మంచిర్యాల, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన దీక్షా దివస్‌ను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు చేస్తున్నది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2009 నవంబర్ 29న బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ చేపట్టిన దీక్ష మళ్లీ గుర్తుకువచ్చేలా ఈ నెల 29న దీక్షా దివస్‌ను బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లా కేంద్రాల్లో ఈ దీక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, బీఆర్ఎస్ శ్రేణులతో పాటు తెలంగాణ ఉద్యమ కారులను సన్నద్ధం చేసేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలను నిర్వహించారు.
2009 నవంబర్ 29 గుర్తుకు వచ్చేలా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండగా, తెలంగాణలో అసమర్థ పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను ఎండగట్టేందుకు ఈ వేదిక నుంచే బీఆర్ఎస్ శంఖారావాన్ని పూరించనుంది. కేసీఆర్ దీక్షా దివస్‌తో 2009లో ఆంధ్రా పాలకులపై సమరశంఖం పూరించగా, ప్రస్తుతం చేపట్టబోయే దీక్షా దివస్ ద్వారా అసమర్థ పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌పై శంఖారావం పూరించనున్నారు. దీక్షా దివస్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశనం చేసి ఒక్కో జిల్లాకు ఒక్కో ఇన్చార్జిని సైతం నియమించారు.
ఉద్యమ స్ఫూర్తి రగిలించేలా దీక్షా దివస్
ఈ నెల 29న నిర్వహించనున్న దీక్షా దివస్‌ను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యమ స్ఫూర్తి రగిలించేలా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలు, ముఖ్య నేతల ఆధ్వర్యంలో ఈ దీక్షా దివస్ కార్యక్రమం జరగనుండగా, అన్ని గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు ఈ దీక్షా దివస్‌కు తరలివచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసేలా నిర్వహించనున్న ఈ రోజు నుంచే కాంగ్రెస్ పాలనను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ శ్రేణులను సన్నద్ధం చేసేందుకు ఈ దివస్‌ను బీఆర్ఎస్ వేదిక చేసుకోనున్నది. కేసీఆర్ కలలుగన్న తెలంగాణ కాంగ్రెస్ ఏడాది పాలనలో ఎంత వెనుకబాటుకు గురైందో ఈ వేదికపై వివరించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎండగట్టి ప్రజలను చైతన్య వంతులను చేసేందుకు ఈ వేదిక ద్వారా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగనుంది.
ఇన్చార్జిల నియామకం
తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్‌ను మననం చేసుకునేందుకు ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న దీక్షా దివస్‌కు బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలను నియమించింది. ఆదిలాబాద్ జిల్లాకు మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, మంచిర్యాల జిల్లాకు తుల ఉమ, మాజీ జడ్పీ చైర్మన్, ఆసిఫాబాద్ జిల్లాకు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావ్, నిర్మల్ జిల్లాకు ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి దీక్షా దివస్లకు ఇన్చార్జిలుగా ఉండనున్నారు.