దండేపల్లి, మే 18 : మంచిర్యాల జిల్లాలోని కడెం ప్రధాన కాలువపై నిర్మించిన పలు వంతెనలు ఏళ్ల తరబడి మరమ్మతులకు నోచుకోక ప్రమాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నాయి. కడెం జలాశయం ప్రధాన కాలువకు ఇరువైపులా రహదారి నిర్మించారు. మధ్యలో వాగులు అడ్డంగా ఉన్నచోట వంతెనలు నిర్మించారు. ఇరువైపులా రక్షణ గోడలు ఏర్పాటు చేయగా, వాటికి ఏర్పాటు చేసిన ఇనుప గొట్టాలు దొంగల పాలయ్యాయి. కేవలం రాడ్లు మాత్రమే మిగిలి ఉండి ప్రమాదకరంగా మారాయి. ఈ రహదారి గుండా నిత్యం వేలాది మంది రైతులు, కూలీలు ప్రయాణిస్తుంటారు. ఏమాత్రం ఆదమరిచినా వాహనాలు కడెం కాలువ, వాగులో పడిపోయే అవకాశముంది. ఇక్కడ పలువురు గాయపడ్డ ఘటనలు ఉన్నాయి. గతేడాది దండేపల్లి మండల కేంద్రానికి చెందిన ఉపాధి కూలీలు వెళ్తున్న ట్రాలీ కడెం ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న డిస్ట్రిబ్యూటరీ కాలువలో పడిపోగా, ఓ మహిళ చనిపోవడంతో పాటు పలువురు గాయపడ్డారు. అలాగే ఇటీవల వడ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో ధాన్యం నేలపాలైంది. పెద్ద ప్రమాదం తప్పింది.
దండేపల్లి మండలం తాళ్లపేట, రాజుగూడ, మాకులపేట, దమ్మన్నపేట, లింగాపూర్, తానిమడుగు వద్ద ఉన్న వంతెనలతో పాటు మిగతా చోట్ల ఉన్న బ్రిడ్జిలను సైతం మరమ్మతులు చేయాల్సిన అవసరముంది. కడెం ప్రధాన కాలువకు అవతలి వైపు అటవీప్రాంతం, ఇటువైపు పొలాలు ఉన్నాయి. అటవీప్రాంతంలో పలుచోట్ల పొలాలు కూడా ఉన్నాయి. రైతులు, వ్యవసాయ కూలీలు ద్విచక్ర వాహనాలు, ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లపై నిత్యం ఈ రూట్లో ప్రయాణిస్తుంటారు. అవతలి వైపుకు వెళ్లాలన్నా ఇదే ప్రధాన మార్గం. అలాగే కడెం ప్రధాన కాలువకు ఆనుకొని ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు ఈ దారిగుండా రాకపోకలు కొనసాగిస్తుంటారు. గూడాల నుంచి కడెం ప్రధాన కాలువ దాటుకొని రావాలంటే ఈ దారిగుండానే రాకపోకలు కొనసాగించాల్సిందే. దీనికి తోడు రహదారి మార్గం కూడా అధ్వానంగా ఉండడంతో గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శిథిలావస్థకు చేరిన వంతెనలతో పాటు, రహదారులకు మరమ్మతులు చేసి ఇబ్బందులు తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.
కడెం ప్రధాన కాలువ వెంబడి ఉన్న వంతెనలు : 20
కాలువను ఆనుకొని ఉన్న గ్రామాలు : 40
డిస్ట్రిబ్యూటరీ కాల్వలు : 42
ప్రధాన కాలువ పొడవు : 72 కి.మీ.
నిత్యం ఈ రూట్లో ప్రయాణించే రైతులు, కూలీలు : 20 వేల మంది