జైనూర్, అక్టోబర్ 11 : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గులాబీ పార్టీకే పట్టం కట్టాలని ఆసిఫాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోవలక్ష్మి అన్నారు. జైనూర్ మండలంలోని బూసిమెట్ట క్యాంపు, ధబోలి గ్రామ పంచాయతీల పరిధిలోని పలు గ్రామాల్లో ఆమె బుధవారం పర్యటించారు. ఇంటింటికీ తిరుగుతూ సంక్షేమ పథకాలను వివరించారు.
గ్రామస్తులను ఆప్యాయంగా పలకరిస్తూ.. సలహాలు, సూచనలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలే నా బలమని, పార్టీ అభ్యర్థిగా నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కనక యాదవ్, ఎంపీపీ కుమ్ర తిరుమల విశ్వనాథ్, వైస్ ఎంపీపీ చిర్లె లక్ష్మణ్, జిల్లా కో-ఆప్షన్ సభ్యుడు అబ్బుతాలిబ్, నాయకులు పాల్గొన్నారు.