సిర్పూర్(టీ), మార్చి 1 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం లోనవెల్లిలో మహాశివరాత్రి పర్వదినం రోజున తీవ్ర విషాదం నెలకొంది. పెన్‌గంగలో పుణ్యస్నానానికి వెళ్లిన తల్లీకొడుకు మృతి చెందగా, మరొకరు సురక్షితంగా బయటపడ్డారు. సిర్పూర్(టీ) ఎస్ఐ రవి కుమార్, స్థానికులు తెలిపిన వివరాలిలా.. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఉదయం లోనవెల్లి గ్రామానికి చెందిన ఎరుకోండ పద్మ (38), తన చెల్లెలు మంగ, కుమారుడు రక్షిత్ (14)తో కలసి స్థానిక పెన్‌గంగ నదికి పుణ్యస్నానానికి వెళ్లారు. మొదట కొడుకు రక్షిత్ నదిలోకి దిగి లోతులో మునిగిపోతుండగా, అతడిని కాపాడేందుకు పద్మ, ఆమె వెనకాలే మంగ వెళ్లారు. గమనించిన అదే గ్రామానికి చెందిన సుభాష్, బాబురావు వారిని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే పద్మ, రక్షిత్ మునిగిపోయారు. మంగను మాత్రం చాకచక్యంగా కాపాడారు. అక్కడికి చేరుకున్న పోలీసులు గల్లంతైన తల్లీకొడుకు కోసం గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పది మీటర్ల దూరంలో వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. పద్మ భర్త రవి, చిన్న కొడుకు కౌశిక్, కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడున్న వారికి కంట తడిపెట్టించింది. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ రవి కుమార్ తెలిపారు.