లక్ష్మణచాంద, సెప్టెంబర్ 24 : బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి లక్ష్మణచాంద మండలంలోని బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరడానికి క్యూ కడుతున్నారు. పార్టీ మండల కన్వీనర్ కొరిపెల్లి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లోని బీజేపీ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. పార్టీకి లక్ష్మణచాంద కంచుకోటగా ఉండగా.. చేరికలతో మరింత బలోపేతం కానున్నది. బీజేపీకి రాబోయే ఎన్నికల్లో పరాజయం ఖాయమని తేలిపోవడంతో వారంతా బీఆర్ఎస్లో చేరుతున్నారు. వారం క్రితం కనకాపూర్‌కు చెందిన 50 మంది యువకులు అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరడంతో అక్కడ బీజేపీ పూర్తిగా ఖాళీ అయిపోయినట్లయ్యింది.
శనివారం కూడా తిర్పెల్లికి చెందిన 30 మంది యువకులు బీఆర్ఎస్ మండల కన్వీనర్, తిరపెల్లి సర్పంచ్ కొరిపెల్లి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బీజేపీ మండల యూత్ కన్వీనర్ రాపని గంగాధర్ చేరడంతో మిగతా నాయకులు ఆలోచనలో పడ్డారు. తాము కూడా చేరుతామని తెలుపడంతో.. చేరకుండా నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ మండల కన్వీనర్ కృష్ణారెడ్డి ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసుకొని కాంగ్రెస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలను బీఆర్ఎస్లో చేరుస్తుండడంతో ప్రతిపక్ష నాయకులు తమ కేడర్‌ను ఆపుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని ఆందోళన చెందుతున్నారు.
రాబోవు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని తేలిపోవడంతో ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరడానికి ముందుకొస్తున్నారు. ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధితో పల్లెల ఓట్లన్నీ బీఆర్ఎస్కు వెళ్తాయని తేలింది. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారులు ప్రతి ఇంట్లో ఇద్దరు నుంచి ముగ్గురికి లబ్ధి చేకూరుతోంది. దీంతో వాళ్లందరి ఓట్లు బీఆర్ఎస్ వైపే వెళ్తాయని ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చెందుతున్నాయి. తమ పార్టీ వారిని బీఆర్ఎస్లో చేరకుండా ఆపడానికి ఆయా పార్టీల నాయకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలితాలు ఇవ్వడం లేదు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి మండలంలో ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉంటుంది. మిగతా పార్టీలు మొత్తం ఖాళీ అవుతాయి.