అప్పుల బాధలు.. బ్యాంకోళ్ల సతాయింపులు.. కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయక.. సమయానికి పంట పెట్టుబడి సాయం అందక పండుగలా ఉన్న వ్యవసాయం దండుగైంది. ఎవుసం భారమై.. ఆత్మాభిమానాన్ని చంపుకోలేక.. నిస్సహాయస్థితిలోనూ సర్కారు చేయూత అందక.. బతుకు భారమై.. గుండె చెదిరి బలవన్మరణమే శరణ్యమని ప్రాణాలు వదిలిన రైతు కుటుంబాలకు బీఆర్ఎస్ పార్టీ కొండంత అండగా నిలిచింది. కాంగ్రెస్ సర్కారు సాయం అందించకపోయినా… మేమున్నామంటూ బాధిత రైతు కుటుంబాల్లో ఆత్మైస్థెర్యం నింపింది.
పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో పొరపాటున అధికారం చేతులు మారినా.. బతుకు పోరాటం చేయక తప్పని పరిస్థితి వచ్చిందని రైతులకు అర్థమయ్యేలా వివరించింది. ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్యలు చేసుకున్న గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండతండాకు చెందిన ఆడే గజానంద్, బేల మండలం రేణిగుంట గ్రామానికి చెందిన రైతు జాదవ్దేవ్రావ్, బేల మండలంలోని శంషాబాద్ గ్రామానికి చెందిన కౌలు రైతు గోవిందరావు కుటుంబాలను బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ పరామర్శించింది. ఆ కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇవ్వడంతోపాటు సాయం అందించింది. బాధిత రైతు కుటుంబాలతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని రైతులందరికీ నమ్మకాన్ని కలిగించడంలో విజయవంతమైంది.
– మంచిర్యాల, జనవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బ్యాంక్‌లో తెచ్చిన పంట రుణం రూ.2.10 లక్షలు రుణమాఫీ కాలే. పెట్టుబడి సాయం, రైతు భరోసా ఇవ్వలేదు. ఉన్న అప్పులు కట్టలేని పరిస్థితి. కొత్త అప్పులు చేయక తప్పని దుస్థితి. ప్రైవేటులో అప్పటికే రూ.3 లక్షల అప్పు తెచ్చిండు. అప్పులు ఎలా తీర్చాలో తెల్వక.. మనస్థాపంతో నా భర్త ఆడె గజేందర్ అక్టోబర్‌లో పత్తి చేనులోనే పురుగుల మందు తాగి సచ్చిపోయిండు. నాకు కొడుకు నిఖిత్, ఇద్దరు కూతుళ్లు పల్లవి, వైష్ణవి ఉన్నరు. నా అత్త లలితాబాయి కూడా ఉన్నది. మా ఆయన మృతితో మా కుటుంబానికి మగతోడు లేకుండా పోయింది. ఒకవైపు అప్పుల బాధ.. మరోవైపు పిల్లలను ఎలా సాకాలనే బాధ పడుతుండే.
అంత ఆలోచించేటోడు పురుగుల మందు తాగే ముందు మా గురించి ఆలోచించలే. గిప్పుడు కుటుంబం మొత్తం ఆగమైపోయిందని పుట్టెడు దుఃఖంలో ఉన్న మాకు బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ శుక్రవారం మా ఇంటికొచ్చి ధైర్యం చెప్పింది. కష్టకాలంలో మేం అండగా ఉంటామని నిరంజన్‌రెడ్డి సారు చెప్పిండు. ధైర్యంతో పోరాడాలే తప్ప అధైర్య పడొద్దని మాకు అండగా నిలిచిండు. మా బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రూ.లక్ష సాయం చేశాడు. ఆ లక్షతోనే మా బాధలన్నీ పోతయని కాదు.. కష్టకాలంలో ప్రేమతో మమ్ములను దగ్గరకు తీసుకుంది బీఆర్ఎస్ పార్టీనే. ఇంత వరకు కాంగ్రెస్ నాయకులెవరూ పరామర్శించడానికే రాలేదు. మళ్లా బీఆర్ఎస్ సర్కారు వస్తేనే మా అసోంటి రైతు కుటుంబాలకు న్యాయం జరుగుతది. ఆత్మహత్యలు ఆగుతయి. ఇప్పటికైనా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాలి. నిబంధన పేరు చెప్పకుండా పైసా లేకుండా రుణమాఫీ చేయాలి.
– ఆడె అనిత, ఆత్మహత్య చేసుకున్న ఆడె గజేందర్ భార్య
ఆదిలాబాద్ జిల్లాలో శుక్రవారం పర్యటించిన బీఆర్ఎస్ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ధైర్యం కల్పించడంలో విజయవంతమైంది. అధ్యయన కమిటీ చైర్మన్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, సభ్యులు మాజీ మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్, సత్యవతి రాథోడ్, జోగు రామన్న, ఎమ్మెల్సీలు ఎంసీ కోటిరెడ్డి, యాదవ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, రసమయి బాలకిషన్, అంజయ్యయాదవ్ ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో చెప్పిన విషయాలన్నీ అక్షర సత్యాలనీ రైతులు కుండబద్దలు కొడుతున్నారు.
స్వరాష్ట్రం బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండుగైంది. సాగునీరు లేక, పంట పెట్టుబడి సాయం లేక ఎవుసం అంటేనే దుఃఖ పడే రోజులు పోయి.. రైతులు ఇప్పుడిప్పుడే తెల్లబడుతున్నరు. కానీ.. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి పరిస్థితిని తారుమారు చేసింది. వ్యవసాయ రంగంలో ఏర్పడిన సంక్షోభం ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఏడాది కాలంలో 55 మంది రైతులు అప్పుల బాధలు, ఇతర కారణాలతో బలవన్మరణాలకు పాల్పడ్డానికి దారితీసిందనడంలో అతిశయోక్తి లేదు.
సంక్షేమ పథకాల ఫలాలు సమయానికి అందకపోవడమే అన్నదాతల బలవన్మరణానికి కారణమని రైతులు అభిప్రాయపడుతున్నరు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 53 మంది రైతుల ఆత్మహత్యల వెనుక కారణాలు ఏమున్నా, అంతిమంగా వ్యవసాయంలో ఏర్పడిన ఇబ్బందులు, అప్పులు బాధలతో వచ్చిన ఒత్తిడి తట్టుకోలేకే బలవన్మరణాలకు పాల్పడ్డారన్నది సుస్పష్టం. అందరితోపాటు రుణమాఫీ జరిగి ఉంటే బేల మండలంలోని రేణిగుంట గ్రామానికి చెందిన రైతు జాదవ్ దేవ్‌రావు చనిపోయేటోడు కాదు. వాస్తవానికి ఆయన పేరుపై ఉన్న అప్పు రూ.1.96 లక్షలే. మరి సర్కార్ చెప్పినట్లు రెండు లక్షల్లోపు రుణాలు అందరికీ మాఫీ జరిగి ఉంటే ఆయన ఎందుకు చనిపోయేటోడు. గుడిహత్నూర్ మండలంలోని నేరడిగొండతండాకు చెందిన ఆడే గజానంద్‌కు రుణమాఫీ జరిగి ఉంటే ఆయన కూడా చనిపోయేటోడు కాదు.
ఈ రోజు కూడా బజార్హత్నూర్ మండలంలోని వర్తమన్నూర్ గ్రామంలో బలవన్మరణానికి పాల్పడిన రైతు మైల నర్సయ్య పంట రుణం రూ.2.20 లక్షలు మాఫీ కాలేదు. మొన్నటికీ మొన్న మృతి చెందిన కౌలు రైతు బేల మండలంలోని శంషాబాద్ గ్రామానికి చెందిన గోవిందరావుకు రూ.3 లక్షల ప్రైవేటు అప్పు ఉంది. కాంగ్రెస్ సర్కార్ రెండు లక్షల లోపు రుణం ఉన్నోళ్లకు మాత్రమే మాఫీ చేయకుండా.. రెండు లక్షల వరకు అందరికీ రుణమాఫీ చేసి ఉంటే ఈ రైతుల్లో ఎవ్వరూ మృతి చెందేవారు కాదన్నది అన్నదాతల మదిలో మెదులుతున్న ఆలోచన. రైతులు ఏం అనుకుంటున్నారు. వారికి ఏం అవసరం ఉంది.. అని తెలుసుకుని ఆ అవసరాలు తీర్చే పరిస్థితుల్లో ప్రస్తుత సర్కారు లేకపోవడం దురదుష్టకరమని రైతులు, రైతు సంఘాల నాయకులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సర్కారు మారడంతో రైతులకు అందాల్సిన సంక్షేమ పథకాలకు గ్యారెంటీ లేకుండా పోయింది. పథకాలు ఇయ్యకపోయినా పంట పండించేందుకు అవసరమైన కరెంట్, నీళ్లు కూడా ఇయ్యలేని పరిస్థితి దాపురించిందని రైతులు వాపోతున్నరు. కాంగ్రెస్ ఇస్తానన్న ఆరు గ్యారెంటీలు దేవుడెరుగు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు ఏ విషయంలోనూ గ్యారెంటీ లేకుండా పోయిందని రైతులు చెప్తున్నారు.
నాడు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి.. రెండు పర్యాయాలు సీఎంగా కేసీఆర్ రాష్ర్టానికి ప్రధానమైన వ్యవసాయ రంగాన్ని దశలవారీగా అద్భుతంగా తీర్చిదిద్దారు. సాగునీటికి, కరెంట్‌కు ఇబ్బంది లేకుండా చేసిండు. పంటకు పెట్టుబడి సాయం సమకూర్చిండు. మద్దతు ధరకు పంటలను కొనుగోలు చేసిండు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులకు ఒక స్థిరమైన, విశ్వాసమైన జీవితాన్ని ప్రసాదించిండు.
నేడు సర్కార్ మారిన 13 నెలల్లో ఎవరూ ఊహించని విధంగా వ్యవసాయ రంగంలో పరిస్థితులు తారుమారైపోయినయ్. రైతుల బలవన్మరణాలు తెలంగాణలో మళ్లీ మొదలైనయ్. 24 గంటల కరెంట్ పోయి.. కరెంట్ కష్టాలు వచ్చిపడ్డయ్. పెట్టుబడి సాయం ఊసే లేకుండా పోయింది. రుణమాఫీ చేసినోళ్లు అందరికీ చేయక, కొందరికే చేసి చేతులు ఎత్తేశారు. ఏ పథకం ఎప్పుడు వస్తుందో, అసలు వస్తుందో రాదో తెలియని దుస్థితి. ఫలితంగా తెలంగాణలో రైతు ఆందోళనతో కూడిన జీవితాన్ని గడపాల్సి దుస్థితి దాపురించింది.
మా జోగు రామన్నతో కలిసి ఎకడో హైదరాబాద్‌లో ఉండే మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మా మారుమూల గ్రామానికి వచ్చారు. భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్న మా కుటుంబానికి కొండంత ధైర్యాన్నిచ్చారు. మా రామన్న ఇచ్చింది లక్ష రూపాయలు.. మా కోసం ఆలోచించేందుకు బీఆర్ఎస్ ఉందన్న ధైర్యం ఉంది. మా ఒక్క కుటుంబానిదే కాదు.. రాష్ట్రంలో దాదాపు చానా రైతు కుటుంబాలది ఇదే గోస.. సమస్యకు ఆత్మహత్యనే పరిషారం కాదు. అప్పులోళ్లు ఎంబడి పడుతున్నరని ఆత్మాభిమానం చంపుకోలేక మా దేవరావ్ ప్రాణం తీసుకున్నడు.
మా పరిస్థితి ఏందని ఆలోచించలే. అప్పుల బాధల్లో ఉన్న, రుణమాఫీ కానీ రైతులందరికీ చెప్తున్నా. గీ తప్పు ఎవ్వలు చేయొద్దు. మా ఊరిలోనూ అప్పులున్న రైతులున్నరు. ఆళ్లకు కూడా చెప్తున్నా.. ధైర్యంగా ఉండి పోరాడండి. ఏ దొంగతనం చేయలేదు మనం. సాగు కోసం అప్పు చేసినం. దానికి నాదాన్ కావాల్సిన అక్కర లేదు. పంట దిగుబడి రాలేదు. రుణమాఫీ కాలేదు. రైతుబంధు ఇయ్యలేదు. బ్యాంక్‌లో పంట కోసం చేసిన అప్పు రూ.1.96 లక్షలు ఉండే. నా ఆపరేషన్‌కు అని ప్రైవేటు బ్యాంక్‌లో మార్టిగేజ్ లోన్ తెచ్చిండు. రుణమాఫీ అయితే మార్టిగేజ్ లోన్ కొంత కట్టి.. ఆపుదమనుకున్నడు.
మాఫీ కాక మనస్థాపం చెందిండు. బ్యాంకోళ్లు సతాయించడంతోని ఏం చేయాలో తెల్వక.. ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకం పోయి నా భర్త దేవ్‌రావు బ్యాంక్‌కే పోయి పురుగుల మందు తాగిండు. ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందలేదు. ఎవ్వరు వచ్చి మమ్ములను కనీసం ఓదార్చలే. కేసీఆర్ ఉన్నప్పుడు ప్రవేశపెట్టిన రైతుబీమాపై మాత్రం అధికారులు వచ్చి వివరాలు తీసుకెళ్లిండ్రు. నిన్న బీఆర్ఎస్ అధ్యయన కమిటీ రావడంతో శనివారం అధికారులు ఉరుకులు పరుగులతో మా ఇంటికి వచ్చి రైతుబీమా ఐదు లక్షలు మీ అకౌంట్లో పడ్డాయని చెప్పారు. ఆ ఐదు లక్షలు కూడా బీఆర్ఎర్సెసోళ్లు వస్తనే పడ్డయ్.. అందుకే చెప్తున్నా ఏ రైతు ఆత్మహత్య చేసుకోవద్దు.
– ఆత్మహత్య చేసుకున్న గిరిజన రైతు జాదవ్ దేవ్‌రావ్ భార్య జిజబాయి
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో తాత్కాలికంగా ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుండవచ్చు. రైతులు ఎవరూ ధైర్యాన్ని కోల్పోవద్దని భరోసా కల్పించడంలో బీఆర్ఎస్ అధ్యయన కమిటీ విజయవంతమైంది. ప్రస్తుత పరిస్థితులకు పరిష్కారం చావులు కాదని, మాట ఇచ్చి నిలబెట్టుకోలేని సర్కారును నిలదీయాలని, పోరాటం చేయాలని, ధైర్యం వీడొద్దని బాధిత కుటుంబాల్లో ఆత్మైస్థెర్యం నింపింది. తెలంగాణలో అన్ని జిల్లాల రైతాంగానికి మా పార్టీ తరఫున, రైతు సంఘాల తరఫున ఒక గట్టి నమ్మకాన్ని, భరోసాను ఇచ్చి రానున్న రోజుల్లో ముందుకు సాగుతామంటూ కమిటీ సభ్యులు చేసిన ప్రకటన రైతులకు కొండంత అండగా మారిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నా రు.
బీఆర్ఎస్ రైతు పర్యటన ఉందని తెలిసి ఆదిలాబాద్ జిల్లా రైతులు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా కమిటీ సభ్యులను కలుసుకునేందుకు రావడమే బీఆర్ఎస్పై ఉన్న నమ్మకానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ఈ కమిటీ పర్యటనతో వ్యవసాయ రంగంలో గత ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు.. ప్రస్తుతం క్షేతస్థ్రాయిలో ఎదురవుతున్న సమస్యలపై రైతుల్లో ఆలోచన మొదలైంది. బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేసి మరీ.. మేమున్నామనే ధైర్యాన్ని బీఆర్ఎస్ రైతుల్లో నింపింది.