను రైతుబంధు, రైతుబీ మా, ఉచిత కరెంటు ఇచ్చి ఏ కష్టం రాకుండా చూసు కున్నడు. ఇప్పుడు అదే మనసుతో రైతులను ఆదుకో మని ఇక్కడికి పంపడం అభినందనీయం. అధికారం లో ఉన్న వాళ్లు పట్టించుకోకపోయిన రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది.
-గూడ కొమురయ్య, కొత్తూర్, దండేపల్లి