ఆదిలాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నది. నిరుపేదలకు మెరుగైన వైద్యమందించి భరోసానిస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సర్కారు వైద్యం ప్రజలకు అందని ద్రాక్షగానే ఉండేది. అప్పటి ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆదిలాబాద్ జిల్లాలో వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉండేది. సీజనల్ వ్యాధులు విజృంభించి పల్లె ప్రజలు మంచాన పడాల్సి వచ్చేది. ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే వైద్యసేవలు అందక అనేక మరణాలు సంభవించేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ సర్కారు మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం నాణ్యమైన వైద్యమందిస్తున్నది.
రూ.150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం 3.4 ఎకరాల విస్తీర్ణంలో రూ. 150 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నిర్మించింది. ఇందులో రూ.80 కోట్లు భవనాలకు, రూ. 70 కోట్లు వైద్య పరికరాలు, ఇతర అవసరాల కోసం వెచ్చించింది. ఈ స్పెషాలిటీలో వివిధ వ్యాధులకు సంబంధించి 250 పడకలు అందుబాటులో ఉంటాయి. ఈ దవాఖానను మార్చి 3న రాష్ట్ర, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. సూపర్ స్పెషాలిటీలో వివిధ విభాగాల్లో వైద్య నిపుణులు సేవలు అందిస్తున్నారు. కార్డియాలజీ, న్యూరోలాజీ, యూరాలోజీ, అంకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ ఓపీ వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయి. వివిధ వ్యాధులకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలను ఆధునిక యంత్రాల ద్వారా పేదలకు ఉచితంగా చేస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన వారికి దవాఖానలో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. వీటితో పాటు రేడియాలజీ విభాగంలో సిటీస్కాన్, ఎక్స్‌రే, డిజిటల్ ఎక్స్‌రే, ఈసీజీ. టూడీఈకో, అల్ట్రాసౌండ్లాంటి సౌకర్యాలు వస్తాయి. ప్రభుత్వం ఇటీవల ఈ దవాఖానకు రూ.11.65 కోట్లు విలువ చేసే ఎంఆర్ఐ మిషన్‌ను సైతం మంజూరు చేసింది.
అందుబాటులోకి వైద్యసేవలు
గతంలో జిల్లావాసులకు చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కరీంనగర్, నిజమాబాద్, హైదరాబాద్, మహారాష్ట్రలోని నాగ్‌పూర్, యావత్మల్, వరదాలాంటి ప్రాంతాలకు వెళ్లి వైద్యం పొందేవా రు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ప్రతి నె లా పరీక్షల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వ స్తుండేది. వైద్యం, ప్రయాణం కోసం వే లాది రూపాయలు ఖర్చు చేయాల్సి వచ్చేది. రిమ్స్ సూ పర్ స్పెషాలిటీలో వివిధ రకాల వైద్యసేవలు అందుబాటులోకి రావడంతో రోగులకు ఇబ్బందులు త ప్పాయి. వివిధ వ్యాధులకు వైద్య నిపుణుల పర్యవేక్షణలో వేలాది రూపాయాలు విలువ చేసే చికిత్సలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఆధునిక యంత్రాల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.
ఇటీవల ప్రారంభమైన రిమ్స్ సేవలు
రిమ్స్‌లో ఆర్థోపిడిక్ విభాగం ఆధ్వర్యంలో మోకాలి శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. బ్లడ్‌బ్యాంక్ రక్తదాన శిబిరాలు నిర్వహించి రాష్ట్రంలో ఎక్కువ యూనిట్లను సేకరించి ప్రభుత్వ అవార్డును కూడా సాధించింది. ఈ దవాఖానలో సాధారణ ప్రసవాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఇందుకుగానూ గైనకాలజీ విభాగానికి రాష్ట్ర ప్రభుత్వ అవార్డు లభించింది. టీఫా యంత్రం ద్వారా గర్భిణులకు వైద్యసేవలు అందుతున్నాయి. ప్రభుత్వం రిమ్స్ నర్సింగ్ కళాశాల భవన నిర్మాణం కోసం రూ.20 కోట్లు మంజూరు చేసింది. పల్మోనాలజీ విభాగం ఆధ్వర్యంలో బ్రాంకోస్కోపీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. నేత్ర విభాగం ఆధ్వర్యంలో ఫొటోకోగ్యూలేషన్, గ్రీన్ లేజర్, స్లిట్ల్యాంప్వంటి అధునాతన యంత్రాలు రావడంతో ప్రజలకు మెరుగైన కంటి వైద్యం అందుతుంది.రిమ్స్ వైద్యకళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎమ్సీ) 2022-23 విద్యా సంవత్సరానికిగానూ 38 పీజీ సీట్లకు అనుమతి ఇచ్చింది.
టూడీ ఈకో మిషన్ : ఈ యంత్రాన్ని గుండెకు సంబంధించిన వైద్య పరీక్షలకు ఉపయోగిస్తారు. గుండె పనితీరు, ఇతర సమస్యలను టూడీ ఈకో పరీక్షల ద్వారా కార్డియాలజిస్ట్‌లు తెలుసుకుంటారు. రూ.15 లక్షల విలువ చేసే ఈ యంత్రం సూపర్ స్పెషాలిటీ దవాఖానలో అందుబాటులో ఉంది. టూడీ ఈకో పరీక్ష చేయించుకోవాలంటే ప్రైవేట్ హాస్పిటల్స్‌లో రూ.2 వేలు అవుతుంది. గుండె వైద్య నిపుణులు టూడీ ఈకో పరీక్షలను ఉచితంగా చేస్తున్నారు.
డిజిటల్ ఎక్స్‌రే : రూ.1.17 కోట్ల విలువ చేసే ఈ యంత్రం హైదరాబాద్ కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉంటుంది. పేదలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించడంలో భాగంగా ఆదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖానలో డిజిటల్ ఎక్స్‌రేను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎముకలు, నరాలు, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి ఈ యంత్రం ద్వారా ఎక్స్‌రే తీస్తారు. ప్రైవేటు దవాఖానల్లో వేల రూపాయలు విలువ చేసే ఎక్స్‌రేలు ఇక్కడ ఉచితంగా లభిస్తున్నాయి.
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం
ఆదిలాబాద్ రిమ్స్‌లో పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యసేవలు అందిస్తున్నాం. సాధారణ వైద్యసేవలు మొదలుకుని.. వివిధ విభాగాల్లో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. మోకాలి మార్పిడి ఆపరేషన్‌ను సైతం విజయవంతంగా చేస్తున్నాం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కార్డియాలజీ, న్యూరో సర్జరీ, పీడీయాట్రిక్ సర్జరీ, యురాలజీ, సర్జికల్ అంకాలజీ విభాగంలో వైద్య సేవలు అందుతున్నాయి. అధునాతన యంత్రాల ద్వారా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాం. ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు వినియోగించుకోవాలి.
– జైసింగ్ రాథోడ్, రిమ్స్ డైరెక్టర్, ఆదిలాబాద్
మెరుగైన గుండె చికిత్సలు
సూపర్ స్పెషాలిటీలో పేదలకు మెరుగైన గుండె చికిత్సలు నిర్వహిస్తున్నాం. రోజూ 25 మంది వరకు గుండె సంబంధిత సమస్యలతో వస్తున్నారు. వారికి ఈసీజీ, టూడీఈకోలాంటి పరీక్షలు నిర్వహిస్తూ అవసరమైన వైద్యం అందిస్తున్నాం. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అందించే విలువైన కార్డియాలజీ వైద్య సేవలు ఇక్కడ ఉచితం.
– హరిబాబు, కార్డియాలజిస్ట్, సూపర్ స్పెషాలిటీ
డాక్టర్లు మంచిగ చూస్తున్నరు..
నాకు కొన్ని రోజులుగా నడుంనొప్పి ఉంది. సూపర్ స్పెషాలిటీ న్యూరో సర్జరీ డాక్టర్‌కు నా సమస్య చెప్పిన. పరీక్షలు చేసిన తర్వాత మందులు ఇచ్చిన్రు. ఇక్కడి డాక్టర్లు మంచిగ చూస్తున్నరు. అన్ని పరీక్షలు చేయడానికి యంత్రాలు కూడా ఉన్నయి. ప్రైవేట్ హాస్పిటల్‌కి పోతే వేలకు వేలు అయితయ్. ఇక్కడ ఖర్చు లేకుండా చూపించుకున్న.
– శ్రీకాంత్, ఆదిలాబాద్