కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) పత్తి కొనుగోళ్లను శనివారం నుంచి నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఓ వైపు కూలీల కొరతతో చేలలో ఏరకుండా ఉన్న పత్తి, మరో వైపు ఇండ్లల్లో నిల్వ ఉంచిన పత్తిని విక్రయించడం ఎలా ? అని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తే క్వింటాలుకు రూ.1000 నుంచి రూ.1500 నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, ( నమస్తే తెలంగాణ)/భైంసా, ఫిబ్రవరి 20 : ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఈ ఏడాది 4.31 లక్షల క్వింటాళ్లలో పత్తి పంటను సాగు చేశారు. 30 లక్షల క్వింటాళ్ల పంట దిగుబడి వస్తుందని అంచనా వేసిన అధికారులు జిల్లా వ్యాప్తంగా సీసీఐ ఆధ్వర్యంలో 11 కేంద్రాలను ప్రారంభించి అక్టోబర్ చివరి వారంలో పంట కొనుగోళ్లను ప్రారంభించారు. కేవలం 15 లక్షల క్వింటాళ్లను మాత్రమే సేకరించి పంట కొనుగోళ్లను నిలిపివేశారు. జిల్లాలో సీసీఐ అధికారులు మొదటి నుంచి రైతులను నష్టపర్చే నిర్ణయాలు తీసుకుంటున్నారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర క్వింటాల్‌కు రూ.8110 ఉండగా తేమ ఎక్కువ ఉందని పత్తిని కొనకపోవడంతో పాటు రూ.100 తగ్గించి కొనడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకు 12 క్వింటాళ్లకు గాను కేవలం 7 క్వింటాళ్లు మాత్రమే సేకరించడంతో రైతులు మరింత ఇబ్బందులకు గురయ్యారు.
జిల్లాలో ఏటా మార్చి రెండో వారం వరకు పత్తి కొనుగోళ్లు కొనసాగు తాయి. జిల్లాలో రోజూ ఆదిలాబాద్ మార్కెట్‌యార్డుకు వెయ్యికి పైగా వాహనాల్లో 12 నుంచి 15 వేల క్వింటాళ్ల పత్తి సీసీఐ కేంద్రాలకు విక్రయానికి వస్తున్నది. చాలా మంది రైతుల ధర పెరుగుతుందనే నమ్మకంతో పంటను ఇండ్లలోనే నిల్వచేసుకోవడంతో పాటు పంటను ఇంకా తీయలేదు. సీసీఐ కేంద్రాల్లో క్వింటాలుకు రూ.8010 మద్దతు ధర ఉండగా ప్రైవేట్ వ్యాపారులు రూ.7వేలతో కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ కేంద్రాలు మూసివేస్తుండడంతో రైతులు రోజూ 12 వేల క్వింటాళ్ల పత్తిని ప్రైవేట్‌లో విక్రయించాల్సి వస్తుంది ప్రైవేట్ వ్యాపారులు తేమ, పంటలో నాణ్యత లేదంటూ రూ.6500తో కొనుగోలు చేస్తారు. దీంతో రైతులు క్వింటాల్‌కు రూ.1500 నష్టపోవాల్సి వస్తున్నది. జిల్లాలో పత్తి కొనుగోళ్లు మార్చి 31 వరకు నిర్వహించాలని మాజీ మంత్రి జోగు రామన్న కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించినా, రైతులు ఆందోళనలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అధిక వర్షాలతో పంటను నష్టపోయిన ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రస్తుతం సీసీఐ కేంద్రాల మూసివేతతో మరింత నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిర్మల్ జిల్లాలో ఈ ఏడాది ఇప్పటివరకూ 41,048 మంది రైతుల నుంచి 5,60,179.9 క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. అధిక వర్షాల కారణంగా పత్తి ఆలస్యంగా చేతికి అందడం, రెండోసారి ఏరిన పత్తిలో నాణ్యమైన దిగుబడులు రాలేదు. నవంబర్, డిసెంబర్, జనవరిలో పత్తి చేలు ఓ మాదిరి కాపు కాశాయి. కూలీల కొరతతో మహారాష్ట్ర నుంచి కూలీలకు ఎక్కువ కూలి చెల్లించి తీసుకువచ్చి పత్తిని తీయించారు. ధర పెరుగుతుందని కొందరు రైతులు ఇండ్లల్లోనే నిల్వ చేశారు. ప్రస్తుతం సీసీఐ పత్తి కొనుగోళ్లు నిలిపివేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులకు విక్రయిస్తే క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి రూ.6 వేలకే ధర పెడుతున్నారని దీంతో తీవ్రంగా నష్టపోతామని రైతులు వాపోతున్నారు.
ఎదులాపురం, ఫిబ్రవరి 20 : కేంద్ర ప్రభుత్వ రంగ కొనుగోలు సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ద్వా రా రైతుల వద్ద నిల్వ ఉన్న, లేట్ క్రాప్ ద్వారా సేకరిస్తున్న పత్తి పంటను చివరి పంట వరకు కొనుగోలు చేయించడంలో బీజేపీకి సంబంధించిన ఎంపీ గొడం నగే శ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు విజ్జగిరి నారాయణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతుల వద్ద నుంచి సీసీఐ పత్తి పంటను కొనేందుకు నేటితో గడువు ముగిసిందని అధికారులు ప్రకటించడం, అదేవిధంగా రైతులు కపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేద్దామని అనుకుంటే స్లాట్ సిస్టమ్ నిలిపి వేయడంతో రైతులు అయోమయానికి గురవుతున్నారన్నారు.
జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అధిక వర్షపాతం నమోదైందన్నారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో పత్తి చేలు దెబ్బతినగా మిగిలిన పంటనైనా మార్కెట్ అమ్ముదామంటే సీసీఐ అనేక ఇబ్బందులకు గురి చేసిందన్నారు. అధిక వర్షాలతో పంట చేతికి వస్తున్న పరిస్థితి ఉందన్నారు. కొంత మంది రైతులు పత్తికి మంచి ధర పెరుగుతుందని ఆశతో ఇండ్లల్లో నిల్వ చేశారని, మరి కొన్ని చోట్ల కూలీల కొరత పత్తి ఏరడం ఆలస్యమైందన్నారు. ఇప్పటికైనా సీసీఐ స్పందించి పత్తి పంటను మార్చి 31 వరకు సీసీఐ కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంపై ఇప్పటికే తాము బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో తాము జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించామన్నారు. బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీ, ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి చేసి సీసీఐ ద్వారా రైతుల పత్తిని చివరి వరకు కొనుగోలు చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతు ద్రోహులుగా మిగిలిపోవడం ఖాయమన్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు పత్తి, కొన్ని రోజుల్లో మార్కెట్‌కి రానున్న జొన్న, మక్క, శనగ పంటలను కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. లేదం టే బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి పో రాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.