దుబ్బాక, ఆగస్టు 20 : సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బుధవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలతో పాటు ఇద్దరు పిల్లలు మృతి చెందిన ఘటన దుబ్బాక పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబ్బాక మండలం బల్వంతాపూర్‌కు చెందిన దండుగుల రాజు(32) ఇసుక వ్యాపారి. బుధవారం తన భార్య భాగ్య(26), కుమారుడు నిహాన్ష్(4), కూతురు శాన్విక (2)తో కలిసి సిద్దిపేటలో బంధువు దశదిన కర్మకు కారులో వెళ్లాడు. సాయంత్రం 6 గంటల సమయంలో తన స్వగ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి తిరుగు ప్రయాణమయ్యాడు. రాత్రి 10 గంటలవుతున్నా రాజు ఇంటికి రాకపోవడంతో అతని సోదరులు యాదగిరి, భూపాల్ సెల్‌ఫోన్‌కు పలుమార్లు కాల్ చేసినా అందుబాటులో లేకుండాపోయింది. దీంతో వారు దుబ్బాక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు లోకేషన్ పరిశీలించి అప్పనపల్లి సమీపంలో ఉన్నట్లు గుర్తించారు.
అర్ధరాత్రి సమయంలో సిద్దిపేట- దుబ్బాక రోడ్డులో గల అప్పనపల్లి శివారులో గాలించగా, రోడ్డు పక్కన గల ఓ బావిలోకి కారు దూసుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపించాయి. దీంతో బావిలో చూడగా అందులో కారు సగానికిపైగా మునిగిపోయింది. వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని రప్పించారు. స్థానికుల సహాయంతో సుమా రు 3 గంటల పాటు సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ ద్వారా బావిలో నుంచి కారును పైకి తీశారు. కారులో చెల్లాచెదురుగా పడిఉన్న మృతదేహాలను బయటకు తీసి, పోస్టుమార్టం కోసం దుబ్బాక వంద పడకల దవాఖానకు తరలించారు. మృతుడి సోదరుడు యాదగిరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కీర్తిరాజు తెలిపారు. గురువారం ఉదయం దవాఖానలో మృతదేహాలను, అప్పనపల్లి వద్ద ప్రమాద సంఘటన స్థలాన్ని సీపీ రష్మీపెరుమాళ్ పరిశీలించారు. ప్రమాద ఘట న వివరాలను ఏసీపీ రవీందర్‌రెడ్డితో కలిసి స్థానిక సీఐ రాజేశ్, ఎస్సై కీర్తిరాజ్లను అడిగి తెలుసుకున్నారు.
అతివేగం, అజాగ్రత్త కారణంగా ఓ నిండు కుటుంబం బలికావడం స్థానికంగా కలిచివేసింది. అజాగ్త్రతతో కారు నడిపించడంతో తనతో పాటు భార్య , ముక్కు పచ్చలారని చిన్నారులు బలికావడం ఆందోళనకు గురిచేసింది. కారులో ఉన్న రాజుతో పాటు అతడి భార్య భాగ్య, కుమారుడు నిహాన్ష్, కూతురు శాన్విక మృతదేహాలను చూసి బంధువులు గుండెలవిసేలా రోదించారు.

ఈ ఘటనతో బల్వంతాపూర్‌లో తీవ్ర విషాదం అలుముకున్నది. గురువారం సాయం త్రం గ్రామంలో ఆ నలుగురి అంత్యక్రియలు నిర్వహించారు. ఒకేచోట భార్యాభర్తలతో పాటు వారి పిల్లలకు అంత్యక్రియలు నిర్వహించిన ఘటన చూపరులను కంట తడిపెట్టించింది.