భైంసా, ఆగస్టు, 29 : వరదలతో ఇబ్బంది పడుతున్న లోతట్టు ప్రాంతాల బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని , సహాయ సహకారం అందిస్తామని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ భరోసానిచ్చారు. శుక్రవారం ఆమె ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి హరి కిరణ్‌తో కలిసి భైంసా పట్టణంలోని రాహుల్ నగర్, ఆటో నగర్ ప్రాంతాలను పరిశీలించారు. గడ్డెన్నవాగు ప్రాజెక్టు నుంచి వస్తున్న వరదపై సమీపా ప్రాం తాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఏవైనా ఇబ్బందులుంటే టోల్ ఫ్రీ నం. 91005 77132కు సమాచారం ఇవ్వాలన్నారు. కలెక్టర్ వెంట సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, ఆర్ అండ్ బీ డీఈ సునీల్, మున్సిపల్ కమిషనర్ రాజేశ్ కుమార్, తహసీల్దార్ ప్రవీణ్‌తో పాటు అధికారులు ఉన్నారు.
మహారాష్ట్ర నుంచి వరద పోటెత్తడంతో భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఐదు గేట్లను అధికారులు ఎత్తివేశారు. ఇన్ ఫ్లో కింద 31,450 క్యూసెక్కుల నీరు వచ్చి చేరడంతో ఔట్ ప్లో కింద 37 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది. పరివాహక ప్రాంతాలైన బైపాస్ రోడ్డు, భట్టిగల్లీలోని శివాలయం, శ్మశాన వాటిక, మైనార్టీ పాఠశాల, ఆటోనగర్, రాహుల్ నగర్‌లోని డబ్బా గల్లీ, కుభీర్ చౌరస్తాలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, భైంసా ఏఎస్పీ అవినాశ్ కుమార్, టౌన్ సీఐ గోపీనాథ్, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను కేఎస్ గార్డెన్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి తరలించారు. మైనార్టీ, గురుకుల పాఠశాలలకు సెలవులిచ్చారు.