ఆదిలాబాద్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ఇటీవల ఇండస్ట్రీయల్ పార్కు సర్వే, ఎయిర్‌పోర్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు అనుసరిస్తున్న వైఖరిపై జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ముందు బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యాక్రమం అమలుపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు బోథ్, ఆదిలాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు, అనిల్ జాదవ్ పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఇతర అధికారులు హాజరయ్యారు.
ఈ సమావేశంలో బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసిన ఇండస్ట్రీయల్ పార్కులో బోథ్ నియోజకవర్గం సగం వరకు వస్తుందని, తనకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎమర్జెన్సీ ఏరియల్ సర్వే ఎందుకు నిర్వహించారో మంత్రి జూపల్లి కృష్ణారావు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్కు ఏర్పాటు ఉద్దేశం ఏమిటని, చనాక, కొరాట ప్రాజెక్టు పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కెమికల్, ఇథనాల్, లిక్కర్ పరిశ్రమలు ఏర్పాటు చేస్తారనే ప్రచారం ఉన్నందున, పరిశ్రమల ఏర్పాటు విషయంలో స్పష్టత ఇవ్వాలన్నారు. పరిశ్రమలతో వచ్చే పొల్యూషన్‌తో స్థానికులు ఇబ్బందులు పడే అవకాశాలున్నాయన్నారు.
మూతపడిన ఆదిలాబాద్ సిమెంట్ పరిశ్రమను ప్రభుత్వం ప్రారంభిస్తే 10 వేల మందికి ఉపాధి దొరుకుతుందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. స్థానిక నాయకులు ఎయిర్‌పోర్డు విషయంలో ఓ మ్యాపు విడుదల చేయడంతో రైతులు ఆందోళన చెందారని, మ్యాపు సరికాదని కలెక్టర్ వివరణ ఇవ్వడంతో స్పష్టత వచ్చిందన్నారు. నాయకులు భూముల కోసం వ్యక్తిగత లాభాల కోసం తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. ప్రజలను పక్కదోవ పట్టించకుండా ప్రభుత్వం పూర్తి వివరాలు వెల్లడించాలని సూచించారు.
గిరిజనులకు అడవుల్లో జీవించే హక్కు ఉందని, అటవీశాఖ అధికారులు వారిని అడవుల నుంచి తొలగించే ప్రయత్నాలు మానుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అని ల్ సూచించారు. గిరిజనులపై అక్రమ కేసులు పెడితే సహించబోమని హెచ్చరించారు. ఎమ్మెల్యేలకు నిధులు మంజూరు చేసే ఉద్దేశం ప్రభుత్వానికి ఉందా ? లేదా ? అని ప్రశ్నించారు. తాగునీటి సమస్య పరిష్కారానికి బోథ్ నియోజకవర్గానికి బోర్వెల్లు మంజూరు చేయాలని కోరారు.