చెన్నూర్ రూరల్, సెప్టెంబర్ 1 : కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్ష ఎకరాలకు సాగు నీరందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ విప్ బాల్క సుమన్ పిలుపు మేరకు సోమవారం మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం అన్నారం బ్యారేజ్ వద్ద నాయకులతో కలిసి కేసీఆర్ చిత్ర పటానికి కాళేశ్వరం జలాలతో అభిషేకం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సాగు, తాగు నీటి ఇబ్బందులు ఉండవద్దనే గొప్ప ఆలోచనతోనే కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయేలా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారన్నారు. ప్రాజెక్ట్‌లపై పనికిరాని మాటలు మాట్లాడిన నాయకులంతా వాటిని సందర్శించాలన్నారు. ఏ బ్యారేజ్ చూసినా నీటితో కళకళలాడుతున్నదని తెలిపారు. గొప్ప నాయకుడిపై కాంగ్రెస్ నాయకులు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
కేసీఆర్ సర్కారులో ఏనాడూ ఎరువుల కొరత లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే రైతులు ఎరువుల కోసం బారులు తీరుతున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలకు వ్యవసాయంపై ఏమాత్రం అవగాహన లేదని చెప్పారు. కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుందరశాల మాజీ సర్పంచ్ రాయమల్లు, నాయకులు ఆసంపల్లి సంపత్, ప్రశాంత్ రెడ్డి, నయాబ్, రాజ్‌కుమార్ యాదవ్, బాపు నాయక్, అజుయ్, ప్రసాద్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్వీ నాయకుల అరెస్ట్
అన్నారం బ్యారేజ్ వద్ద కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ మాట్లాడుతూ ఓర్వలేకే మంత్రి వివేక్ ఆదేశాల మేరకు తమను అరెస్ట్ చేశారన్నారు. బీఆర్ఎస్ నాయకులకు కేసులు.. పోలీస్స్టేషన్లు కొత్తేమీ కాదన్నారు.
కేసీఆర్‌పై వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి
సీసీసీ నస్పూర్, సెప్టెంబర్ 1 : కాళేశ్వరంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై.. సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతామని బీఆర్ఎస్వీ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు దగ్గుల మధుకుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, బీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు ఆదేశాల మేరకు సోమవారం నస్పూర్‌లో కేసీఆర్ చిత్రపటానికి, అమరవీరుల స్తూపానికి, తెలంగాణ తల్లి విగ్రహానికి నాయకులు పాలాభిషేకం చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానించినట్లేనని మండిపడ్డారు. కేసీఆర్ లేకుంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చి ఉండేదికాదన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి మేరుగు పవన్‌కుమార్, కాటం రాజు, నోమలు నరేందర్‌రెడ్డి, కందుల ప్రశాంత్, గోశిక మధుకర్, మహ్మద్ సాజిద్, ఇరుగురాల వంశీ, కొత్త శ్రీనివాస్, గుమ్ముల ప్రవీణ్, నాయకులు హైమద్, జాడి భానుచందర్, పెరుమాళ్ల జనార్దన్, అడ్లకొండ రవిగౌడ్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ అసత్య ప్రచారాలు మానుకోవాలి
కౌటాల, సెప్టెంబర్ 1: కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్య ప్రచారాలు మానుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతూ ప్రజలను పక్కదారి పట్టించడంపై కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలో నిరసన తెలిపారు. రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక పత్రాలను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. స్థానిక బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై చేసిన తప్పుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో కౌటాల మండల కన్వీనర్ నాగపురి బండి పటేల్, మాజీ ఎంపీపీ బసరర్ విశ్వనాథ్, స్టూడెంట్ ఔట్ రీచ్ కన్వీనర్ రాంటెంకి నవీన్, సీనియర్ నాయకులు కస్తూరి సత్యనారాయణ, కో కన్వీనర్ ఆదే నాందేవ్, మండల మహిళా కన్వీనర్ దుర్గం మమత, గోగర్ల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.