పదేండ్ల కేసీఆర్ పాలనలో వ్యవసాయాన్ని పండుగలా మార్చిన బీఆర్ఎస్.. మరోసారి సంక్షోభ స్థితిలోనున్న రైతన్న కోసం కదిలింది. అన్నదాతల బలవన్మరణాలు, సాగు సంక్షోభంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు జిల్లాల బాట పట్టింది. ఇటీవల అధినేత సూచన మేరకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన అధ్యయన కమిటీ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించి, రైతు కుటుంబాలకు భరోసానిచ్చింది. ధైర్యం కోల్పోవద్దని, అండగా ఉంటామని అభయమిచ్చింది.
మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, జనవరి 24 (నమస్తే తెలంగాణ)/నేరడిగొండ/బేల : రాష్ట్ర వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన రైతు ఆత్మహత్యలపై అధ్యయన కమిటీ సభ్యులు సత్యవతి రాథోడ్, జోగు రామన్న, పువ్వాడ అజయ్, కోటిరెడ్డి, యాదవరెడ్డి, బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్య యాదవ్ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో మొదటి సారి పర్యటించారు. కాంగ్రెస్ పాలనలో ఆగమై పలువురు రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, ఆయా కుటుంబాలను పరామర్శించారు. ఆత్మహత్యలకు గల కారణాలు, ప్రభుత్వం నుంచి అందిన సాయంపై ఆరా తీశారు. ముందుగా మధ్యాహ్నం ఒంటి గంటకు గుడిహత్నూర్ మండలం నేరడిగొండ తండాకు చేరుకొని, రైతు ఆడే గజానంద్ కుటుంబాన్ని పరామర్శించారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సొంతంగా రూ.లక్ష చెక్కును అందజేశారు.
అనంతరం కమిటీ సభ్యులు ఆదిలాబాద్‌కు చేరుకొని, కిసాన్‌చౌక్‌లో రైతు విగ్రహానికి పూలమాల వేశారు. అక్కడి నుంచి బేల మండలం రేణిగూడ చేరుకొని, ఇటీవల బ్యాంకులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న జాదవ్ దేవ్‌రావు కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న సొంతంగా రూ.లక్ష అందజేశారు. ఆ తర్వాత ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయిలో మిర్చీ తోటను పరిశీలించి కౌలు రైతు ఈశ్వర్‌తో మాట్లాడారు. అనంతరం యాపల్‌గూడలో శనగ పంటను పరిశీలించి వ్యవసాయ కూలీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
తర్వాత రైతులతో సమావేశమై, కాంగ్రెస్ ఇబ్బందుల గురించి తెలుసుకున్నారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో బేల మండలం మీర్జాపూర్లో గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు గోవింద్రావు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయాచోట్ల రైతు కుటుంబాలు గోడు వెల్లబోసుకోగా, కమిటీ చైర్మన్‌తోపాటు సభ్యులు భరోసానిచ్చారు. ప్రభుత్వ అసమర్థతతో విసుగెత్తిన రైతులకు భరోసా కల్పించి, వారిలో ధైర్యం నింపడమే అధ్యయన కమిటీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. రైతులు ధైర్యం కోల్పోవద్దని, మన బిడ్డలను బతికించుకోవాలని, మీకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని అభయమిచ్చారు. కొట్లాడాలే తప్ప.. వెనక్కి పోవద్దని, పోరాటానికి సిద్ధం కావాలని, సర్కారును ఎండగట్టాలని పిలుపునిచ్చారు. రైతుల సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చెప్పారు.
అధ్యయన కమిటీ సభ్యల పర్యటనను జిల్లా రైతులు స్వాగతించారు. సభ్యులు జిల్లాకు వస్తున్నారన్న విషయం తెలుసుకొని పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. యాపల్‌గూడలో మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి బృందం ఆగుతుందని తెలుసుకొని.. గుడిహత్నూర్, బేల పర్యటన పూర్తి చేసుకొని వచ్చే వరకూ ఎదురు చూశారు. ఆదిలాబాద్ రూరల్ మండలం రామాయి, యాపల్‌గూడలో పంటలను పరిశీలించి రైతులు, కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయాచోట్ల అధ్యయన కమిటీ సభ్యులను కలిసి రైతులు కాంగ్రెస్ పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరువు పెట్టారు.
గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు.. ప్రస్తుతం క్షేతస్థ్రాయిలో ఎదురవుతున్న సమస్యలను కమిటీకి వివరించారు. ముఖ్యంగా రుణమాఫీ, రైతు భరోసా అందక తీవ్ర ఇకట్లు పడుతున్నామని, అప్పులు ఎలా తీర్చాలో తెలియక ఎంతో మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కంటతడి పెట్టారు. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు సైతం ప్రభుత్వానికి ధైర్యం కావడం లేదని, రైతులు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
కేసీఆర్ పాలనలో సంతోషంగా సాగు చేసుకున్నామని, ఇప్పుడు తమ పరిస్థితి అధ్వానంగా తయారైందని ఆవేదన చెందారు. తమ సమస్యల గురించి పట్టించుకునే వారు ఎవరూ లేరని, తమ మొర ఎవరికీ చెప్పాలో తెలియడం లేదని వాపోయారు. రైతులు సంతోషంగా ఉండాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఆయాచోట్ల కమిటీ వెంట మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బీఆర్ఎస్ ఖానాపూర్ ఇన్చార్జి జాన్సన్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు యూనిస్ అక్బాని, సాజిద్ ఖాన్, ప్రమోద్ రెడ్డి, గంభీర్ ఠాక్రే, సతీశ్ పవర్, దేవన్న, తన్వీర్ ఖాన్, సంతోష్, షేక్ మహమ్మద్, రాథోడ్ రోహిదాస్, దత్తు, సురేశ్, బట్టు సతీశ్, ప్రమోద్ రెడ్డి, గంభీర్ టాక్రీ, సతీశ్ పవర్, దేవన్న, విపిన్ ఖోడ్ వివిధ గ్రామాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.