సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 20 : ఈ నెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఉద్యమ స్ఫూర్తితో కదలివచ్చి జయప్రదం చేయాలని మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ఆదివారం నస్పూర్‌లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఉద్యమనేత కేసీఆర్ గాంధేయ పద్ధతిలో పోరాటాలు చేసి రాష్ర్టాన్ని సాధించారని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా పదేళ్లపాటు రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించి దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపారని కొనియాడారు.
ప్రస్తుతం ప్రజలకు తమకు ఇచ్చిన ప్రతిపక్ష హోదాను సమర్థవంతంగా నిర్వహిస్తూ..కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు విధానాలపై పోరాడుతున్నామన్నారు. రజతోత్సవ సభ సందర్భంగా చెన్నూర్, మంచిర్యాలలో వాల్రైటింగ్లను అధికారులు తొలగించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నదని, కేసులు పెట్టి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తున్నదని, అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్న విషయం గుర్తుంచు కోవాలన్నారు. గోడలపై కేసీఆర్ పేరును తొలగించవచ్చునేమో కానీ.. ప్రజల గుండెల నుంచి ఆయనను విడదీయలేరన్నారు.
మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేసి ప్రజల దశాబ్దాల కోరిక నెరవేర్చిన ఘనత కేసీఆర్‌ది అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కోట్లాది రూపాయలతో రోడ్లు, బ్రిడ్జిలు, డ్రైనేజీలు, ఎత్తిపోతల పథకాలు.. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆదర్శంగా నిలిపామని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొత్తగా తెచ్చిన నిధులేవీ లేవన్నారు. జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీలతో పాటు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పెట్టిన హామీల అమలులోనూ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని చెప్పారు. ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాల్సిన ఎమ్మెల్యేలు మంత్రి పదవి కోసం కొట్లాడుకోవడం సిగ్గుచేటన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే తమ కార్యకర్తలపై కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. కరెంట్, సాగునీటి కష్టాలను పట్టించుకోవడం లేదని, ధాన్యం కొనేనాథుడు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఎన్నికల సమయంలో చెన్నూర్ ప్ర జలకు అనేక హామీలిచ్చి గెలిచిన వివేక్.. వాటిని అమలు చేయడం లో విఫలమయ్యారని బాల్క సుమన్ ఆరోపించారు. అధికారంలోకి రాగానే 40 వేల ఉద్యోగాలు ఇస్తామన్నారని, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, మైనింగ్ కళాశాల, వంద పడకల దవాఖాన.. తదితర హామీలిచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. తాను చెన్నూర్‌కు తీసుకువచ్చిన బస్సు డిపో, రెవెన్యూ డివిజన్‌పై ఇంత వరకు మాట్లాలేదన్నారు. కోట్లాది రూపాయలతో చెన్నూర్‌ను అభివృద్ధి చేస్తే.. కాంగ్రెస్ హయాంలో ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని చెప్పారు. తమ హయాంలో చెన్నూర్‌లో విద్యుత్ సబ్‌స్టేషన్, క్యాతన్‌పల్లిలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే.. తామే కట్టినట్లు కాంగ్రెస్ ప్రచారం చేసుకోవడం సిగ్గు చేటన్నారు.
చెన్నూర్ నియోజకవర్గం నుంచి వెళ్లిపోతానని తనపై దుష్ప్రచారం చేస్తున్నారని, మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేసి గెలుస్తానన్నారు. జిల్లాలో గంజాయి గుప్పుమంటున్నదని, చెన్నూర్‌లో జోరుగా ఇసుక దందాకు తెరలేపారని, కోట్లాది రూపాయల సంపదను కాంగ్రెస్ నాయకులు జేబులో వేసుకుంటున్నారని, అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తూ పార్టీ నేతలకు అండగా నిలుస్తున్నారని ఆరోపించారు. చెన్నూర్ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తివేశారని, పత్తి కొనుగోళ్లు చేయాలని రైతులు రోడ్డెక్కే వరకూ కొనుగోళ్లు చేయలేదన్నారు. తన తండ్రి హాస్పిటల్లో వెంటిలేటర్‌పై ఉండగా, రైతుల కోసం హైదరాబాద్ నుంచి వచ్చి కలెక్టరేట్లో సమీక్ష నిర్వహించి, రూ. 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని గుర్తు చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పదవుల కోసం పాకులాడకుండా సమస్యలపై దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.
రజతోత్సవ సభకు ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావాలని బాల్క సుమన్ పిలుపునిచ్చారు. ప్రతి నియోజకవర్గం నుంచి 3 వేల చొప్పున మొత్తం 30 వేలకు పైగా రజతోత్సవ సభకు తరలిరానున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం వాహనాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ కళ్లలో బైర్లు కమ్మేలా రజతోత్సవ సభ జరుగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా సభను విజయవంతంగా కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నడిపెల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, చెన్నూర్ నియోజకవర్గం బాధ్యుడు డాక్టర్ రాజారమేశ్, నస్పూర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి మేరుగు పవన్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, నాయకులు బడికెల సంపత్‌కుమార్, పెట్టం లక్ష్మణ్, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.