సీసీసీ నస్పూర్, నవంబర్ 26: చరిత్రలో నిలిచిపోయే శుభదినం.. దీక్షా దివస్ అని బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్, దీక్షా దివస్ జిల్లా ఇన్చార్జి తుల ఉమ పేర్కొన్నారు. ఈ నెల 29న నిర్వహించే దీక్షా దివస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం నస్పూర్‌లోని మంచిర్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించగా, మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్యతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీక్షా దివస్ కార్యక్రమంపై కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ మలి దశ ఉద్యమాన్ని ములుపు తిప్పి, ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహా నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.
ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా 2009, నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్షను మరోసారి యాది చేసుకుందామని, ఈ నెల 29న మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని ఐక్యం చేసిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, ఉద్యమ స్ఫూర్తిని ప్రజల్లో మళ్లీ రగిలించేలా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాలు చేపడుతామన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై కొట్లాడుదామని పిలుపునిచ్చారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందన్నారు. ఏడాదిలోనే కాంగ్రెస్ కుంభకోణాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు.
కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌ను ఛీదరించుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ప్రజలంతా కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారన్నారు. ప్రజల పక్షాన నిలబడి ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతూ, దాడులు కొనసాగిస్తున్నారని, కాంగ్రెస్ బెదిరింపులకు భయపడేదిలేదన్నారు. ఉద్యమంలో వందలాది కేసులు పెట్టినా వెనుకడుగు వేయలేదని.. కాంగ్రెస్ కేసులతో తమను భయపట్టలేదని, నిత్యం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటామన్నారు. కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, భవిష్యత్ అంతా బీఆర్ఎస్దేనని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్‌కు తగిన బుద్ధిచెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ప్రజా పాలనను కాంగ్రెస్ గాలికి వదిలేసి, కూల్చివేతలు, పథకాల్లో కోతలు, అభివృద్ధి పేరుతో విధ్వంసాలు కొనసాగిస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి నియోజకవర్గాలకు చెందిన పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు.