మంచిర్యాల, ఆగస్టు 1(నమస్తే తెలంగాణ) : ‘తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఆడబిడ్డలను అవమానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్ సీనియర్ మహిళా శాసనసభ్యులు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలపై అనుచితమైన వ్యాఖ్యలు చేశారు.’ ఈ అవమానాన్ని సహించేది లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసనలు తెలిపారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. బీఆర్ఎస్ మహి ళా నాయకులపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సబితాఇంద్రారెడ్డిని విమర్శించే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదంటూ మండిపడ్డారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకుల ఎదురుదాడిని తట్టుకునే సత్తా లేకే ఆడబిడ్డలపై అనవసర ఆరోపణలు చేస్తూ సభను తప్పుతోవ పట్టించేందుకు ఎత్తుగడలు వేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అసమర్థ పాలనను జనం ఛీ కొట్టే రోజులు ఎంతో దూరంలో లేవని, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలంటూ హెచ్చరించారు. ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసనలు నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. బెల్లంపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొన్నారు. మిగిలిన నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.
ముందస్తు అరెస్టులు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ నియోజకవర్గ వ్యాప్తంగా నిరసనకు సిద్ధమైన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కొన్ని చోట్ల ముందస్తు అరెస్టులు చేయగా, మరి కొన్నిచోట్ల సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలు దహనం చేసి నిరసన తెలుపుతున్న నాయకులను అదుపులోకి తీసుకున్నారు. చెన్నూర్‌లో నిరసనకు సిద్ధమైన నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి రాజారమేశ్, చెన్నూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నా యకులను ముందుస్తుగా అరెస్టు చేశారు.
నిరసన చేయకుండా పోలీసులు టౌన్‌లోని ప్రధా న సెంటర్లలో నిఘా పెట్టడంతో బీఆర్ఎస్ నాయకులు రాజీవ్ రహదారిలో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌ను తీసుకెళ్లారు. కోటపల్లి మండల కేంద్రంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేయకుండా బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేశారు. దీంతో మిగిలిన కార్యకర్తలు పారుపల్లి గ్రామంలో సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని ధర్నా చౌక్‌లో పోలీసులు బందోబస్తు పెట్టారు. దీంతో సాయంత్రం వరకు నిరసన తెలిపేందుకు ఎదురు చూసిన బీఆర్ఎస్ నాయకులు చివరకు పోలీసుల ముందే దిష్టిబొమ్మ తీసి దహనం చేసే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే మీడియాతో మాట్లాడి వెళ్లిపోయారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిరసనలో భాగంగా దిష్టిబొమ్మను దహనం చేసేందుకు పోలీసులు అవకాశం ఇవ్వలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలోనే కార్యక్రమాన్ని నిర్వహించారు.