సిర్పూర్(టీ), అక్టోబర్ 7 : గురుకుల విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని, రేవంత్ ప్రభుత్వానికి ఇది ఎంతమాత్రం మంచిది కాదని, ఎంతో మందిని డాక్టర్లుగా, కలెక్టర్లుగా, ఇంజినీర్లను తయారు చేసిన చరిత్ర గల సిర్పూర్(టీ) గురుకుల బాలుర పాఠశాలను తరలించాలనుకోవడం దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండల కేంద్రంలోని సాంఘి సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల వద్ద మంగళవారం విద్యార్థుల తల్లిదండ్రులను కలసి మాట్లాడారు. సిర్పూర్(టీ) గురుకుల బాలుర పాఠశాలలో చిన్న చిన్న మరమ్మతులు చేయలేక ఇతర ప్రాంతానికి తరలించాలనుకోవడం సరికాదన్నారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యేకుదీన్ దయాల్ మీద ఉన్న శ్రధ్ధ విద్యార్థుల భవిష్యత్‌పై లేదన్నారు.
విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా.. విద్యార్థుల తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా సంబంధిత అధికారులు, కలెక్టర్, ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్నారు. అవసరమైతే సిర్పూర్(టీ) గురుకులాన్ని విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి మరమ్మతులు చేసుకొని కాపాడుకుంటామని తెలిపారు. ఇప్పటికైనా పట్టించుకోకపోతే భవిష్యత్‌లో జరుగబోయే పరిణామాలకు కలెక్టర్, ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ అస్లాంబిన్ అబ్ధుల్లా, పనాస లక్ష్మణ్, వర్మ, స్వామి పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
కౌటాల, అక్టోబర్ : మండలంలోని బాలెపల్లి, విర్దండి గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు 50 మంది బీఆర్ఎస్లో చేరారు. మంగళవారం రాత్రి బాలెపల్లిలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో మా గ్రామాలన్నీ అభివృద్ధి సాధించాయని, కానీ, ప్రస్తుతం ప్రగతి లేక కుంటుపడ్డాయన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మీద నమ్మకంతోనే బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్లో చేరిన వారిలో విర్దండి గ్రామ మాజీ సర్పంచ్ పర్చాకే బండు, బాలెపల్లి ఉపసర్పంచ్ తిరుపతి, మాజీ వార్డు సభ్యులు సాయి, రమేశ్, దోమాజీ, ప్రకాశ్, ఉద్దవ్, తదితరులున్నారు.