Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్టు చేశారు. జోగు రామన్నతో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్టు చేశారు. ఇలా బీఆర్ఎస్ నేతల అరెస్టులో జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చనాకా కొరాటా ప్రాజెక్టు ట్రయల్ రన్‌కు రావడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగానికి 50 వేల ఎకరాలకు నీరు అందించాలన్న సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టి రైతులకు సంకల్పంతో కృషి చేశారని తెలిపారు. కానీ బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఒక్క ఎకరాకు కూడా అందించకుండా ట్రయల్ రన్ చేయడం, దాన్ని ప్రారంభించడం సిగ్గుమాలిన చర్య అని విమర్శించారు.
సీఎం పర్యటన నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి నుంచే పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అని జోగురామన్న మండిపడ్డారు. భేలా, జైనత్, ఆదిలాబాద్ మండల నాయకులను ఎక్కడికక్కడ అరెస్టులు చేయడం సమంజసం కాదని సూచించారు. ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను రైతులు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. రైతు సమస్యలు పరిష్కరించడంపై ధ్యాసలేని ఈ ముఖ్యమంత్రి కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ట్రయల్ రన్ అంటూ మోసం చేస్తున్నారని మండిపడ్డారు.