Sabarimala : శబరిమల ప్రసాదం తయారీలో హలాల్ సింబల్ కలిగిన బెల్లం వాడకంపై కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రసాదం తయారీకి అవసరమైన ముడి సరుకు కొనేముందు వాటి లేబుల్స్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని, అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు శబరిమల దేవస్థానాన్ని నిర్వహించే ట్రావెన్కోర్ దేవస్థాన బోర్డ్ (టీడీబీ)కి హైకోర్టు సూచించింది. ప్రసాదం తయారీలో హలాల్ వాడకంపై దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
శబరిమల అయ్యప్ప ఆలయంలో అరవణ, అప్పం ప్రసాదాల తయారీకి అనేక రకాల ముడి పదార్థాలు వినియోగిస్తుంటారు. ఈ ముడి పదార్థాలలో హలాల్ సర్టిఫైడ్ బెల్లం కూడా ఉంది. దీంతో ఈ పదార్థం వినియోగాన్ని వ్యతిరేకిస్తూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మహారాష్ట్రకు చెందిన ఒక సంస్థ ఈ బెల్లాన్ని తయారు చేస్తుందని, ఇదే సంస్థ పశ్చిమాసియాలోని పలు ముస్లిం దేశాలకు కూడా బెల్లం సరఫరా చేస్తుండటంతో హలాల్ సర్టిఫికేషన్ కలిగి ఉందని కోర్టు గుర్తించింది. అందుకే, ఇలాంటి ఉత్పత్తుల కొనుగోలు విషయంలో అప్రమత్తంగా ఉండాలని కోర్టు సూచించింది.
ప్రసాదం తయారీలో వాడే పదార్థాలు ఎలాంటి సూచికలు, ప్రకటనలు కలిగి ఉండరాదని కోర్టు పేర్కొంది. వేరే మతపరమైన సూచనల వల్ల శబరిమలలో అనుసరించే మత విశ్వాసాలు, సంప్రదాయాలు దెబ్బతింటాయని కోర్టు అభిప్రాయపడింది. అయితే, ప్రసాదం తయారీలో వాడుతున్న బెల్లం సర్టిఫికేషన్ విషయంలోనే అప్రమత్తంగా ఉండాలని, అంతేకానీ, పదార్థం నాణ్యత విషయంలో ఎలాంటి ఇబ్బందీ లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది 2021లో దాఖలైన కేసు. జస్టిస్ రాజా విజయరాఘవన్ వి. జస్టిస్ కేవీ జయకుమార్ ఆధ్వర్యంలోని బెంచ్ దీనిపై తాజాగా విచారణ జరిపి కీలక సూచనలు చేసింది.
శబరిమలలో తయారు చేసే ప్రసాదంలో హలాల్ సర్టిఫికేషన్ కలిగిన బెల్లం వాడుతున్నారని, దీన్నే భక్తులకు అందిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. భక్తుల విశ్వాసాలు, సంప్రదాయాలను దెబ్బతీసే ఇలాంటి పదార్థాలను నిషేధించాలి కోరుతూ ఈ పిటిషన్ దాఖలైంది. శబరిమలలో అత్యంత ప్రత్యేకమైన, విశిష్టమైన ప్రసాదం అరవణ. పాయసంలాంటి ఈ ప్రసాదాన్ని బెల్లం, బియ్యంతో తయారు చేస్తారు. అప్పం అనే స్వీట్‌ను కూడా బెల్లం, బియ్యాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. ఇక, ఇప్పటివరకు శబరిమల ఆలయానికి 19,96,034 కిలోల బెల్లాన్ని హలాల్ సర్టిఫికెట్ కలిగిన సంస్థ సరఫరా చేసింది. ఈ నేపథ్యంలో మత విశ్వాసాలు దెబ్బ తినకుండా చూడాలని కోర్టు సూచించింది.