రామకృష్ణాపూర్, ఆగస్టు 2 : కార్మికుల భద్రత బాధ్యతపూర్తిగా సింగరేణి యాజమాన్యానిదేనని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ అన్నారు. మందమర్రి ఏరియాలోని కేకే-5లో శుక్రవారం జరిగిన ప్రమాదంలో జనరల్ మజ్దూర్ కార్మికుడు రాసపెల్లి శ్రావణ్‌కుమార్ (32) చనిపోవడం బాధాకరమన్నారు. శనివారం శ్రావణ్‌కుమార్ మృతదేహాన్ని పార్టీ నాయకులతో కలిసి రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్లో చూసి అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మాట్లాడుతూ యాజమాన్యానికి కేవలం ఉత్పత్తి పెరగాలే, లాభాలు ఆర్జించాలనే ధ్యాసేతప్ప.. ఎక్కడా కార్మికుల భద్రత, రక్షణ చర్యలపై పెద్దగా శ్రద్ధ్దచూపడం లేదని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులు ఆర్థికంగా నష్టపోవడానికి, కార్మికుల మరణాలకు కారణమవుతుందని తెలిపారు. ఈ 20 నెలల కాంగ్రెస్ పాలనలో కోల్బెల్ట్ఏరియాలో అనేక ప్రమాదాలు జరిగాయన్నారు. పాత యంత్రాలు వాడడం వల్లే ఘటన జరిగిందని, ఇది ముమ్మాటికీ రక్షణ చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంవల్లేనని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి కార్మికుల భద్రతపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.
కార్మికులను భద్రంగా చూసుకునే పరిస్థితి సింగరేణిలో రావాలని బీఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే కాలంలో ఛలో సింగరేణి భవన్ కార్యక్రమం చేపట్టి యాజమాన్యాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్మికుల సొంతింటి కల నెరవేర్చేందుకు 200 గజాల ఇంటి స్థలం ఎందుకు ఇస్తలేరని ప్రశ్నించారు. రామకృష్ణాపూర్లో ఇంటి పట్టాలు ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జీవో 76 ద్వారా నాలుగు వేల కుటుంబాలకు ఇండ్లకు పట్టాలు ఇప్పించామని గుర్తు చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామి చెన్నూరు నియోజక వర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చెన్నూరు ఇన్చార్జి డా. రాజా రమేశ్, సీనియర్ నాయకుడు రామిడి కుమార్, మందమర్రి మండల మాజీ జడ్పీటీసీ వేల్పుల రవి,నాయకులు రవీందర్, రాజశేఖర్, మాజీ కౌన్సిలర్ బోయినపెల్లి అనిల్‌రావు తదితరులు ఉన్నారు.