ఆదిలాబాద్ : రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులకు ఎకరాకు పదివేల చొప్పున రైతు బంధు కింద పెట్టుబడి సాయం అందించినట్లు గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఎకరాకు 15000 ఇస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. యాసంగిలో కేవలం నాలుగు ఎకరాల వరకు ఎకరానికి రూ. 6000 చొప్పున పెట్టుబడి అందించిందని మిగతా రైతులకు మొండి చేయి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం పీఎమ్ కిసాన్ సమ్మన్ పథకం కింద రైతులకు సాయం చేయడం లేదన్నారు. జిల్లాలో జొన్న కొనుగోలు ముగిసినా, ఇప్పటి వరకు రైతులకు ప్రభుత్వం డబ్బులు అందించలేదని తెలిపారు. దీంతో రైతులు పంట పెట్టుబడుల కోసం దళారులను ఆశ్రయిస్తున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. వరి నాట్లు వేసే సమయానికి రైతు భరోసా పథకం కింద డబ్బులు మంజూరు చేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యాఖ్యానించడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. జిల్లాలో రైతులు పత్తి, కంది, సోయాబీన్ పంటలను సాగు చేస్తారని వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే రైతు భరోసా పథకం డబ్బులు మంజూరు చేయడంతో పాటు జొన్నలు విక్రయించిన రైతులకు డబ్బులు అందజేయాలని జోగు రామన్న డిమాండ్ చేశారు.