పెంచికల్పేట్/సిర్పూర్(టీ), అక్టోబర్ 21 : కాంగ్రెస్ సర్కారుపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రుణమాఫీ చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టింది. వర్కింగ్ ప్రెసిడెంట్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆర్ఎస్పీ పిలుపు మేరకు సోమవారం పెంచికల్పేట్ మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు బిట్టు శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రేణులు, రైతులు రాస్తారోకో నిర్వహించారు.
అరగంట పాటు ప్రధాన రహదారిపై ఆందోళన చేపట్టడంతో రవాణా స్తంభించింది. బిట్టు శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్ది రైతు ప్రభుత్వమని చెప్పుకుంటూనే వారిని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకూ నిరసనలు చేపడుతామన్నారు. ఎస్ఐ కొమురయ్య అక్కడికి చేరుకొని రాస్తారోకోను అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బీఆర్ అంబేదర్ యువజన సంఘం అధ్యక్షుడు కోట సతీశ్, నాయకులు దేవాజీ, పత్రు, శ్రీనివాస్ పాల్గొన్నారు.
సిర్పూర్(టీ)లోని బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై బీఆర్ఎస్ మండల కన్వీనర్ అస్లాంబిన్ అబ్దుల్లా ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, రైతులు ధర్నా నిర్వహించారు. ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పనాస లక్ష్మణ్, రాజేశ్, షేక్ చాంద్, నందాజీ, ప్రకాశ్, సంతోశ్, రైతులు పాల్గొన్నారు.