కంఠేశ్వర్, ఆగస్టు 20: ఉప సర్పంచ్ల చెక్ పవర్ జోలికొస్తే ఊరుకునేది లేదని ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు బోట్ల కార్తీక్ హెచ్చరించారు. అధికార దుర్వినియోగాన్ని అరికట్టాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం ఉప సర్పంచులకు చెక్ పవర్ కల్పించిందని, దాన్ని తొలగించాలని కోరడం వెనుకున్న ఉద్దేశాన్ని అందరూ అర్థం చేసుకోవాలని కోరారు. గురువారం నిజామాబాద్‌లోని సందీప్ గార్డెన్స్‌లో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్పంచ్‌లను గెలిపించేందుకు వార్డు సభ్యులు, ఉప సర్పంచులు ఎంతో కష్టపడి పని చేశారన్నారు.
ఉప సర్పంచుల చెక్ పవర్‌పై మాట్లాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. ఎంత దూరమైనా వెళ్లి ఉపసర్పంచ్లు, వార్డు సభ్యుల హక్కులను కాపాడుకుంటామన్నారు. గ్రామాభివృద్ధి కోసం మాట్లాడాల్సిన సర్పంచులు.. ఉపసర్పంచుల హక్కులను హరించాలని కోరడం సరైన పద్ధతి కాదన్నారు. నిజంగా గ్రామాల అభివృద్దిపై చిత్తశుద్ధి ఉంటే ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు చేస్తున్న హక్కుల పోరాటానికి కలిసి రావాలని సూచించారు. ఉప సర్పంచ్ల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వికార్‌పాషా, ప్రధాన కార్యదర్శి శ్రావణ్‌గౌడ్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధ్యక్షులు మహేశ్, రాజు, ఉపసర్పంచులు పాల్గొన్నారు.