ఆదిలాబాద్, ఫిబ్రవరి 18(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని కాంగ్రెస్‌కు అప్పగించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే ప్రస్టేషన్కు గురై తనపై ఆరోపణలు చేస్తున్నాడని తెలిపారు.
రాష్ట్రంలో ఎనిమిది మున్సిపాలిటీల్లో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పంచుకున్నాయని, వీటిల్లో బీజేపీ నాయకులు ఎంతకు అమ్ముడుపోయారో పాయల శంకర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రితో చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఆదిలాబాద్ మున్సిపాలిటీని వదులుకున్న ఎమ్మెల్యే ప్రజలను పక్కదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. తాను అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు.
కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యే పాయల్ శంకర్‌పై రూ.365 కోట్ల బినామీ ఆస్తుల వివరాల ఆరోపణలు చేస్తే వాటిపై ఇప్పటివరకు ఎందుకు సమాధానం చెప్పలేదని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజల ఆకాంక్షల మేరకు తాను పార్టీ మారానని, పాయల్ శంకర్ మాదిరి తరచు పార్టీలు మారే వ్యక్తిని కాదన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రౌతు మనోహర్, విజ్జిగిరి నారాయణ, అలాల అజయ్, వెనకంటి ప్రశాక్, సాజిదొద్దీన్, కేమ శ్రీకాంత్, గండ్రత్ రమేశ్, కొండ గణేశ్, తదితరులు పాల్గొన్నారు.