మాతా శిశు సంరక్షణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. సర్కారు దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన వైద్యమందిస్తుండగా, ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ అవసరమైన సేవలు అందిస్తుండగా, వారంతా ఆస్పత్రిలో కాన్పులకే మొగ్గుచూపుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 40 శాతం వరకు నార్మల్ డెలివరీలు అవుతుండగా, 70 శాతానికి పెంచే లక్ష్యంతో వైద్యాధికారులు ముందుకెళ్తున్నారు.
– నిర్మల్, మే 7(నమస్తే తెలంగాణ)
నిర్మల్, మే 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ప్రభుత్వ దవాఖానలకు మంచి రోజులొచ్చాయి. గతంలో సర్కారు హయాంలో దవాఖానకు వెళ్లాలంటే ప్రజలు ఇష్టపడే వారు కాదు. కానీ.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్కారు దవాఖానలపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. దీంతో రోగులకు మెరుగైన వైద్యంతో పాటు సకల సౌకర్యాలు అందుతున్నాయి. ముఖ్యంగా మాతాశిశు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుండడంతో గతంతో పోలిస్తే సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఏడాది క్రితం నిర్మల్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు వచ్చిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు.. జిల్లాలో నార్మల్ డెలివరీలు అధికంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ఆ శాఖ అధికారులు సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. గ్రామీణ స్థాయిలో మహిళలు గర్భం దాల్చినప్పటి నుంచి 9 నెలల వరకు పాటించాల్సిన జాగ్రత్తలను తెలియజేయడంతో పాటు, సాధారణ ప్రసవం చేసుకునేలా గర్భిణులను సంసిద్ధం చేస్తున్నారు.
ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంలు గర్భం దాల్చిన 12వ వారం నుంచి మహిళకు అవసరమైన వైద్య సాయాన్ని అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. దీంతో సాధారణ ప్రసవాలను 70శాతం వరకు పెంచాలనే ఆరోగ్యశాఖ లక్ష్యాన్ని అమలు చేసేందుకు వైద్యారోగ్యశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. ఆశ కార్యకర్త, ఏఎన్ఎం, అంగన్వాడీ కేంద్రం, సబ్ సెంటర్, పీహెచ్సీ, ఎంసీహెచ్‌ల సమష్టి కృషితో కోతలు లేని ప్రసవాలకు ప్రాధాన్యమిస్తున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో 80 శాతం, ప్రైవేట్‌లో 20శాతం ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు చేసిన ఆదేశాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. నార్మల్ డెలివరీల విషయంలో వైద్యాధికారులు తీసుకుంటున్న చర్యలు క్రమంగా సత్ఫలితాలనిస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 40శాతం వరకు సాధారణ ప్రసవాలు జరుగుతున్నాయని వైద్యాధికారులు చెబుతున్నారు.
క్రమంగా పెరుగుతున్న సాధారణ ప్రసవాలు..
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్యం అందుతుండడంతో డెలివరీల సంఖ్య కూడా పెరుగుతున్నది. నాలుగేళ్లలో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని సర్కారు దవాఖానల్లో ఇప్పటి వరకు 24,093 ప్రసవాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలో అత్యధికంగా నిర్మల్‌లోని మాతాశిశు సంక్షేమ వైద్యశాలలో నెలకు 300 నుంచి 350 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ దవాఖానల్లో 4,664 ప్రసవాలు జరుగగా.. వీటిలో నార్మల్ డెలివరీలు 1,921, సిజేరియన్లు 2,743 జరిగాయి. ప్రైవేట్‌లో 5,693 ప్రసవాలు జరుగగా, వీటిలో నార్మల్ డెలివరీలు 432, సిజేరియన్లు 5,261 ఉన్నాయి. 2020-21లో ప్రభుత్వ దవాఖానల్లో 6,591 ప్రసవాలు జరిగాయి. వీటిలో నార్మల్ డెలివరీలు 2,187, సిజేరియన్లు 4,404 ఉన్నాయి. అదే సంవత్సరం ప్రైవేట్‌లో 4,666 ప్రసవాలు జరుగగా..
వీటిలో 308 నార్మల్ డెలివరీలు, 4,358 సిజేరియన్లున్నాయి. 2021-22లో ప్రభుత్వ వైద్యశాలల్లో 6,350 ప్రసవాలు జరిగాయి. వీటిలో నార్మల్ డెలివరీలు 2,327, సిజేరియన్లు 4,023 ఉన్నాయి. అదే సంవత్సరం ప్రైవేట్‌లో 5,804 ప్రసవాలు జరుగగా.. వీటిలో 339 నార్మల్ డెలివరీలు, 5,465 సిజేరియన్లు జరిగాయి. 2022-23లో ప్రభుత్వ దవాఖానల్లో 6,488 ప్రసవాలు జరిగాయి. వీటిలో నార్మల్ డెలివరీలు 2,432, సిజేరియన్లు 4,056 ఉన్నాయి. కాగా ప్రైవేట్‌లో మొత్తం 5,307 ప్రసవాలు జరుగగా, వీటిలో 671 నార్మల్ డెలివరీలు, 4,636 సిజేరియన్లు జరిగాయి. ప్రస్థుతం ప్రభుత్వ దవాఖానల్లో నార్మల్ డెలివరీలు 40శాతం వరకు అవుతున్నాయని, దీనిని 70 శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు.
గ్రామస్థాయిలోనే పరీక్షలు..
మహిళలు గర్భధారణ పరీక్షలు చేసుకోవడానికి ఆరోగ్య కేంద్రానికి రాగానే ఏఎన్ఎంలు ప్రెగ్నెన్సీ కిట్ ద్వారా వారిని పరీక్షిస్తారు. గర్భం దాల్చిన వెంటనే నెలకు సరిపడా మందులు ఇస్తారు. మూడో నెల నుంచి డెలివరీ అయ్యేవరకు రక్తహీనతకు గురికాకుండా ఐరన్, క్యాల్షియం ట్యాబ్లెట్లు అందిస్తారు. సదరు గర్భిణికి సంబంధించిన పూర్తి వివరాలను సమీపంలోని అంగన్వాడీ కేంద్రానికి చేరవేస్తారు. ఏరియా అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజూ కోడిగుడ్డు, ప్రొటీన్ పౌడర్, ఇతర పోషక పధార్థాలను అందజేస్తారు. దాదాపు ఆరు నెలల వరకు పీహెచ్‌సీల్లోనే పరీక్షలు నిర్వహించి ఎప్పటికప్పుడు గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తారు. 7వ నెల నుంచి జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రానికి తరలించి గైనకాలజిస్టుల సూచన మేరకు ఆల్ట్రాసౌండ్, టిఫా స్కానింగ్ చేసి గర్భస్థ శిశువు స్థితిగతులను రికార్డు చేస్తారు. గర్భంలో శిశువు కదలికలు, సాధారణ ప్రసవమా? సర్జరీ చేయాల్సిన అవసరముందా..? మొదలగు విషయాలను డాక్టర్లు గుర్తిస్తారు. కాగా.. గర్భం దాల్చిన నాటి నుంచి ఏవైనా సమస్యలుంటే మెరుగైన చికిత్స కోసం 102 వాహనాల ద్వారా ఎంసీహెచ్‌కు తీసుకెళ్తారు. అక్కడ పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరిగి అదే వాహనంలోనే ఇంటికి తీసుకొచ్చి వదిలేస్తారు.
సాధారణ ప్రసవానికి యోగా..
సాధారణ ప్రసవం అయ్యేలా గర్భిణులకు యోగా శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం ఆశ కార్యకర్తల నుంచి ఏఎన్ఎం, సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లకు ఇప్పటికే యోగాలో శిక్షణనిచ్చారు. వీరు గ్రామాలు, సబ్ సెంటర్లు, పీహెచ్‌సీల్లో గర్భిణులకు ప్రతిరోజూ యోగాసనాలతో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం వంటివి నేర్పిస్తారు. ఆయా కేంద్రాల్లో నేర్చుకున్న ఎక్సర్సైజులను ప్రతిరోజూ ఇళ్లలో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇలా రెగ్యులర్‌గా ఆసనాలు వేయడం ద్వారా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యం..
సాధారణ ప్రసవాలను పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్‌తో ప్రతి పల్లె దవాఖానల్లో ఒక సెంటర్ (ఎంఎల్‌యూ)ను అభివృద్ధి చేశాం. ఈ సెంటర్లో గర్భిణులకు ప్రత్యేకంగా ఎక్సర్సైజ్లు చేయించేందుకు అవసరమైన పరికరాలు అందుబాటులో ఉంటాయి. గ్రామ స్థాయిలో వీహెచ్ఎస్ఎన్సీ (విలేజ్ హెల్త్ శానిటేషన్ అండ్ న్యూట్రీషన్ కమిటీ) ద్వారా గ్రామ సభల్లో సహజ ప్రసవాలపై చర్చించి అవగాహన కల్పిస్తున్నాం. ‘ఎనీమియా (రక్తహీనత) ముక్త్ నిర్మల్’ నినాదంతో పని చేయాలని క్షేత్ర స్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి గర్భిణుల్లో రక్తహీనత లేకుండా చర్యలు తీసుకుంటున్నం. గతంతో పోలిస్తే ప్రస్తుతం సాధారణ ప్రసవాలు గణనీయంగా పెరిగాయి. జిల్లాలో 70శాతం నార్మల్ డెలివరీలు జరిగేలా టార్గెట్ పెట్టుకున్నాం.
– డాక్టర్ ధన్‌రాజ్, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి, నిర్మల్