మంచిర్యాల ప్రతినిధి/కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలంటూ బీఆర్ఎస్ పోరు బాట పట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు గురువారం మంచిర్యాల, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టింది. ప్రధాన చౌరస్తాల్లో కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించింది.
కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసినట్లే.. ఎలాంటి ఆంక్షలు లేకుండా రూ. 2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేసింది. రుణమాఫీ విషయంలో మాట మార్చి మోసం చేసిన రైతు ద్రోహి కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించింది. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాగజ్‌నగర్‌లో రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, చెన్నూర్‌లో నియోజకవర్గ ఇన్చార్జి రాజారమేశ్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు.
మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నియోజకవర్గంలోని దండేపల్లి, లక్షెట్టిపేట, హజీపూర్, మంచిర్యాలలో జరిగిన ధర్నాల్లో పాల్గొన్నారు. రైతులందరికీ రుణమాఫీ వర్తింప చేయాలంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేకు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆర్డీవో హరికృష్ణకు, కాగజ్‌నగర్‌లో రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆర్డీవో సురేశ్‌కు వినతి పత్రాలు అందజేశారు. నియోజకవర్గ, మండల కేంద్రాల్లో నిర్వహించిన ధర్నాల్లో నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు.
కాంగ్రెస్‌కు రైతులే బుద్ధి చెబుతారు
మంచిర్యాలటౌన్, ఆగస్టు 22 : ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణాలు మాఫీ చేయాలి. కాంగ్రెస్ సర్కారు అన్నంపెట్టే రైతులను మోసం చేసింది. ఇందుకు రైతులంతా తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేశాం. దేవుళ్ల మీద ప్రమాణాలు చేసి మాట మార్చుతున్నారు. కాంగ్రెస్‌కు రైతుల ఉసురు కచ్చితంగా తగులుతుంది. రైతు భరోసా కింద ఎకరాకు రూ. 15 వేలు, కౌలు రైతులకు రూ.12 వేలు ఇస్తామని చెప్పి ఆ మాటే ఎత్తడం లేదు. ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కేసులు పెడుతున్నారు. ఇదెక్కడి పద్ధతి.
– మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు
సీఎం రాజీనామా చేయాలి
రేవంత్‌రెడ్డి ఎన్నికలకు ముందు రైతులందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే లేనిపోని ఆంక్షలు పెట్టి రైతులను గోస పెట్టుకుంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సమస్యలను గాలికి వదిలేసి వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. రైతు రుణమాఫీ కోసం రూ. 31 వేల కోట్లు కావాలని అంచనా వేశారు. బడ్జెట్లో మాత్రం రూ. 26 వేల కోట్లే కేటాయించారు. రైతులందరికీ రుణమాఫీ అయిందని సీఎం రేవంత్ రెడ్డి అంటే. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాత్రం రైతులందరికీ రుణమాఫీ కాలేదంటున్నారు. అలాగే మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తడం లేదు. కల్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని మోసం చేశారు. హామీలు నెరవేర్చలేని సీఎం రేవంత్‌రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. జిల్లాలో ఏ ఒక్క గ్రామంలో కూడా రైతులందరికీ రుణమాఫీ అయిన దాఖలాలు లేవు.
– కోవ లక్ష్మి, ఎమ్మెల్యే, ఆసిఫాబాద్
న్యాయం జరిగే వరకూ ఉద్యమిస్తాం
కాంగ్రెస్ ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి గద్దెనెక్కింది. డిసెంబర్ 9న రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేస్తాం.. బ్యాంకుల నుంచి ఇంకా రుణాలు తీసుకోండి అని చెప్పి ఇప్పుడేమో మాట మార్చారు. రైతులను దగా చేశారు. లేనిపోని ఆంక్షలు పెడుతూ అనేక మంది రైతులను అనర్హులుగా ప్రకటించారు. రైతులను గోస పెడుతున్న రేవంత్ సర్కారుకు తగిన గుణపాఠం తప్పదు. ఇకనైనా దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాలి. లేదంటే రైతుల పక్షాన బీఆర్ఎస్ ఉద్యమం తీవ్రతరం చేస్తాం.
– దుర్గం చిన్నయ్య, మాజీ ఎమ్మెల్యే, బెల్లంపల్లి
కాంగ్రెస్‌కు ఓటేసి మోసపోయిన
దండేపల్లి, ఆగస్టు 22 : అది చేస్తాం.. ఇది చేస్తామని చెబితే కాంగ్రెస్‌ను నమ్మి ఓటేసిన. నమ్మిన పాపానికి మంచిగనే బుద్ధి చెప్పిన్రు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రేవంత్ రెడ్డి మోసం చేసిండు. రుణమాఫీ చేస్తానని మాట తప్పిండు. ఇంకెప్పుడూ కాంగ్రెస్‌కు ఓటేయాలనుకోవడం లేదు. కొంత మందికి రుణమాఫీ చేసి.. మరికొంత మందికి అన్యాయం చేసిండు. రుణమాఫీ కానందుకే రోడ్డెక్కుతున్నాం. ఈ విషయం ముఖ్యమంత్రికి తెలియాలే..
– బొలిశెట్టి గంగన్న, దండేపల్లి
మాయమాటలతో బోర్లేసింన్రు
చెన్నూర్,ఆగస్టు 22 : కాంగ్రెసోళ్లు కొంతమందికే రుణ మాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నరు. చేసింది గోరంత.. చెప్పుకునేది మాత్రం కొండంత అన్నట్లు ఉంది. రైతులను మోసం చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. రుణమాఫీ విషయంలో రాష్ట్ర మంత్రులకే స్పష్టత లేదు. ఎవరికి తోచింది వాళ్లు మాట్లాడుతున్నరు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రూ 7,500 కోట్లు మాఫీ చేసినమంటడు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సాంకేతిక లోపాల వల్ల కాలేదంటడు. అప్పుడు మాయ మాటలు చెప్పి బోర్లేసింన్రు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినంక గోస పుచ్చుకుంటుంన్రు. ఇకనైనా ఇచ్చిన మాట మీద నిలబడక పోతే గుణపాఠం చెప్పి తీరుతం. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతేడ్చిన రాజ్యం బాగుండదని గుర్తుంచుకోవాలి. సర్కారు దిగిరాకుంటే ఉద్యమం తప్పదు.
– శ్రీనివాస్, కొమ్మెర
ఊరుకునేది లేదు..
చెన్నూర్, ఆగస్టు 22 : నాకు, నా భార్యకు కలసి రూ. 3 లక్ష ల పంట రుణం ఉంది. కాంగ్రె స్ పార్టీ అధికారంలోకి రాంగనే రూ. 2 లక్షల రుణ మాఫీ చేస్తమన్నరు. ఇప్పుడు గడ్డ ఎక్కినంక మాట మార్చిన్రు. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయాలే. లేదంటే ఊరుకునేది లేదు. లొల్లి చేస్తం.
– మారుపాక పోషం, ఎసన్వాయి, కోటపల్లి
భూమి ఉంటేనే కదా లోన్లు ఇచ్చింది
చెన్నూర్, ఆగస్టు 22 : ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి రైతులను మభ్యపెట్టిండు. అధికారంలోకి వస్తున్నాం.. వెంటనే రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామన్నడు. ఇప్పుడేమో మా ట మార్చింన్రు. ఓసారి రేషన్ కార్డును ప్రమాణికంగా తీసుకున్నమంటరు. మరోసారి ఆధార్ కార్డుల తప్పలున్నయంటరు. మేమంతా పట్టాదారు పాసుపుస్తకాలు పట్టుకపోయి బ్యాంకుల పెట్టి లోన్ తెచ్చుకున్నమా? లేక రేషన్‌కార్డు పట్టుక పోయినమా..? భూమి ఉంటనే కదా బ్యాంకోళ్లు లోన్లు ఇచ్చింది. ప్రతి కుటుంబానికీ రూ. 2 లక్షల లోన్ మాఫీ చేస్తమంటిరి. ఇప్పుడేమో సాకులు చెప్పి తప్పించుకోపడ్తిరి. ఆగస్టు 15వ తారీఖు వరకు లోన్లు మాఫీ చేస్తా అంటివి. ఊరూరికి పోయి దేవుళ్ల మీద ఒట్టెస్తివి.. ఎక్కడ పడ్డయో.. చూపెట్టేవు రా.. రైతులందరం కలిసి వస్తం.
– రవికుమార్, కిష్టంపేట
బేషరతుగా రూ. 2 లక్షలు మాఫీ చేయాలి
చెన్నూర్, ఆగస్టు 22 : కాంగ్రెసోళ్లు రైతులందరికీ రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాట తప్పింన్రు. ఊరుకో పది మందికి మాఫీ చేసి గొప్పలు చెప్పుకుంటున్నరు. పట్టదారు పాసు పుస్త కం పెట్టి బ్యాంకుల్లో రుణం తీసుకున్నం. ఆధార్‌కార్డు పెట్టో.. పాన్ కార్డు పెట్టో రు ణం తీసుకోలేదు. రుణ మాఫీ చేయకుండా ఇంతమంది రైతులను గోస పెట్టడం న్యాయమవుతుందా..? రైతులు ఎన్నో ఆశలతో ఉన్నరు. ఆగస్టు 15 అంటే మనకందరికీ స్వాతంత్య్రం. రైతులంతా మేము రుణ విముక్తులమైనం అనుకున్నరు. కానీ.. ఆ రోజు రైతుల ముఖాల్లో చిరునవ్వులే లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి రైతులంతా ఎందుకు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, నిరసనలు చేస్తున్నరో అర్థం చేసుకోవాలే. బేషరతుగా ఎలాంటి కండిషన్లు లేకుండా రుణాలు మాఫీ చేయాలే. నేను చేనుకాడి నుంచి వచ్చి ధర్నాలో పాల్గొన్న.
– దాసరి వెంకటస్వామి, చెన్నూర్