శ్రీరాంపూర్, ఏప్రిల్ 22 : “సింగరేణిలో 26 ఏళ్లు పనిచేసిన. కార్మికుల ఇబ్బందులు కళ్లారా చూసిన. కార్పొరేట్ సంస్థ యజమానికి (కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ) కార్మికుల కష్టాలు ఏం తెలుసు’ అని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం శ్రీరాంపూర్ ఆర్కే-7, ఆర్కే-7ఏ గనులపై మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ చైర్మన్ మిర్యాల రాజిరెడ్డితో కలిసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గనులపై కార్మికులతో కలిసి బొగ్గు టబ్బులను ముందుకు నెట్టారు. డిపార్ట్మెంటుల వారీగా కార్మికులను కలిసి ఓట్లు అభ్యర్థించారు.
ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ గనులపై తిరుగుతుంటే కార్మికునిగా పనిచేసిన రోజులు గుర్తుకు వస్తున్నాయన్నారు. తనను ఎంపీగా గెలిపిస్తే పార్లమెంటులో కార్మికుల గొంతుకనవుతానని చెప్పారు. పార్లమెంటులో బొగ్గు గని కార్మికుల ఐటీ రద్దుకు కృషి చేస్తానని తెలిపారు. కార్మికులు అనేక హక్కులు కల్పించిన కేసీఆర్‌పై నమ్మకం, విశ్వాసం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. సింగరేణిలో 20 వేల మంది యువతకు ఉద్యోగాలు కల్పించిన ఘనత కేసీఆర్‌దేనని కొనియాడారు.
ఈ సమావేశంలో టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి, బండి రమేశ్, పానగంటి సత్తయ్య, తొంగల రమేశ్, పుప్పాల సంపత్, రాజునాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నడిపెల్లి విజిత్‌రావు, పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి మేరుగు పవన్, మాజీ జడ్పీటీసీ తిప్పని రామయ్య, మాజీ సర్పంచులు జగ్గయ్య, టీబీజీకేఎస్ నాయకులు కౌన్సిలర్ వంగ తిరుపతి, బేర సత్యనారాయణ, జనార్దన్, నాయకులు అన్వేష్‌రెడ్డి, గర్సె రామస్వామి, రఫీఖ్ఖాన్, గాజం ఎల్లయ్య, బండి తిరుపతి, రవిగౌడ్, పొగాకు రమేశ్, పెద్దపల్లి రామయ్య పాల్గొన్నారు.
ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సోమవారం శ్రీరాంపూర్ ఆర్కే-6 గుడిసెలు, గాంధీనగర్, వాటర్ ట్యాంక్ ఏరియాల్లో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావుతో కలిసి ప్రచారం చేశారు.
16, 17 వార్డుల్లో మాజీ సర్పంచ్‌లు గుంట జగ్గయ్య, రఫీఖ్ఖాన్లతో కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న వారందరికీ కేసీఆర్ పట్టాలిచ్చారని గుర్తు చేశారు. కేసీఆర్‌పై ఉన్న విశ్వాసంతో ప్రజలంతా కారుగుర్తుకే ఓటు వేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ ఈసంపెల్లి ప్రభాకర్, నాయకులు బండి రమేశ్, పానగంటి సత్తయ్య, తొంగల రమేశ్, పుప్పాల సంపత్, నాయజనార్దన్, నాయకులు గర్సె రామస్వామి, గాజం ఎల్లయ్య పాల్గొన్నారు.
లక్షెట్టిపేట, ఏప్రిల్ 22 : బీఆర్ఎస్ పాలనలో ప్రజలంతా క్షేమంగా, సంతోషంగా ఉన్నారని, మళ్లీ అలాంటి రోజులు రావాలంటే కారు గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. సోమవారం సాయంత్రం వెంకట్రావుపేట గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావుతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, కేసీఆర్ రాష్ర్టాన్ని సాధించి ప్రగతి పథంలో నడిపించారని గుర్తు చేశారు. ఈ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే అందుబాటులో ఉండి సేవ చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ అద్యక్షుడు అంకతి గంగాధర్, ఎంపీటీసీ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.