కాగజ్‌నగర్, జనవరి 23 : కాంగ్రెస్ పార్టీ రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ ద్వారా నోటీసులిచ్చారని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ లెండుగూరే శ్యామ్‌రావు, సీనియర్ నాయకులు గోలం వెంకటేశ్, కొంగ సత్యనారాయణ ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలోని పెట్రోల్ పంపు ఏరియాలోగల తెలంగాణ తల్లి చౌరస్తాలో ప్రధాన రోడ్డుపై ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దోపిడీ, అరాకాలు, హామీల వైఫల్యాలపై ప్రశ్నించినందుకే ప్రభుత్వం నోటీసులు జారీ చేయించిందన్నారు. ఎన్నికల సమయంలో ఏదో ఒక పన్నాగంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు.
ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకులను ఇబ్బందులకు గురి చేయాడానికే ఇలాంటి ఎత్తుగడలని ఆరోపించారు. ప్రభుత్వం వైఫల్యం కావడంతోనే బీఆర్ఎస్ పార్టీపై బురదజల్లే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నదని మండిపడ్డారు. ప్రజల మద్దతుతో ఎదిగిన నాయకులపై ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఎన్నడూ ఫోన్ ట్యాపింగ్‌ను నమ్ముకొని పని చేయలేదని, పోరాటాలతో రాజకీయం చేశారన్నారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారని, వారు ప్రజల గుండెల్లో ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు ఓటేశామని ప్రజలు బాధపడుతున్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం సృజన్ రెడ్డి, రోహిన్‌రెడ్డి చేసిన కుంభకోణాలపై సిట్ వేయాలన్నారు. వెంటనే కేటీఆర్‌కు జారీ చేసిన సిట్ నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ కౌన్సిలర్ నక మనోహర్, నాయకులు శ్రీనివాస్, పార్వతి, అంజన్న ముస్తఫిస్, బండి వాసు, శోభన్, రవికాంత్, శివ, పోచం, రాజమౌళి, బార్బర్, తాజ్ బాబా, షాకీర్, సల్మాన్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.