సీసీసీ నస్పూర్, అక్టోబర్ 8: కాంగ్రెస్ మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీ బాకీ కార్డు ఇంటింటికీ చేరవేసే కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. బుధవారం మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని పార్టీ కార్యాలయంలో చెన్నూర్ నియోజకవర్గ కార్యకర్తలకు నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై దిశా నిర్ధేశం చేశారు. నియోజకవర్గం నుంచి పార్టీలోకి చేరడానికి అనేక మంది ఆసక్తి చూపుతున్నారని, ఆయా మండలాల నాయకులు పార్టీలో చేరేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్తగా పార్టీలో చేరే వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని, అధికారం కోల్పోయి కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికే టికెట్లు కేటాయిస్తామని ప్రకటించారు.
ఉద్యమంలా కాంగ్రెస్ బాకీ కార్డుల పంపిణీ..
కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు, 420 హామీలు అమలు కావడం లేదని బాల్క సుమన్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ పేరిట ఉద్యమాన్ని చేపట్టారన్నారు. మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని హామీ ఇచ్చారని, 22 నెలల్లో రూ.55 వేలు మహిళలకు బాకీ పడ్డారని, వృద్ధులకు రూ.4 వేల పెన్షన్‌తో రూ.44 వేలు, దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్‌తో రూ.44 వేలు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు తులం బంగారం, విద్యార్థులకు స్కూటీలు, ఫీజు రీయింబర్స్మెంట్ కింద రూ.8 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని వివరించారు.
రైతు భరోసా కింద నాలుగెకరాల కౌలు రైతులకు రూ.75 వేలు, రుణమాఫీ కింద రూ.2 లక్షలు, సన్న వరి బోనస్ రూ.500, ఎకరానికి రూ.12,500లతో నాలుగు పంటలకు రూ.50 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు రెండేళ్లకు రూ.24 వేలు, నిరుద్యోగులకు రూ.2 లక్షల ఉద్యోగాలు, జీవనభృతి కింద రూ.88 వేలు, విద్యా భరోసా కార్డు రూ.5 లక్షలు, ఆటో కార్మికులకు సంవత్సరానికి రూ.12 వేల చొప్పున బాకీ పడినట్లు ఆయన తెలిపారు.
కాంగ్రెస్ ప్రజలకు బాకీ పడిన కార్డులు ప్రణాళిక ప్రకారం పకడ్బందీగా ఇంటింటికీ చేరవేసేలా కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్డు అందజేస్తున్న క్రమంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఎలా మోసానికి పాల్పడిందో ప్రజలకు వివరించాలని, అలాగే బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీసే విధంగా వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు.
అప్పు చేసి సంపద సృష్టించిన కేసీఆర్..
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణగా మార్చడానికి రూ.3.50 లక్షల కోట్లు అప్పు చేసి.. సంపద సృష్టించారని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు. కేసీఆర్ అప్పు చేసి ప్రాజెక్ట్‌లు, కలెక్టర్ కార్యాలయాలు, పోలీస్ కమిషనరేట్లు, డబుల్బెడ్రూం ఇండ్లు, పెండింగ్ ప్రాజెక్ట్‌లు, అసెం బ్లీ నూతన భవనం, రైతు వేదికలు, రోడ్లు, బ్రిడ్జిలు, హాస్పిటళ్లు, నూతన మెడికల్ కళాశాలలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, పల్లె, పట్టణాల ప్రగతి, ఇలా అనేక రంగాల్లో విశేషమైన అభివృద్ధి పనులు చేపట్టి తెలంగాణ రూపురేఖలు మార్చారని గుర్తు చేశారు.
హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దారని చెప్పారు. కేసీఆర్ చేసిన అప్పు రూ.50 లక్షల కోట్ల సంపదను సృష్టించిందని, ఈ విషయాన్ని కార్యకర్తలు ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే రూ.2.50 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు. అసలు ఆ అప్పుకు లెక్కలు లేవని, చేసిన అభివృద్ధి కూడా శూన్యమన్నారు. అప్పు చేసి దేనికి ఖర్చు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీలేదని, తమ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారన్నారు.
సీఎం నుంచి మంత్రులు, బడా నాయకులు తమ ఆస్తులు పెంచుకోవడానికి అడ్డదారులు తొక్కుతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణ సంపద అంతా ఢిల్లీ పెద్దల జేబుల్లోకి చేరుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హ యాంలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేదన్నా రు. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులకు యూ రియా కొతర ఏర్పడిందని, రైతుల కష్టాలు పడుతుంటే యూరియా కొరతలేదని కొందరు, కేం ద్రం యూరియా అందించడంలేదని మరికొందరు కాంగ్రెస్ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటేస్తే తెలంగాణ ప్రజలను రోడ్డును పడేసిందని ధ్వజమెత్తారు. అకాల వర్షాలతో పంటలు నష్టపోతే పరిహారానికి దిక్కులేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రజలకు అండగా బీఆర్ఎస్ పార్టీ..
ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వ హామీలపై కొట్లాడుతూనే ఉంటామని, ప్రభుత్వం తమపై ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేసే ప్రసక్తేలేదని బాల్క సుమన్ స్పష్టం చేశారు. ఎప్పటికైనా ప్రజలకు అండగా ఉండేది కేవలం బీఆర్ఎస్ పార్టీయేనని ఆయన తెలిపారు. తమ హయాంలో చెన్నూర్‌లో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. సింగరేణి నివాస స్థలాలకు ఇండ్ల పట్టాలు, సుద్దాల వాగుపై బ్రిడ్జి, తుంతుంగా వాగుపై బ్రిడ్జి, అనేక మారుమూల గ్రామాలకు రోడ్లు, బ్రిడ్జిలు నిర్మించామన్నారు. చెన్నూర్‌లో కొత్త హాస్పిటల్, సెంట్రల్ లైటింగ్, అటవీ శాఖ ఏకో పార్కు, రామకృష్ణాపూర్లో ఫ్లైఓవర్ బ్రిడ్జి, గాంధారి వనం, ఇలా వందలాది కోట్ల నిధులతో అనూహ్యంగా అభివృద్ధి చేసి చూపించామన్నారు.
ఈ విషయం నియోజకవర్గంలోని ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ బాకీ కార్డు ఇస్తున్న క్రమంలో తాము చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని, మంత్రి వివేక్ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. వివేక్ కాంగ్రెస్ నుంచి గెలిచి ఒక్క అభివృద్ధి పని చేయలేదని, తాము తీసుకువచ్చిన నిధులను రద్దు చేయించారని అన్నారు. గోదావరి వరద పంట పొలాల్లోకి రాకుండా కరకట్టలు కట్టిస్తానని ఆయన ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైయ్యారని ఆరోపించారు.
కష్టపడ్డవారికే పార్టీ టికెట్లు..
అధికారం కోల్పోయిన తర్వాత కష్టకాలంలో పార్టీ కోసం పనిచేసిన వారికే స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు కేటాయిస్తామని బాల్క సుమన్ స్పష్టం చేశారు. కొత్తగా పార్టీలోకి వచ్చే వారికి టికెట్లు ఇవ్వమన్నారు. పదవుల కోసం కాకుండా, పార్టీ కోసం పనిచేసే వారినే కొత్తగా పార్టీలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. చెన్నూర్ నియోజకవర్గంలో మొత్తం 38 ఎంపీటీసీ, 5 జడ్పీటీసీ, 105 గ్రామ పంచాయతీలు ఉన్నాయన్నారు. ఎన్నికల నోటిఫికేషన్, రిజర్వేషన్ల ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహించి, చర్చించిన తర్వాతే ఎవరికి టికెట్లు ఇవ్వాలో ప్రకటన చేస్తామన్నారు.
ఒక గ్రామంలోని నాయకులు, మరో గ్రామంలో తలదూర్చవద్దని, దీంతో పార్టీలో ఐక్యత దెబ్బతింటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సారి డబ్బులు ఉన్నవారికే కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చిందని, ఈ విషయాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రజల దృష్టికి తీసుకెళ్లి వారికి ఓటుతో బుద్ధిచెప్పే విధంగా ప్రచారం చేయాలని సూచించారు. కార్యకర్తలు నిత్యం ప్రజల్లోనే ఉండాలని సూచించారు.
ఎన్నికల సమయంలో తాను ప్రతి గ్రామంలో పర్యటించి అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ రాజారమేశ్, జైపూర్ మండల అధ్యక్షుడు అరవిందరావు, భీమారం మండల అధ్యక్షుడు కలగూర రాజ్‌కుమార్, కోటపల్లి మండల అధ్యక్షుడు ఓదెలు, నాయకులు దేవేందర్‌రెడ్డి, మంత్రి బాపు, శ్రీనివాస్‌గౌడ్, రాంలాల్ గిల్డా, సుదర్శన్‌గౌడ్, తిరుపతిరెడ్డి, బత్తుల శ్రీనివాస్, బడికెల సంపత్‌కుమార్, గోగుల రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.