చింతలమానేపల్లి, జూలై 14 : ప్రజల సమస్యలను గాలికొదిలి రేవంత్ రెడ్డి సర్కారు రాజకీయాల మీద దృష్టి పెట్టిందని, ఇచ్చిన హామీలు మరచిన ప్రభుత్వంపై ఇప్పటికే ప్రజల్లో విరక్తి వచ్చిందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. రైతాంగానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎప్పడు పూర్తి చేస్తారో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చింతలమానేపల్లి మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా సేకరించిన భూములకు ఇంకా రైతులకు నష్టపరిహారం అందలేదని, తక్షణమే పరిహారం చెల్లించాలని అన్నారు.
సిర్పూర్ నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న తుమ్మిడిహెట్టి, సాండ్‌గాం, రణవెల్లి, కోర్సిని గూడెం, హుడికిలి, లోనవెల్లి, సూర్జాపూర్, జంబుగ ఎత్తిపోతల ప్రాజెక్టులు పూర్తి చేసి సాగునీరు అందించాలన్నారు. అడ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసి 10 వేల ఎకరాలకు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగజ్‌నగర్ మండలం అంకుసాపూర్‌లో అధికార కాంగ్రెస్ నాయకులు చట్టవిరుద్ధంగా నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పులుల అభయారణ్యానికి కేవలం 60 మీటర్ల దూరంలో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, నేషనల్ బోర్డు ఫర్ వైల్డ్ లైఫ్ నుంచి అనుమతులు లేకుండానే చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేస్తున్నారని వివరించారు.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని కర్జవెల్లి-గూడెం మార్గానికి బీటీ రోడ్డు వర్షాలకు దెబ్బతిని నరక కూపంగా మారిందని మండిపడ్డారు. అధికార పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్సీ దండే విఠల్ చొరవతీసుకుని కేజీబీవీ పాఠశాలకు రోడ్డు వేయించాలని డిమాండ్ చేశారు. మళ్లీ కేసీఆర్ సర్కారు రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గోమాసె లహాంచు, నీలాగౌడ్, రామ్ ప్రసాద్, ఆవుల రాజ్‌కుమార్ యాదవ్ పాల్గొన్నారు.