జన్నారం, డిసెంబర్ 9 : కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి మొలకెత్తుతున్నా ఎందుకు కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్‌నాయక్ ప్రశ్నించారు. సోమవారం జన్నారంలోని మార్కెట్ యార్డు, తిమ్మాపూర్‌లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని తేమ పేరుతో నెల రోజుల పాటు కొనకపోవడంతో వర్షానికి తడిసి మొలకలు వస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం టార్పాలిన్ కవర్లు కూడా ఇవ్వలేదన్నారు.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన సమయంలో అధికారుల నిర్లక్ష్యంతో కొనుగోలు కేంద్రాల్లో తడిసిపోయి రైతులు నష్టపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా వెంటనే వడ్లు కొనాలని లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల నాయకుడు గుర్రం రాజారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, మున్వర్ అలీఖాన్, జిల్లా అధికారప్రతినిధి సిటిమల భరత్‌కుమార్, ఫజల్‌ఖాన్, జాడి గంగాధర్, వినయ్‌కుమార్, సింగిల్ విండోచైర్మన్ నాసాని రాజన్న, బాలసాని శ్రీనివాస్‌గౌడ్, వీ నర్సాగౌడ్, జంగ సంతోష్ తదితరులు పాల్గొన్నారు.