ఆదిలాబాద్, నవంబర్ 5(నమస్తే తెలంగాణ) ః కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా రైతాంగం సమస్యలను పట్టించుకోక పోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నది. పదేండ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ రైతుల సంక్షేమానికి దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేసింది. రైతుబంధు, రైతుబీమా పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. రైతులు అహర్శిశలు కష్టపడి సాగు చేసిన పంటలను బీఆర్ఎస్ మద్దతు ధరతో కొనుగోలు చేసింది. కరోనా వంటి సమయంలో రైతులు ఇండ్ల ఎదుట కాంటాలు ఏర్పాటు చేసి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నది.
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వానకాలంలో కురిసిన వర్షాల వల్ల రైతులు భారీగా పంటలు నష్టపోయారు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన పత్తి 5 నుంచి 6 క్వింటాళ్లు వస్తున్నది. అన్నదాతలు అహర్శిశలు కష్టపడి సాగు చేసిన పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేయాలి. కానీ.. సీసీఐ కొనుగోళ్లలో రైతులను నట్టేట ముంచుతున్నది. కపాస్ కిసాన్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి స్లాట్ బుకింగ్ విధానంలో కొనుగోళ్లు ప్రారంభించింది. రైతులు సీసీఐకి పత్తిని విక్రయించాలంటే కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.8110 తో కొనుగోలు చేయాల్సిన సీసీఐ తేమ పేరిట కొనుగోలు చేసేందుకు తిరస్కరిస్తున్నది. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారులకు మద్దతు ధర కంటే రూ.1500 తక్కువకు విక్రయించి నష్టపోతున్నారు. మూడు రోజుల కింద పంట కొనుగోళ్లలో సీసీఐ మరో మెలిక పెట్టింది. రైతుల వద్ద నుంచి ఎకరాకు రూ.12 క్వింటాళ్లు కొనుగోలు చేయాల్సి ఉండగా.. కేవలం ఏడు క్వింటాళ్లు తీసుకుంటామని ప్రకటించింది. దీంతో రైతులు తమ పంటను ప్రైవేటు వ్యాపారలకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. మూడు రోజుల కిందట తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న సీసీఐ అధికారులకు వినతిపత్రం ఇచ్చారు.
పత్తి కొనుగోళ్లలో రైతులు నష్టపోతున్నా ఆదిలాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో బీఆర్ఎస్ బుధవారం ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా స్థానిక ఎంపీ నగేశ్ ఇంటిని మట్టడించింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నాయకు లు, కార్యకర్తలతోపాటు రైతులు భారీ సంఖ్యలో ఆం దోళన కార్యక్రమానికి తరలివచ్చారు. బీఆర్ఎస్ ఆం దోళనలను అడ్డుకునేందుకు పోలీసులు ఎంపీ ఇంటికి ఇరువైపుల బారికేడ్లు పెట్టి బందోబస్తు ఏర్పాటు చేశా రు. పలు మార్గాల ద్వారా మాజీ మంత్రి జోగు రామ న్న ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వచ్చిన గులాబీ శ్రేణు లు బారికేడ్లను దాటుకుంటూ ఎంపీ ఇంటి ఎదుట బై ఠాయించారు. రైతుల సమస్యలు పరిష్కరించాలం టూ ప్లకార్డులు ప్రదర్శించారు. సీసీఐకి వ్యతిరేకంగా మద్దతు ధర కల్పించాలంటూ నినాదాలు చేశారు. పోలీసులు మాజీ మంత్రి జోగు రామన్నను అక్కడి నుంచి తీసుకుని పోవడానికి ప్రయత్నించగా.. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆందోళనకు దిగిన బీఆర్ఎస్ కార్యకార్తలను పోలీసుల అరెస్ట్ చేసి వ్యాన్‌లో వన్‌టౌన్‌కు తరలించారు. తోపులాటలో బీఆర్ఎస్ నాయకుడు విజ్జిగిరి నారాయణ కాలు వేళ్లకు గాయాలయ్యాయి. బీఆర్ఎస్ కార్యకర్తల ప్రతిఘటన మధ్య పోలీసులు మాజీ మంత్రి జోగు రామన్నను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ మంత్రి అరెస్ట్‌ను నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగిస్తామని నాయకులు తెలిపారు.
ఎంపీ ఇంటి ముందు ఆందోళన చేసిన మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు మరో 40 మంది నాయకులు, కార్యకర్తలపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ జీవన్‌రెడ్డి తెలిపారు. ఆరెస్ట్ చేసిన వారిని స్వంచ పూచికత్తుపై విడుదలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.