మంచిర్యాల, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘క్యాతనపల్లిలో మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తా ఉంటే.. మా కౌన్సిలర్లు గట్టిగా, మొండిగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని బతికించి చూపించారు. మా కౌన్సిలర్ ఆడబిడ్డలు శివంగుల లెక్క, మా కౌన్సిలర్లు పులుల లెక్క 14 మంది ఒక్కతాటిపై నిలబడి క్యాతనపల్లి, రామకృష్ణాపూర్ పరువును నిలబెట్టారు. ప్రజాస్వామ్యాన్ని గెలిపించి చూపించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ఈ పాలకవర్గమంతా క్యాతనపల్లి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తుంది. ప్రజలకు మంచి సేవ చేస్తాం. ఇంత జరిగినా, నన్ను జైలుకు పంపినా ఎలాంటి బేషజాలకు పోకుండా ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్కసుమన్ అన్నారు.
క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బీఆర్ఎస్ కౌన్సిలర్, వైస్ చైర్‌పర్సన్‌గా సీపీఐ కౌన్సిలర్ ఎన్నికైన సందర్భంగా క్యాతనపల్లిలోని తన నివాసంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడారు. మంత్రి వివేక్ సైతం ఫాల్స్ ప్రెస్టేజీకి పోకుండా క్యాతన్‌పల్లి, చెన్నూర్ మున్సిపాలిటీల అభివృద్ధికి రూ.200 కోట్ల నిధులు తీసుకురావాలన్నారు. కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా, మంత్రి వివేక్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్ని కుట్రలకు పాల్పడినా.. క్యాతన్‌పల్లిలో చివరికి ప్రజాస్వామ్యమే గెలిచిందన్నారు. “నేను జైలుకు పోయినా క్యాతన్‌పల్లిలో నువ్వు గెలవలేవని వివేక్‌కు చెప్పాను” అని, ఇవాళ అదే జరిగిందన్నారు.
ప్రజాతీర్పుకు మీరు ఆ నాడే గౌరవం ఇచ్చి ఉంటే, ఈ రోజు ఎన్నికకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేదా ఆలోచించాలన్నారు. మంత్రి వివేక్ నువ్వే మొన్న నన్ను తమ్ముడు అని అన్నావ్, మీ తమ్ముడిగా రిక్వెస్ట్ చేస్తున్నా.. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ లేదని, బీఆర్ఎస్ చైర్పర్సన్, సీపీఐ వైస్ చైర్పర్సన్ ఉన్నారని అశ్రద్ధ చేయొద్దన్నారు. గతంలో మీరు చెప్పినట్లుగానే అభివృద్ధికి కట్టుబడి ఉండాలన్నారు. నూతన పాలకవర్గానికి సహకరించాలన్నారు.
క్యాతనపల్లి ఎన్నికల్లో ఇంత జరిగినా మాకు ఏం బేషజాలు లేవని బాల్కసుమన్ అన్నారు. నన్ను జైలుకు పంపారని, మా వాళ్లపై లాఠీచార్జీలు చేశారని, నాతోపాటు మా వాళ్లు చాలా మందిని జైలుకు పంపించారని, మా కౌన్సిలర్లను 51 రోజులు ఇంటికి, ప్రజలకు దూరం చేశారని, అన్యాయంగా, దుర్మార్గంగా పవర్తించారన్నారు. అయినా నీను మంత్రి వివేక్‌ను ఏం అనడం లేదని, అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఆయన క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు.
మేం ఇక్కడ పాలకవర్గంగా ఉన్నామని, మీరుప్రభుత్వంలో ఉన్నారని, మీరు మేము కలిసి ఈ మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మంత్రి పాల్స్ ప్రెస్టేజికి, ఈగోకి, అహానికి పోకుండా.. క్యాతన్‌పల్లి ప్రజలు ఎమ్మెల్యే ఎన్నికల్లో మీకు ఓట్లు వేశారని, ఇక్కడ మీకు ఆరున్నర వేల మెజార్టీ వచ్చిందని గుర్తుంచుకోవాలన్నారు. మున్సిపాల్ ఎన్నికల్లో ఓట్లు ఎందుకు వేయలేదో ఆత్మవిమర్శ, ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కరించి ఈ ప్రాంత అభివృద్ధికి సహకరించాలన్నారు. మాకు ఎలాంటి బేషజాలు, కక్షలు కార్పణ్యాలు లేవని, గొడవలు, కొట్లాటలు పెట్టుకోవాలని లేదని, నువ్వు మమ్ములను ఇంకా రెండుసార్లు జైలుకు పంపించినా.. ఐ లవ్ యూ చెప్పడం తప్ప.. మాకు వేరే ఉద్దేశాలు లేవన్నారు.
క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఉన్నాయన్నారు. గతంలో మా ప్రభుత్వం 3,633 కుటుంబాలకు సింగరేణి స్థలాల్లో ఇండ్లు కట్టుకున్న వాళ్లకు పట్టాలు ఇచ్చిందన్నారు. ఇప్పుడు 2817 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఆ పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను పరిష్కరించి పట్టాలు ఇప్పించాలన్నారు. గతంలో కేసీఆర్ నాయకత్వంలో వారసత్వ ఉద్యోగాలు తిరిగి తీసుకువచ్చి, మెడికల్ బోర్డు పెట్టి 16వేల మందికి మేము ఉద్యోగాలు ఇప్పించామన్నారు.
మూడు వేల పైచిలుకు మంది పెండింగ్ డిపెండెంట్ ఉద్యోగుల సమస్యను పరిష్కరించామన్నారు. మీ ప్రభుత్వం వచ్చాక మా ఏరియాలో మెడికల్ బోర్డు పెడుతలేదని, ఎవ్వరినీ అన్‌ఫిట్ చేయడం లేదని కార్మికులందరూ ఆందోళన చెందుతున్నారన్నారు. మెడికల్ బోర్డులు రెగ్యులర్‌గా పెట్టి, కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించేందుకు మంత్రి వివేక్ కృషి చేయాలన్నారు. ఇప్పటికైనా కక్షసాధింపు రాజకీయాలను పక్కనపెట్టి.. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు.
నియోజకవర్గంలో 45వేల ఉద్యోగాలు అన్నారు.. కానీ ఒక్కరికి ఉద్యోగం రాలేదని, మీ ఇంట్లో ముగ్గురికి ఉద్యోగాలు వచ్చాయన్నారు. పెద్ద ఫ్యాక్టరీ పెడుతామని చెప్పి ఇక్కడ పెట్టకుండా రాయబరోలీలో పెట్టారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడుతామన్నరు.. కానీ పెట్టలేదని, కరకట్టలు కడుతామని కట్టలేదని, మీము తెచ్చిన పనులన్నింటీని రద్దు చేశారని గుర్తిచేశారు. ఇప్పటికైనా ఈ కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి. ఇతర పార్టీల వారిన ప్రత్యర్థులుగా చూడాలే తప్ప, శత్రువులుగా చూడొద్దని కోరారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలోనే కోల్డ్బెల్ట్ ఏరియాలో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో స్పష్టమైన మార్పు కనపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారంలోకి రావడానికి ఇచ్చిన ఆరు గ్యారంటీలు డొల్ల, 420 హామీలు బుట్టదాఖలు, చెప్పిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ఇవన్నీ ఫేక్, బోగస్ అని ప్రజలందరికీ అర్థమవడమే ఇందుకు కారణమన్నారు. మీ పాలనకు చరమగీతం పాడటానికి ప్రజలు ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటికైనా పాలనపై కాంగ్రెస్ సర్కారు పునరాలోచించి, మార్పు చేసుకోవాలన్నారు.
గతంలో మేం అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో 96శాతానికిపైగా గ్రామ పంచాయతీలు, 98శాతం మున్సిపాలిటీలు, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు గెలిచామన్నారు. ప్రజాతీర్పు మాకు అనుకూలంగా ఉండే. కానీ ఇవాళ మీరు వచ్చిన రెండున్నర.. మూడేళ్లలోనే ప్రతికూలమైన ఫలితాలు వస్తున్నాయన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 36శాతం, మున్సిపల్ ఎన్నికల్లో 40శాతం ఎందుకు వస్తున్నయో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నిక కోసం పని చేసుకుంటామని, ఇతర సందర్భాల్లో ఈ ప్రాంత సమస్యలపై, ముఖ్యంగా సింగరేణి కార్మికుల సమస్యలు, రైతులు, యువత సమస్యలపై, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై తప్పకుండా మా పోరాటం కొనసాగుతుందన్నారు.
ప్రజల పక్షాన గట్టిగా నిలబడుతాం.. కొట్లాడుతాం.. ఆ క్రమంలో మమ్ములను ఎన్నిసార్లు జైళ్లకు పంపించినా.. వీ లవ్ యూ.. మాపై ఎన్ని సార్లు లాఠీచార్జి చేసిన.. మమ్ములను ఎంత ఇబ్బంది పెట్టినా.. వీ లవ్ యూ.. అన్నారు. మమ్ములను ఏం చేసినా ప్రజల పక్షనా కొట్లాడటం, పని చేయడం ఆపేది లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, దివాకర్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కౌశిక్‌హరి, కరీంనగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, కరీంనగర్ మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్‌సింగ్, సీపీఐ నాయకులు కలవేని శంకర్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు సీతారామయ్య, సీపీఐ జిల్లా కార్యదర్శి రామగుడు లక్ష్మణ్, బీఆర్ఎస్ యువ నాయకులు విజిత్‌రావు, అత్తి సరోజ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ తిప్పని లింగన్న, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూలరాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
క్యాతన్‌పల్లి ఎన్నిక పూర్తయిన నేపథ్యంలో ఇప్పటికైనా 17న క్యాతన్‌పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఏం జరిగిందో వీడియో ఫుటేజీ బయటపెట్టాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్, ఆ రోజు ఎన్నికల అధికారిగా ఉన్న ఎమ్మార్వో, మంచిర్యాల డీసీపీ వివేక్ ఇంట్లో గుమస్తాలుగా, విశాఖ ఇండస్ట్రీస్ ఉద్యోగులుగా మారిపోయారన్నారు. 17న ఏం జరిగిందో వీడియో పుటేజీ ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలన్నారు. ఆ వీడియో బయటపెడితే మంత్రి వివేక్, ఆయన కొడుకు ఎంపీ వంశీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల నిజస్వరూపం, ఈ జిల్లా అధికారుల నిజస్వరూపం మొత్తం బహిర్గతమవుతుందన్నారు.
ప్రజలు ఛీ, తూ అని ఈసడించే పరిస్థితి వస్తదనే బయటపెట్టడం లేదన్నారు. అక్కడ ఏం జరగకపోతే బయటపెట్టొచ్చు కదా.. ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలన్నారు. మేం హైకోర్టుకు పోయే దాకా గవర్నమెంట్ ఎన్నిక నిర్వహించే పరిస్థితి లేదన్నారు. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు లాగి.. మా కౌన్సిలర్లను ఊరికి దూరం చేసి డబ్బులు ఇచ్చో, బెదిరించో, ప్రలోభపెట్టో ఏదో ఒకటి చేసుకోవాలనుకున్నారన్నారు. మా 11వ వార్డు కౌన్సిలర్ భూమా గౌడ్ ఇంటి ప్రహరీ కూలగొట్టిన సింగరేణివాళ్లకు మా భూమాగౌడ్ ఒక్కడిదే కనపడిందా, కాంగ్రెస్ వాళ్లవి కనపడుతా లేవా అని ప్రశ్నించారు. సింగరేణి అధికారులు సైతం ఈ ప్రాంతంలో అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయారన్నారు.
మీరు మా కౌన్సిలర్ల ఇండ్ల గోడల కూల్చడంపై దృష్టి పెట్టకుండా, సింగరేణిలో బొగ్గు ప్రొడక్షన్ పెంచడంపై దృష్టి పెట్టాలన్నారు. ఆల్‌టైమ్ రికార్డుగా తెలంగాణ వచ్చిన 12 ఏండ్లలో ఇవాళ ప్రొడక్షన పడిపోయిందన్నారు. మీరు రాజకీయా పార్టీల చదరంగంలో పావులుగా, అధికార పార్టీకి తొత్తులుగా మారిపోయి సంస్థను నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఇవన్నీ నేను బాధతోని, ఆవేదనతో అంటున్న మాటలని.. జిల్లాలో పోలీసులు, అధికారులు, సింగరేణి వాళ్లు క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక సందర్భంగా అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా ఎలా పనిచేశారో యావత్ క్యాతన్‌పల్లి ప్రజలు చూశారన్నారు.
క్యాతనపల్లిలో శాంతియుతంగా సాగాల్సిన ఎన్నికను, అధికార దాహంతో కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. ప్రజాతీర్పునకు కట్టుబడి ఉండకుండా మంత్రి వివేక్ ప్రజల్లో ఆయనకు ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిగా వచ్చిన నాపైనా కేసు పెట్టారు. మాపై ముందు దాడి చేసి,రాళ్లు విసిరిన కాంగ్రెసోళ్లపై ఎందుకు కేసులు పెట్టలేదు. మా బీఆర్ఎస్ నాయకులనే కొట్టి ఉల్టా మాపైనే కేసులు పెట్టారు. ఇంత చేసినా క్యాతనపల్లి గెలవలేక కాంగ్రెస్ పార్టీ, మంత్రి వివేక్ ప్రజల్లో నమ్మకం పోగొట్టుకున్నారు.
– కోవ లక్ష్మి, క్యాతన్‌పల్లి ఎన్నికల ఇన్చార్జి, ఆసిఫాబాద్ ఎమెల్యే
క్యాతనపల్లిలో గెలిచిన 14 మంది కౌన్సిలర్లు ఎన్ని ప్రలోభాలు పెట్టినా లొంగలేదు. సీపీఐకి చైర్పర్సన్ ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి ప్రలోభాలు ఎన్ని పెట్టినా అందరూ ఐకమత్యంగా నిలబడ్డారు. మా పార్టీపై ఎంత ఒత్తిడి వచ్చినా ఎన్నికల ముందు ఎవరితో ఉన్నామో చివరి వరకూ వాళ్లతోనే ఉండాలనుకున్నాం. అందుకు తగినట్లే బీఆర్ఎస్- సీపీఐ కౌన్సిలర్లు 51 రోజులు ఒకేతాటిపై నిలబడటం గొప్ప విషయం. ప్రజలిచ్చిన తీర్పుకు కట్టుబడిన 14 మందిని అభినందిస్తున్నా.
– సీతారామయ్య, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు
క్యాతనపల్లి గెలుపును.. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయానికి తొలిమెట్టుగా భావిస్తున్నాం. 10 మంది బీఆర్ఎస్, నలుగురు సీపీఐ కౌన్సిలర్లు గెలిచి ఈ రాష్ర్టానికి, దేశానికి గొప్ప సందేశాన్ని ఇచ్చారు. క్యాతనపల్లి ప్రజలందరి గౌరవాన్ని కాపాడారు. బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రలోభాలకు లొంగకుండా నిలబడటం గొప్పవిషయం. వీరు చూపించిన ఈ స్ఫూర్తి, పట్టుదల రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పు తీసుకురావాలని కోరుకుంటున్నా. బాల్కసుమన్ పట్టుదల చూసి, ఆయనపై నమ్మకంతో క్యాతనపల్లి ప్రజలు ఓట్లు వేశారు. ప్రజాతీర్పునకు వ్యతిరేకంగా ఎవరూ పోకూడదని క్యాతనపల్లిలో బీఆర్ఎస్ గెలుపుతో నిరూపితమైంది. క్యాతనపల్లితో పాటు రాష్ట్రంలో బీఆర్ఎస్ గెలిచిన మున్సిపాలిటీలన్నింటినీ కేసీఆర్‌కు కానుకగా ఇస్తున్నాం.