మంచిర్యాల, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు సర్వం సిద్ధం కాగా, స్వచ్ఛందంగా తరలివెళ్లేందుకు గులాబీ సేన సన్నద్ధమైనది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి దాదాపు 40 వేల మంది కార్యకర్తలు, నాయకులు, అభిమానులు హాజరుకానుండగా, అందుకనుగుణంగా ఏర్పాట్లు చేసింది.
2001లో బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ వెన్నంటే ఉన్నది. ఇప్పుడు మరోసారి అండగా నిలిచేందుకు సిద్ధమైంది. 14 ఏండ్ల సుదీర్ఘ ఉద్యమం చేసి స్వరాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్. పదేండ్ల పాలనలో అనేక అద్భుతాలు చేసింది. వ్యవసాయ రంగం మొదలు.. ఐటీ వరకు.. ఇలా అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపింది. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన రైతుబంధు, రుణమాఫీ, రైతు బీమా, పట్టణ, పల్లె ప్రగతి, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌వంటి పథకాలు చరిత్రలో నిలిచిపోయాయి. పొరుగున ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం సైతం తెలంగాణలో అధ్యయనం చేసి బీఆర్ఎస్ పథకాలను అనుసరించాయి. కొత్త జిల్లాల ఏర్పాటు, నియోజకవర్గాల్లో అభివృద్ధి పరుగులు పెట్టింది. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో బీఆర్ఎస్ మార్క్ పాలన కనిపించడం లేదు. రైతుల ఆత్మహత్యలు మళ్లీ మొదలయ్యాయి. పంట పెట్టుబడి సాయం రైతుబంధు రాకుండా పోయింది. రుణమాఫీ అరకొరగా అందింది. ఒకప్పుడు తెలంగాణలో కళకళలాడిన వ్యవసాయం తిరోగమన దిశలోకి వెళ్లిపోయింది. నీరు లేక పంటలు ఎండిపోయే దుస్థితి దాపురించింది. ఆరు గ్యారెంటీల అమలులో అధికార పార్టీ ఘోరంగా విఫలమైంది. ఏ ఒక్క పనీ.. సరిగా చేసి చూపింది లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో విచిత్రమైన పరిస్థితి నెలకొన్నది. ఏ ఒక్క వర్గం కూడా ఆ నందంగా లేదనేది సుస్పష్టంగా కండ్ల ముందు సాక్షాత్కరిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాధాన్యత సంతరించుకున్నది. పాలనపై జనాలు మండిపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. అధికారం కోల్పోయాక నిర్వహిస్తున్న తొలి సభను విజయవంతం చేసి.. బీఆర్ఎస్ సత్తా చాటేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నది.
రజతోత్సవ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడంపై అధినేత కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ నెలలో జిల్లాల వారీగా పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. సభను విజయవంతం చేయడానికి చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షులు, ని యోజకవర్గాల ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు పార్టీ శ్రేణులను ఏకం చేశారు. ఎక్కడికక్కడ సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఉమ్మడి జి ల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు జరిగాయి. నియోజకవర్గానికి మూడు వేల మందిని సభకు తరలించేలా కార్యాచరణ రూపొందించారు. అన్ని మండలాల్లోనూ సమావేశాలు నిర్వహించి పార్టీ కా ర్యకర్తలను సిద్ధం చేశారు. దీంతో చాలా మంది స్వచ్ఛందంగా సభకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గానికి మూడు వేల మంది అనుకుంటే.. నాలుగు వేల నుంచి ఐదు వేల మంది తరలివచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నా రు. లక్ష్యానికి మించి గులాబీ సైన్యం సభకు వెళ్లే అవకాశాలున్నాయి. సభ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు విస్తృతంగా సభలు, సమావేశాలు నిర్వహించడం పార్టీకి కలిసి వ చ్చింది. ఎక్కడ మీటింగ్ పెట్టినా అద్భుతమైన స్పందన లభించింది. పార్టీలో తిరిగి చేరికలు ప్రారంభమయ్యాయి. రజతోత్సవ సభలో అధినేత కేసీఆర్, పార్టీ కార్యవర్గం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి 100 శాతం కట్టుబడి పని చేసేందుకు గులాబీ సైన్యం సిద్ధమైంది. ఎక్కడ చూసినా రజతోత్సవ సభ గురించి, కేసీఆర్ ఏం మాట్లాడుతారా.. ఏం పిలుపునిస్తారా..? అనే చర్చ ఆసక్తిగా నడుస్తున్నది.
రజతోత్సవ సభలో ఉమ్మడి జిల్లా సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఆయా జిల్లాల్లోని అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అధినేత దిశానిర్దేశం మేరకు భారీగా సభకు ముఖ్య కార్యకర్తలు, నాయకులను తరలించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నా లెక్క చేయకుండా పార్టీ శ్రేణులు సభకు వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి నియోజకవర్గం నుంచి 60 నుంచి 70 బస్సులను సిద్ధం చేశారు. ఇవేగాకుండా కార్లలోనూ ముఖ్యనాయకులు, అభిమానులు తరలివెళ్లనున్నారు. ద్విచక్రవాహనాలపై ర్యాలీగా మరి కొందరు వెళ్లనున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా ఉదయాన్నే గ్రామాల్లో పార్టీ జెండాలను ఆవిష్కరించాలని నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రతి గ్రామానికీ అవసరమైన భారీ గులాబీ జెండాలను సరఫరా చేశారు. ఉదయాన్నే జెండాలు ఎత్తుకొని బస్సుల్లో బయల్దేరి వెళ్లేందుకు రూట్‌మ్యాప్‌లను సిద్ధం చేసుకున్నారు. మధ్యాహ్నం భోజనాలు చేసుకొని నేరుగా సభా ప్రాంగణానికి వెళ్లాలని, ట్రాఫిక్‌లో ఇరుక్కుపోకుండా సభకు ముందుగానే వెళ్లేలా సమయాత్తం అవుతున్నారు. ఈ మేరకు బస్సులు ఎక్కడికి వస్తాయి.. ఒక్క బస్సులో ఎంత మంది వెళ్లాలి.. మధ్యాహ్న భోజనం ఎక్కడ ఏర్పాటు చేశారు ? అనే వివరాలన్నీ ఇప్పటికే ఇన్చార్జిలకు అందజేశారు. ఈ మేరకు పక్కా ప్రణాళికతో ఉమ్మడి జిల్లా నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు సభకు తరలివెళ్తున్నారు. ఈ రజతోత్సవ సభ జిల్లాలో పార్టీకి పుర్వవైభవం తీసుకురావడంలో కీలక భూమిక పోషించనున్నదని పార్టీ నాయకులు, కార్యకర్తలు విశ్వసిస్తున్నారు.
ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణానికి సులువుగా చేరుకునేలా జోన్ల వారీగా రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశారు. లక్షలాదిగా తరలి వచ్చే బీఆర్ఎస్ బం ధుగణం కోసం 5 జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆయా జోన్ల వారీగా ప్రత్యేకంగా 5పార్కింగ్ జోన్లను సైతం
సిద్ధం చేశారు. సభా ప్రాంగణానికి మొత్తం 4 రహదారుల గుండా వాహనాలు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.
సిద్దిపేట-హుస్నాబాద్ నుంచి: ఇది 765వ డీజీ జాతీయ రహదారి. ఈ రూట్ నుంచి మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలు సహా వెస్ట్ ఆదిలాబాద్ (ఆదిలాబాద్, నిర్మల్, బోథ్, ఖానాపూర్ నియోజక వర్గాలు) నుంచి కార్యకర్తలు వస్తారు. పారింగ్ జోన్ 5: సిద్దిపేట జాతీయ రహదారి 765(డీజీ) మీదుగా సిద్దిపేట, హుస్నాబాద్, ములనూరు, గోపాల్పూర్ క్రాస్‌రోడ్, ఇందిరానగర్ మీదుగా ఈ పారింగ్ జోన్-5కు చేరుకునేలా ఏర్పాట్లుచేశారు. మరో రూట్లో వేలేరు, కొత్తకొండ, ముత్తారం వైపు నుంచి పారింగ్ జోన్-5కు చేరుకునేలా ఏర్పాట్లు ఉన్నాయి. మరో రూట్ అయిన కరీంనగర్ మీదుగా వచ్చే వాహనాలు కోతులనడుమ మీదుగా దారి మళ్లించుకుని గోపాల్పూర్, గోపాల్పూర్ క్రాస్‌రోడ్, సిద్దిపేట జాతీయ రహదారి మీదుగా ఇందిరానగర్ నుంచి పారింగ్ జోన్-5కు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు.