ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 9 : ఖానాపూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు అండగా ఉంటానని పార్టీ అభ్యర్థి భూక్యా జాన్సన్ నాయక్ స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల ఆదరణ మర్చిపోలేనిదని పేర్కొన్నారు. ఉట్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఆయన పర్యటించారు. సాలేవాడ(కే) గ్రామంలోని హర హర మహాదేవ్ దేవాలయంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని హెచ్కేజీఎస్ ఫంక్షన్హాల్లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్సన్ నాయక్ మాట్లాడుతూ.. కార్యకర్తలే పార్టీకి పునాదులని పేర్కొన్నారు. అభివృద్ధితో పాటు ప్రజలకు సేవలందించేందుకే పూర్తి సమయం కేటాయించారన్నారు. ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏ రాష్టంలో లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని పేర్కొన్నారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని ప్రగతిలో మరింత ముం దుకు తీసుకెళ్తానన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌తోనే అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. అనంతరం నర్సాపూర్(బీ) గ్రామంలో పర్యటించారు. ఇక్కడ ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు.
కుమ్రం భీం విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఎగురవేశారు. సమావేశంలో మాట్లాడారు. ఖానాపూర్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ తనకు అవకాశం కల్పించారన్నారు. ప్రజల కోసం సేవచేయడం గొప్ప వరమని, మంత్రి కేటీఆర్ అవకాశం కల్పించారని పేర్కొన్నారు. అనంతరం లక్కారం గ్రామంలో పర్యటించారు. జీవవైవిధ్య మేనేజ్మెంట్ జిల్లా కమిటీ సభ్యుడు మర్సుకోల తిరుపతి దంపతులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. శాలువాతో సన్మానించారు. అనంతరం దేవుగనూగ గ్రామంలో గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. అలాగే హస్నాపూర్‌లో తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. లంబాడా సంస్కృతీ సాంప్రదాయాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పంద్ర జైవంత్‌రావు, ఏపీసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, నర్సాపూర్ సర్పంచ్ కళావతి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, ప్రధాన కార్యదర్శి సెడ్మకి సీతారాం, నాయకులు దాసండ్ల ప్రభాకర్, బాజీరావు, జగ్జీవన్, సింగారే భారత్, ప్రజ్ఞశీల్, వెంకటేశ్, ఆశన్న, మనోహర్, నారాయణ, అన్సా రీ, మహేందర్, షౌకత్, అనుదీప్, సాజీద్ సిదిధఖీ, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.