ఖానాపూర్, జూలై 11: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో అక్రమంగా ఇటుక బట్టీలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. అనుమతులు లేకుండా వ్యవసాయ భూముల్లో ఇటుక బట్టీలను ఏర్పాటు చేసి ఇటుకల తయారీ చేపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడడమే కాకుండా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం కూడా కోల్పోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్‌ను అక్రమంగా ఇటుక వ్యాపారులకు వరంగా మారింది.
సాగు కోసం వినియోగించాల్సిన ఉచిత విద్యుత్‌ను తమ వ్యాపారానికి వినియోగిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటుకల తయారీకి అవసరమయ్యే నీటి కోసం విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ఓ పక్క రైతులు వేసిన పంటలకు విద్యుత్ సరఫరా సక్రమంగా అందించలేక, లో వోల్టేజీ కారణంగా పలువురు రైతులకు చెందిన బోరు మోటర్లు కాలిపోతున్నాయని పలువురు రైతులు వాపోతున్నారు. ఈ అక్రమ విద్యుత్ కనెక్షన్లను అరికట్టినట్లయితే విద్యుత్ సరఫరా మెరుగవుతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
ఇంత జరుగుతున్న విద్యుత్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోకుండా ‘మాములు’గా తీసుకుని నామమాత్రపు జరిమాన విధించి వదిలేస్తున్నారనే విమర్శలున్నాయి. ముఖ్యంగా నివాస ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల దూరంలో ఇటుక బట్టీలను ఏర్పాటు చేయాలనే నిబంధనలు ఉన్నప్పటికీ నిర్వాహకులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. మున్సిపాలిటీ పరిధిలో వ్యాపారం సాగిస్తున్న సదరు వ్యాపారులు రూ.కోట్లలో వ్యాపారం సాగిస్తూ పైసా పన్ను కట్టకుండా ప్రభుత్వ ఆదాయానికి గండికోడుతున్నారనే అపవాదు ఉంది. కళ్ల ముందే అక్రమ దందా జరుగుతున్నా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కార్మికుల శ్రమ దోపిడీ..
అయా ఇటుక బట్టీలలో పని చేస్తున్న వలస కార్మికులకు శ్రమకు తగ్గ కనీస వేతనం, మౌలిక వసతులు, సదుపాయాలు కల్పించడం లేదు. అందుబాటులో కావాల్సినంత నల్లమట్టి, బూడిద లభిస్తుండడంతో ఇటుకల వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తక్కువ వేతనంతో కార్మికులు తీసుకొచ్చి వెట్టి చాకిరి చేయిస్తుండడంతో వారి జీవితాలు బుగ్గిపాలు అవుతున్నాయి. ఇలా ఇటుక బట్టీలలో పని చేయడంతో సదరు చిన్నారులు చదువుకు దూరమై డ్రాపౌట్లుగా మిగిలిపోతున్నారని పలువురు చెబుతున్నారు.
అనుమతులు అంతంతే..
ఇటుక బట్టీల నిర్వహణలో అనుమతులకు పాతరేస్తున్నారు. ఇటుక బట్టీలకు నల్లమట్టి అవసరం ఉండడంతో సమీపంలోని చెరువుల నుంచి అక్రమంగా తరలించి బట్టీల ప్రాంతంలో అక్రమంగా నిల్వ చేస్తున్నారు. చెరువుల నుంచి మట్టి తరలించాలంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలి. సదరు నిర్వహకులు నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా నల్లమట్టిని తరలించి ఇటుక బట్టీలకు వాడుకుంటున్నట్లు తెలిసింది. గ్రామాల్లో ఇటుక బట్టీలు ఏర్పాటు చేయాలంటే గ్రామ పంచాయతీ, రెవెన్యూ శాఖల అనుమతి తప్పనిసరి. అలాగే నీటి పారుదల, మైనింగ్, విద్యుత్, కార్మిక, పరిశ్రమల, తదితర శాఖల అనుమతి ఉండాలని చెబుతున్నారు. వాల్టా చట్టం మేరకు రెవెన్యూ శాఖ అనుమతి కీలకం. మండలంలోని ఇటుక బట్టీల నిర్వాహకులెవరు కూడా సంబంధిత శాఖల నుంచి అనుమతి తీసుకోలేదని తెలిసింది.
అనుమతి తీసుకోలేదు..
ఖానాపూర్ మండలంలో ప్రస్తుతం ఏ ఒక్కరు కూడా ఇటుక బట్టీల నిర్వహణకు అనుమతి పొందలేదు. ప్రతి యేడాది అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఇటుక బట్టీలలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు దాడులు చేసి జరిమానాలు విధిస్తున్నారు.
– రాంసింగ్, విద్యుత్ శాఖ ఏఈ,ఖానాపూర్