బెల్లంపల్లి : దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు ( Better medical services ) అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ ( Collector Kumar Deepak ) సంబంధిత వైద్యులను ఆదేశించారు. శనివారం బెల్లంపల్లి వంద పడకల దవాఖానాను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పురుష మహిళ వార్డులను పరిశీలించి రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.
జ్వరపీడుతులకు( Fever ) ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి వైద్య చికిత్సలు అందించాలని సూచించారు. అన్ని రకాల రోగాలకు మందులను సరిపడా అందుబాటులో ఉంచుకోవాలని వెల్లడించారు. వార్డులు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలకు అందించే ఆహారంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని తెలిపారు. ఆసుపత్రికి ప్రహరీ గోడ ( Compound wall ) నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. డయాలసిస్ సెంటర్ను పరిశీలించి కిడ్నీ బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
అనంతరం బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న అమృత్ 2.0 పనులను తహసీల్దార్ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ రమేష్తో కలిసి పరిశీలించారు. మిషన్ భగీరథ పథకంలో నల్లా కనెక్షన్ల ద్వారా నివాసాలకు త్రాగునీరు అందించడంతో పాటు అమృత్ 2.0 పథకంలో నిర్మిస్తున్న నీటి ట్యాంకుల ద్వారా త్రాగునీటిని సరఫరా చేసేందుకు చర్యలు కుంటున్నామని తెలిపారు. పనులు వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రెండు పడక గదుల ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.