“నాపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసిన, జైలుకు పంపించిన.. భయపడేది లేదు. జైలు నుంచి బయటికి వచ్చి ఇంకా గట్టిగా కొట్లాడుతా.. కేసీఆర్ శిష్యుడిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా.. క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ప్రజలు ఇచ్చిన తీర్పును ముందుకు తీసుకెళ్లేందుకు కొట్లాడుతున్నా.. ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీతోని పోరాడుతున్న.. అది జీర్ణించుకోలేక నన్ను జైలుకు పంపిన, నా మీద రౌడీ, గుండా అని ముద్ర వేసిన.. లాస్ట్‌కు మంత్రి వివేక్ కిరాయి గుండాలతో నన్ను చంపించిన.. బాల్క సుమన్ అనేవాడు అదరడు, బెదరడు. తగ్గడు..” అని బాల్క సుమన్ ఉద్ఘాటించారు. పోలీసులు అరెస్టు చేయడానికి ముందు మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లిలోని తన నివాసంలో సుమన్ విలేకరులతో మాట్లాడారు. సంఖ్యాబలం లేకున్నా, ఎట్టి పరిస్థితుల్లో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాలనే దుర్భుద్ధితో మంత్రి వివేక్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. బాల్క సుమన్‌ను జైలుకు పంపించి, నయానో.. భయానో క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని నెగ్గించుకోవాలన్నదే ఆయన టార్గెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను అరెస్టు చేసి మంత్రి వివేక్ కళ్లలో ఆనందం చూడడానికి పోలీస్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తహతహ లాడుతున్నాయన్నారు. వివేక్ చిరకాల వాంఛ నెరవేరుతున్నందుకు ఆయన సంతోషంగా, ఆనందంగా ఉండాలని, ఇప్పటికైనా కడుపునిండా తిని, కంటినిండా నిద్రపోవాలన్నారు. నా అరెస్టు అనంతరం క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో తెలియదన్నారు. పారదర్శకంగా క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక జరిగేలా చూడకపోతే చరిత్రలో మంత్రి వివేక్, ఎంపీ వంశీ ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన హంతకుడిగా వివేక్ మిగిలిపోతారన్నారు. పట్టపగలే క్యాతన్‌పల్లి మున్సిపాలిటీలో నిన్న మీరు చేసిన దుశ్శాసన పర్వంతో ఇప్పటికే ప్రజలు తిట్టుకుంటున్నారన్నారు.
– మంచిర్యాల, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
చెన్నూర్ నియోజకవర్గంలో దౌర్జన్యం, రౌడీయిజం చేసిది మంత్రి వివేక్.. ఆయన కొడుకు వంశీ అని బాల్క సుమన్ మండిపడ్డారు. గూండాయిజం ఆయనే చేసి, ఆయన మీడియాలో బాల్క సుమన్ గూండా, బాల్క సుమన్ రౌడీ అని రాస్తున్నారన్నారు. రెండేళ్లలో ఎన్నడు రౌడీ, గూండా కానీ సుమన్.. ఇప్పుడే ఎందుకు అయ్యారో జనాలకు తెలుసన్నారు. క్యాతన్‌పల్లి ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక జరగాలని కొట్లాడితే నాపై ఆ ముద్ర వేసి, అక్రమంగా అరెస్టు చేయించి శునకానందం పొందాలని చూస్తున్నారన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో రౌడీయిజం చేస్తున్నది నువ్వు, నీ కొడుకు.. ఈ ప్రాంతాన్ని ఒక ఫ్యాక్షన్ ప్రాంతంగా తయారు చేస్తున్నది నువ్వు, నీ కొడుకు.. అంటూ మండిపడ్డారు. ఈ ప్రాంతంలో గతంలో ఎన్నడూ లేని కక్షలు, కార్పన్యాలకు, చిల్లర దిగజారుడు రాజకీయాలకు నాంది పలుకుతున్నది ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఈ నల్ల నెలలో, కోల్ట్‌బెల్ట్ ఏరియాలో మేము అధికారంలో ఉన్నప్పుడు మిమ్ములను ఏం అనలేదని, అరెస్టులు చేయలేదు, జైళ్లలో పెట్టలేదన్నారు. రెండేళ్లు ఓపిక పట్టామని, ఇప్పుడే ఎందుకు ప్రజల తరఫున ప్రశ్నిస్తున్నామంటే.. నువ్వు ప్రజాతీర్పును తుంగలోకి తొక్కుతున్నందుకే మేం గట్టిగా నిలదీస్తున్నాం అన్నారు. నువ్వు, నీ కొడుకు కలిసి కౌన్సిల్ హాల్లో కాంగ్రెస్ కౌన్సిలర్లను రెచ్చగొట్టి మా మహిళ కౌన్సిలర్ల మీద దాడులు చేయిస్తారా? బూతులు తిట్టిస్తారా? ఇదేనా మీ సంస్కారం, ఇదేనా మీ మర్యాద అంటూ మండిపడ్డారు. ఇప్పటికైనా ఇలాంటి చర్యలు మానుకోవాలన్నారు. మీకు ఊడిగం చేసే అధికారులు, మీకు గుమస్తాల్లా పని చేసే కలెక్టర్, ఎంఆర్వో, మున్సిపల్ కమిషనర్, పోలీసులు మీ తొత్తులు, మీ తాబేదార్లతో మమ్ములను నిలువరిస్తారు కావచ్చు.. కానీ మీరు ఎంత నిర్బంధిస్తే అంత బయటికి వచ్చి ప్రజల కోసం ఇంకా గట్టిగా కొట్లాడుతామన్నారు.
మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్ నువ్వు ఐఏఎస్ చదువుకున్న దానికి ఏమన్న విలువ ఇచ్చేవాడివే అయితే.. నువ్వు కాంగ్రెస్ తొత్తువు కాకపోతే.. మంత్రి వివేక్‌కు నువ్వు ఊడిగం చేయకపోతే.. నిన్న క్యాతన్‌పల్లి మున్సిపల్ కౌన్సిల్ హాల్లో జరిగిన వీడియో పుటేజీ మీడియాకు విడుదల చేయాలి. మా వాళ్లు గొడవ చేశారా.. కాంగ్రెస్ కౌన్సిలర్లు తాగి వచ్చి మా మహిళ కౌన్సిలర్ల మీద దౌర్జన్యం చేశారా.. మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఉండి ఇదంతా చేయించారా.. ఆ వీడియో పుటేజీ విడుదల చేయాలని, ప్రజాక్షేత్రంలో పెట్టాలని సుమన్ డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఏం జరిగిందో వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. నిన్న లాఠీఛా ర్జి విషయంలోనూ పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారన్నారు. కాంగ్రెసోళ్లు రాళ్లు విసిరితేనే.. బీఆర్ఎస్ నాయకులమైన మేము ఆత్మరక్షణ కోసం, వాళ్లను ఢిపెన్స్ చేయడం కోసం తిరగబడ్డామన్నారు. కానిస్టేబుల్‌కు తగిలిన రాయి నేను ఉన్న దగ్గరి నుంచి కాకుండా పక్క నుంచి వచ్చినట్లు స్పష్టంగా వీడియోలో కనిపిస్తుందన్నారు. అసలు రాళ్లు విసిరింది కాంగ్రెస్ నాయకులైతే.. వాళ్లను వదిలేసి కేవలం బీఆర్ఎస్ నాయకులపై తప్పుడు కేసు పెట్టారంటూ సుమన్ మండిపడ్డారు. పోలీసులు మంత్రి వివేక్ తొత్తులుగా మారారంటూ మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక జరగకుండా కాంగ్రెస్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ మహిళ కౌన్సిలర్లతో అసభ్యంగా ప్రవర్తించడాన్ని నిరసిస్తూ బుధవారం క్యాతన్‌పల్లి బంద్‌కు బీఆర్ఎస్, సీపీఐ పార్టీలు పిలుపునిచ్చాయి. ప్రజాతీర్పుకు కట్టుబడిన క్యాతన్‌పల్లి మున్సిపల్ ప్రజలకు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బీ జోన్ ఏరియా, రాజీవ్ చౌరస్తాలోని దుకాణాలు, వ్యాపార సముదాయాలేవి తెరుచుకోలేదు. పోలీసులు వచ్చి షాపులు తెరవాలని కోరిన.. వ్యాపారులు స్పందించలేదు. క్యాతన్‌పల్లిలోని ప్రైవేటు స్కూల్స్ స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. దీంతో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు క్యాతన్‌పల్లి నిర్మానుశ్యమైంది. ప్రజల స్వచ్ఛంద మద్దతుతో బంద్ విజయవంతం కావడం.. కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా మారింది. బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో బుధవారం తెల్లవారు జామునే పోలీసులు ఏఐటీయూసీ నాయకులు సీతారామయ్యతోపాటు సీపీఐ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. బాల్క సుమన్ ఇంటి పరిసరాల చుట్టు మాటు వేశారు. లాఠీఛార్జి ఘటనలో కేసు నమోదు చేసిన బీఆర్ఎస్ నాయకులైన మూల రాజిరెడ్డి, అనిల్‌తో పాటు మరొకరిని అరెస్టు చేసి రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌ను తీసుకెళ్లారు. పోలీసులు చర్యలు భయాందోళనకు గురి చేసిన బంద్‌ను విజయవంతం చేసిన క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ప్రజలకు బాల్క సుమన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపాలిటీని దక్కించుకోవడానికి అధికార కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యాలకు తెరలేపింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికను రెండు సార్లు వాయిదా వేయించిన.. కౌన్సిలర్లను భయభ్రాంతులకు గురి చేసి.. ఖాళీ చెక్కులతో ప్రలోభపెట్టాలని చూసిన ఫలితం లేకపోవడంతో.. అక్రమ కేసు పెట్టి దుర్మార్గంగా, దౌర్జన్యంగా బీఆర్ఎస్ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్‌ను బుధవారం అరెస్టు చేయించింది. రెండు బస్సులు, కొన్ని వాహనాల్లో వందలాదిగా వచ్చిన పోలీసులు క్యాతన్‌పల్లిలోని బాల్క సుమన్ నివాసంలోకి చొచ్చుకొని వచ్చారు. అడ్డుకొనేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ నాయకులు, కార్యర్తలను లాఠీలతో చెదరగొట్టి.. సుమన్‌ను అదుపులోకి తీసుకొని వైద్య పరీక్షల కోసం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. అక్కడ నుంచి జిల్లా కోర్టుకు తీసుకెళ్లి 14 రిమాండ్ నిమిత్తం ఆదిలాబాద్ జైలుకు తరలించారు. బాల్క సుమన్ అరెస్టు సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు అగ్గిరాజేశారు. సుమన్ నివాసంతోపాటు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి, కోర్టు కాంప్లెక్స్ ఎదుట నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వైద్య పరీక్షల అనంతరం సుమన్‌ను ఆసుపత్రి నుంచి కోర్టుకు తీసుకెళ్తున్న వావాహనాలను అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పోలీసులు లాఠీఛార్జి చేశారు. బాల్క సుమన్‌తో బీఆర్ఎస్ చెన్నూర్ నాయకులు మూల రాజిరెడ్డి, అనిల్, రామిడి లక్ష్మీకాంత్‌లను కూడా జైలుకు తరలించారు.