మంచిర్యాలటౌన్, ఆగస్టు 27 : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ మంజూరు కావడంపై బీఆర్ఎస్ సంబురాలు జరుపుకున్నది. మంగళవారం సాయంత్రం మంచిర్యాలలోని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు నివాసంలో నాయకులు మిఠాయిలు పంపిణీ చేశారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.
మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్‌ల కుట్రలో భాగంగానే కవితను అరెస్టు చేశారని, ఆమెకు బెయిల్ రాకుండా అనేక శక్తులు అడ్డుపడ్డాయని అన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తన కూతురు అరెస్టు విషయంపై ఏనాడూ మాట్లాడలేదని, న్యాయం మనవైపే ఉందని చెప్పారని అన్నారు. కవితకు బెయిల్ మంజూరైతే బీజేపీ ఎంపీ, మంత్రి సుప్రీం తీర్పును కూడా తప్పు పట్టారంటే వారికి ఎంత ద్వేషముందో అర్థమవుతుందని తెలిపారు.
కవితకు బెయిల్ మంజూరు కావడం హర్షించదగ్గ విషయమని, దీనిని బట్టి చూస్తే ఏనాటికైనా న్యాయమే గెలుస్తుందని అర్థమైందన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్‌రావు, గోగుల రవీందర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు గాదెసత్యం, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంకం నరేశ్, నాయకులు గట్టయ్య, సుధీర్, తాజుద్దీన్, శ్రీరాముల మల్లేశ్, కర్రు శంకర్, జెట్టి చరణ్, పల్లపు రాజు, పల్ల రాజన్న, రాజు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, ఆగస్టు 27 : పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద మంగళవారం రాత్రి బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు కాల్చి.. మిఠాయిలు తినిపించుకుంటూ సంబురాలు చేసుకున్నారు. చివరకు న్యాయమే గెలిచిందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్, సుదర్శన్, మౌనిక్ తదితరులు పాల్గొన్నారు.