భైంసా/భైంసాటౌన్,/కుంటాల, మే, 16 : రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోబోమని, ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట కోత విధించవద్దని, ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని బీఆర్ఎస్ ముథోల్ నియోజకవర్గ నాయకులు డిమాండ్ చేస్తూ శుక్రవారం కుంటాల మండలానికి వచ్చిన రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కను అడ్డుకోవడానికి యత్నించారు. వారిని పోలీసులు అరెస్టు చేసి నర్సాపూర్ (జీ) పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు డాక్టర్ కిరణ్ కొమ్రేవార్, జడ్పీ మాజీ చైర్మన్ లోలం శ్యాంసుందర్ మాట్లాడుతూ రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో తాలు, తప్ప పేరిట క్వింటాలుకు 5 కిలోలు కోత విధించడం అన్యాయమని, రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు బంధు బందైపోయిందన్నారు.కల్యాణలక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ఇప్పటికీ అమలు చేయలేదన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసే వరకూ ప్రశ్నిస్తునే ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుంటాల మండల నాయకులు దత్తాద్రి, బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి దశరథ్, రజినీకాంత్, శ్రీనివాస్, పోశెట్టి, రమేశ్, లక్ష్మణ్, మహేశ్, రావుల పోశెట్టి, రవి, రావుల వనిత, హస్డే సజన్, తదితరులు ఉన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని కుం టాల మండలానికి వచ్చిన మంత్రులను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసి నర్సాపూర్ పోలీస్‌స్టేషన్ తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యుడు విలాస్ గాదేవార్తో ఫోన్లో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడవద్దన్నారు. మరిన్ని పోరాటాలకు సిద్ధంగా ఉండాలన్నారు. పోలీస్‌స్టేషన్ నుంచి 2 గంటల్లో విడుదల చేయకపోతే బీఆర్ఎస్ లీగల్ టీంను పంపిస్తానని నాయకులు, కార్యకర్తలకు కేటీఆర్ భరోసానిచ్చారు. ఆయన వెంట ముథోల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు కిరణ్ కొమ్రేవార్, లోలం శ్యాం సుందర్, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.