బెల్లంపల్లి, మార్చి 12 : ప్రభుత్వ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం బెల్లంపల్లిలోని 100 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. వార్డులు, మందుల నిల్వలు, రిజిష్టర్లు, ల్యాబ్‌ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో వడదెబ్బ బారిన పడకుండా పాటించాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
రోగులకు సకాలంలో పౌష్టికాహారం అందించాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవల గురించి ఆరా తీశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఐటీఐ కళాశాల ఏర్పాటు కోసం ఆర్డీవో హరికృష్ణ, తహశీల్దార్ జ్యోత్స్న, డీఏవో కృష్ణతో కలిసి స్థలాలను పరిశీలించారు.