దహెగాం, అక్టోబర్ 8 : స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతీ కార్యకర్త సైనికుడిలా పనిచేసి బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం మొట్లగూడ, రావులపల్లి, రాంపూర్, దిగడ, ఖర్జీ, గిరివెల్లి, గెర్రె, ఒడ్డుగూడ గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీల నుంచి 200 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరగా, ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా సిర్పూర్ నియోజకవర్గాన్ని పాలించిన పాలకులు కొబ్బరి కాయలు కొట్టి పారిపోయారని, అభివృద్ధి చేస్తున్నట్లు నమ్మబలికారన్నారు. తాము గత పాలకుల మాదిరిగా మాటలు చెప్పి మోసం చేసే రకం కాదని, సిర్పూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. రానున్న రోజుల్లో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, సీఎం కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే పల్లెలు బాగు పడుతాయని తెలిపారు.
కేసీఆర్ సహకారంతో గిరిజనులకు మెరుగైన విద్య, వైద్యం అందిస్తామని, రహదారుల సౌకర్యానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఐపీఎస్‌గా ఉన్నప్పుడు ప్రజల కోసం నిరంతరం పనిచేశానని, నా జీవితం వారికే అంకితమని స్పష్టం చేశారు. కాగా, అంతకుముందు రావులపల్లి ప్రాథమిక పాఠశాలకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడారు. గణితం బోధించారు. పిల్లలతో లెక్కలు చేయించారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కొంగ సత్యనారాయణ, సలీం, షాకీర్, బబ్లూ, నారాయణ, నవీన్, కవిత, ప్రకాశ్, తదితరులు పాల్గొన్నారు.