ఎదులాపురం/ఇచ్చోడ/నిర్మల్ అర్బన్/ఖానాపూర్ టౌన్, మార్చి 12 :ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్, జాగృతి నేతలు భగ్గుమన్నారు. ఆదివారం రెండో రోజూ ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో నిరసనలతో హోరెత్తించారు. సంజయ్ దిష్టిబొమ్మలతో శవయాత్ర నిర్వహించి, దహనం చేశారు. ఆయన ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ ఊరేగించారు. బండి డౌన్.. డౌన్ అంటూ నినాదాలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే నాలుక కోస్తామంటూ హెచ్చరించారు. క్షమాపణలు చెప్పకుంటే ఆందోళనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు.
ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు, జాగృతి నాయకులు భగ్గుమన్నారు. ఆదివారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లోని ప్రధాన చౌరస్తాలు, రోడ్లపై నిరసనలతో హోరెత్తించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి బీఆర్ఎస్ పట్టణ మహిళా నాయకులు, తెలంగాణ జాగృతి నాయకులు, ప్రజాప్రతినిధులు బండి సంజయ్ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆయన ఫ్లెక్సీలను చెప్పులతో కొడుతూ ఊరేగించారు. కలెక్టర్ చౌరస్తా వరకు చేరుకొని దిష్టిబొమ్మను దహనం చేశారు. బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని, లేదంటే నాలుక కోస్తామని హెచ్చరించారు. ఇచ్చోడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ శ్రేణులతో కలిసి ధర్నా నిర్వహించారు.
గంటన్నర పాటు రోడ్డుపై బైఠాయించారు. పీఎం మోదీ, ఎంపీ బండి సంజయ్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ఆడ బిడ్డ, ఎమ్మెల్సీ కవితను ఇబ్బందులకు గురిచేయడం మానుకోవాలని, లేదంటే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. కవితక్కపై కక్ష పూరిత చర్యలకు నిరసనగా తన జన్మదిన వేడుకలను రద్దు చేసుకున్నానని, కార్యకర్తలు, అభిమానులు, నాయకులు బాధపడి ఉంటే క్షమించాలని కోరారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము శ్రేణులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్లో బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ సీఐ మల్లేశ్‌కు ఫిర్యాదు చేశారు. ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో ఖానాపూర్, కడెం మండలానికి చెందిన బీఆర్ఎస్, జాగృతి నాయకులు రాస్తారోకో చేశారు. బండి సంజయ్ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి.. దహనం చేశారు.
క్షమాపణ చెప్పాల్సిందే
సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకనే బీజేపీ సర్కారు దర్యాప్తు సంస్థలను ఉసిగొ ల్పుతున్నది. కవితను కుట్రపూ రితంగా ఇబ్బంది పెడుతున్నది. బండి సంజయ్ మహిళ అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నడు. ఆ పార్టీ ఆయనకు నేర్పిన సంస్కారం ఇదేనా. ఇకనైనా బండి సంజయ్ కవితక్కకు క్షమాపణ చెప్పాలి. లేదంటే తగిన గుణపాఠం తప్పదు.
– పర్వీన్ ఫిరోజ్, రణదివ్యనగర్, ఆదిలాబాద్
సంజయ్ రాజకీయాలకు పనికిరాడు
ప్రతి క్షణం హిందూ ధర్మం అంటూ నీతులు చెప్పే బండి సంజయ్ ఇలా మహిళలను కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఆడవాళ్లను దేవతలుగా గౌరవించే సమాజంలో ఉండి ఇలాంటివి మాట్లాడడం నిజంగా సిగ్గుచేటు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు పనికి రాడు.
– బియ్యల అనసూయ, మోచిగల్లీ, ఆదిలాబాద్
బండివి బలుపు మాటలు
మహిళల హక్కుల సాధన కోసం పోరాటం చేస్తున్న ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు సరికావు. ఆడబిడ్డ అని కూడా చూడకుండా బలుపు మాటలు మాట్లాడుతున్నడు. మహిళా లోకాన్ని అవమానపరిచేలా మాట్లాడినందుకు అతడిపై చర్యలు తీసుకోవాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఉండి సంస్కారం లేకుండా వ్యవహరించడం సిగ్గుచేటు.
– కస్తాల ప్రేమల, మాజీ ఐసీడీఎస్ ఆర్గనైజర్, సీనియర్ నాయకురాలు, తిర్పెల్లి, ఆదిలాబాద్