బెల్లంపల్లి, ఏప్రిల్ 21 : చుట్టపుచూపుగా వచ్చే వీకెండ్ నాయకుడు కావాల్నో.. నిత్యం ప్రజల మధ్య ఉండి సేవ చేసే నేను కావాల్నో ప్రజలే తేల్చుకోవాలని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం బెల్లంపల్లిలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదట వన్గ్రౌండ్కు వెళ్లిన ఆయన తిలక్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడారు. క్రికెట్ ఆడి ఉత్సాహం నింపారు. సభ్యులంతా సింగరేణి రిటైర్డ్ కార్మికులు కావడంతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్లమెంట్లో ప్రశ్నించే గొంతుకను గెలిపిస్తేనే కేంద్రం మెడలు వంచి కార్మికుల సమస్యలు పరిష్కరించుకోవచ్చని తెలిపారు.
అక్కడి నుంచి నేరుగా కూరగాయల మార్కెట్‌కు వచ్చిన ఆయన వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులను కలిసి ఓట్లు అభ్యర్థించారు. కాంటా చౌరస్తాలోని పలు హోటళ్లకు వెళ్లి కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం ఏఎంసీ ఏరియాలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నారన్నారు. హామీలను నమ్మి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రజలకు కీడు చేస్తుందని మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని గుర్తు చేశారు.
ప్రస్తుతం విద్యుత్, తాగు, సాగు నీరు అందక రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. విద్యారంగం అస్తవ్యస్థంగా మారిందని, వైద్య రంగాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, రైతు పథకాలను అమలు చేయకపోవడంతో ఆత్మహత్యలు పెరిగిపోయి వ్యవసాయ రంగం కుదేలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకు వచ్చి 48 మంది ఆటో డ్రైవర్ల ఆత్మహత్యకు కారణమైందని, 50 లక్షల మంది ఆటో డ్రైవర్లను రోడ్డున పడేసిందని చెప్పుకొచ్చారు. రైతుబంధు నిధులు రూ. 7500 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చి చేతులు దులుపుకుందని ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా వారికి ధైర్యం చెప్పాల్సింది పోయి తేలికగా తీసుకుంటోందని విమర్శించారు.
గృహ జ్యోతి పథకం ద్వారా మొదటి నెల మాత్రమే జీరో బిల్లు ఇచ్చి, మరుసటి నెల నుంచి బిల్లులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. రైతుబంధు ఇవ్వనందుకు, ఎండిపోయిన పంటలకు నీరివ్వనందుకు, గొర్రెలు, చేపల పంపిణీ పథకాలు నిలిపివేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా అని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా టెట్ దరఖాస్తుకు రూ. వెయ్యి చొప్పున వసూలు చేసి యువతపై భారం మోపిందన్నారు. గతంలోనే రుణమాఫీపై మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని ప్రకటించి మరోసారి మోసం చేసే కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యాయని గుర్తు చేశారు.
ఇంటిస్థలాల రెగ్యులరైజేషన్, డిపెండెంట్ ఉద్యోగాలు, ఏసీ సౌకర్యం, ఇంటికి రుణాలు ఇప్పించామని గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ ను కాకా కుటుంబం మాత్రమే అనుభవిస్తోందని, ప్రస్తుతం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండగా, మళ్లీ ఎంపీ టికెట్ ను కూడా వారి కుమారుడికే కేటాయించారని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో ఉన్న రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇతర ఎస్సీలు లేరా అని ప్రశ్నించారు. ఆరుగురు ఎమ్మెల్యేలు, చివరికి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కూడా అడ్డుకున్నా గడ్డం వంశీ ఎంపీ టికెట్ తెచ్చుకున్నారని తెలిపారు. వేలాది కోట్లు ఖర్చు పెట్టి గల్లీ నుంచి ఢిల్లీ దాకా నాయకులను కొని ఎన్నికల్లో ఎంపీ టికెట్ సంపాదించుకున్నారని పేర్కొన్నారు.
76 ఏండ్ల నుంచి ఇక్కడ కాకా కుటుంబం మాత్రమే పాలన చేస్తోందని ఆరోపించారు. ఈ ప్రాంతం ఏమైనా వారి జాగీరా అని ప్రశ్నించారు. ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభు త్వం మాదిగలకు తీవ్ర అన్యా యం చేసిందని చెప్పుకొచ్చారు. కేసీఆర్ మాత్రం రెండు మాదిగ, ఒకటి మాల సామాజిక వర్గానికి కేటాయించారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికుడిగా సమస్యలపై తనకు అవగాహన ఉంద ని, తనను గెలిపిస్తే కార్మికుల పక్షాన పార్లమెంట్లో తన గళం వినిపిస్తానని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టి ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్‌రెడ్డికి ఈ ఎన్నికలతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికలు బడా వ్యాపారీకి, సామాన్య కార్మికుడి నడుమ జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. నిత్యం ప్రజల మధ్య ఉండి సేవ చేసే కొప్పుల ఈశ్వర్‌ను ప్రజలు ఆదరించాలన్నారు. నెల రోజుల ముందు గడ్డం వంశీ అంటే ఎవరో కూడా తెలియదని, ప్రజలతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని, ప్రజలు ఆయనను నమ్మే స్థితిలో లేరని తెలిపారు. కేసీఆర్‌ది కుటుంబపాలన అని మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డికి కాకా కుటుంబం ఎందుకు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ పాతబస్తీ నుంచి వలస వచ్చి 60 ఏండ్లుగా ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నారని కాకా కుటుంబంపై మండిపడ్డారు. ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు దండుకుంటూ లక్షల కోట్లు సంపాదించిన కాకా కుటుంబం పలు రాష్ర్టాల్లో కంపెనీలు ఏర్పాటు చేసిందని, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో మాత్రం ఒక్క కంపెనీ కూడా ఏర్పాటు చేయలేదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల సమన్వయకర్త రాములు యాదవ్, మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ వాజిద్ పాషా, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికెల శ్రావణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు నూనెటి సత్యనారాయణ, టీబీజీకేఎస్ నాయకులు దాసరి శ్రీనివాస్, ఆవుల రవికిరణ్, రాజనాల రమేశ్, లింగాల కిరణ్, అనుముల సత్యనారాయణ, నాయకులు రెవెల్లి విజయ్, సాజిద్ పాషా పాల్గొన్నారు.