న్యూఢిల్లీ, ఆగస్టు 20: పౌరులు ఇకపై ఇష్టమొచ్చినన్ని సిమ్‌లు తీసుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ప్రతి పౌరుడికి నిర్దేశించిన గరిష్ఠ పరిమితిలోనే మొబైల్ కనెక్షన్లు ఉండాలని పేర్కొంది. ఇప్పటికే గరిష్ఠ పరిమితిలో కనెక్షన్లు ఉన్న వినియోగదారులకు ఈ నెల 24 నుంచి కొత్త సిమ్ల జారీ నిలిపివేయాలని టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఎవరైనా నిర్దేశిత పరిమితిని దాటి సిమ్‌లకు దరఖాస్తు చేస్తే.. వారు గరిష్ఠ పరిమితిని దాటిన విషయాన్ని ఆపరేటర్లు వెల్లడించాలని పేర్కొంది. టెలిఫోన్ కనెక్షన్ల సంఖ్యపై ప్రభుత్వం పరిమితి విధించడం కొత్తేమీ కాదు. ప్రతి పౌరుడికీ గరిష్టంగా తొమ్మిదికి మించి కనెక్షన్లు ఉండరాదన్న నిబంధన ఉంది. జమ్ము-కశ్మీర్, అస్సాం, ఈశాన్య రాష్ర్టాలలో ఈసంఖ్య ఆరు మాత్రమే. ఫోన్ల కనెక్షన్ సంఖ్యలో ఈ పాత నిబంధననే పాటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.