మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ ) : అధికార పార్టీ కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసి నా.. ఖాకీలు, అధికారులను అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలకు పాల్పడినా.. ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. డబ్బులు వెదజల్లి ప్రలోభాలకు ప్రయత్నించినా.. జనాలు మాత్రం జడవలేదు. గుండెల నిండా గులాబీ పార్టీపై అభిమానం.. కేసీఆర్ సారు మళ్లీ రావాలన్న ఆశతో కారు గుర్తుకే ఓటేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జోరు కనిపించింది. పది మున్సిపాలిటీలకు ఐదు మున్సిపాలిటీల్లో కారు దూసుకుపోయింది. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంతోపాటు ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యంతో టాప్ గేర్‌లో దూసుకుపోయింది.
బెల్లంపల్లిలో అధికార పార్టీకి దీటుగా సమానంగా కౌన్సిలర్ సీట్లు సాధించి సత్తా చాటింది. ఖానాపూర్ ము న్సిపాలిటీలో నాలుగు స్థానాల్లో గెలిచింది. మొత్తంగా ము న్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఆధిపత్యం సుస్పష్టమైంది. మొత్తం పది మున్సిపాలిటీల్లో ఒక టి గెలవడంతోపాటు నాలుగు మున్సిపాలిటీల్లో కారు డా మినేషన్ కనిపించింది. మొత్తంగా ఐదు మున్సిపాలిటీలు క్యాతన్‌పల్లి, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ జోరు కనిపిస్తే.. కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట, చెన్నూర్, మున్సిపాలిటీల్లో స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది.
నిర్మల్ మున్సిపాలిటీలో కాంగ్రెస్, ఆదిలాబాద్ మున్సిపాలిటీలో బీజేపీ, భైంసా మున్సిపాలిటీలో ఎంఐఎం పార్టీలు ఎక్కువ స్థానాల్లో గెలిచాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో హంగ్ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆసిఫాబాద్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి, ఖానాపూర్, నిర్మల్, ఆదిలాబాద్, భైంసా మున్సిపాలిటీల్లో ఏ ఒక్క పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. దీంతో ఈ మున్సిపాలిటీల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులు కీలకంగా మారారు. ఖానాపూర్ మున్సిపాలిటీలో మాత్రం ఏవైనా రెండు పార్టీలు కలిస్తే తప్ప చైర్మన్‌ను నిర్ణయించలేదని పరిస్థితి నెలకొన్నది.
ఫలితాల రోజు అధికార పార్టీ దౌర్జన్యకాండ ఆగలేదు. ఫలితాలు అనుకూలంగా రాకపోవడం, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు మరోసారి దౌర్జన్యాలకు తెరలేపింది. ఎన్నికల్లో గెలవలేక చతికిలపడిన ఆ పార్టీ.. హంగ్ ఉన్న మున్సిపాలిటీలను ఎలాగైనా దక్కించుకోవాలని కుట్రలు పన్నుతున్నది. ఈ మేరకు గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులను బెదిరించడం, ప్రలోభపెట్టడం మొదలుపెట్టింది.
ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ఒకటో వార్డులో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థి వినోద్‌ను కాంగ్రెస్ లీడర్లు బలవంతంగా ఆటోలో ఎక్కించుకొని, రహస్య ప్రాంతానికి తరలించారు. పోలీసుల ముందే అభ్యర్థిని బలవంతంగా లాక్కెళ్తున్నా.. వారు పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మంచిర్యాల మున్సిపల్ పరిధిలో గెలిచిన ఓ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థిపైన కొందరు దాడికి ప్రయత్నించారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు సమానమైన సీట్లు వచ్చిన నేపథ్యంలో ఎలాంటి అనుమతులు లేకుండా బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ కౌంటింగ్ హాల్లోకి వెళ్లడం ఉద్రిక్తతకు దారి తీసింది. కౌంటింగ్ కేంద్రంలోకి అభ్యర్థి లేదా కౌంటింగ్ ఏజెంట్ పాస్ ఉన్నవారే రావాలని ఎమ్మెల్యే ఎలా వస్తారంటూ అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నిరసనకు సిద్ధం కావడంతో ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. కౌంటింగ్ రోజున అధికార పార్టీ నాయకులు ఈ తరహా దుశ్చర్యలకు పాల్పడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
