కెరమెరి, జూలై 27 : ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే పేర్కొన్నారు. శనివారం కెరమెరిలోని పీహెచ్సీని తనిఖీ చేశారు. దవాఖానలో అందుతున్న వైద్య సేవల గురించి బాలింతలను అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా, డెంగ్యూవంటి జ్వరాలు ప్రబలే అవకాశాలున్నందున ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రతిరోజూ హాస్పిటల్ గదులు, ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. అంతకుముందు ధనోర ఉర్దూ మీడి యం పాఠశాలను సందర్శించి అమ్మ ఆదర్శ పాఠశాల పనులను పరిశీలించారు. సంతృప్తి వ్యక్తం చేసి పాఠశాల కమిటీని అభినందించా రు. ప్రభుత్వ బడుల్లో అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి గుణాత్మకమైన విద్య అందించడం జరుగుతోందని, విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
అనంతరం పాఠశాల ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో తుకారాం భట్, డీపీవో భిక్షపతి గౌడ్, తహసీల్దార్ దత్తు ప్రసాదరావు, ఎంపీడీవో మహ్మద్ అమ్జద్పాషా, మండల నోడల్ అధికారి ప్రకాశ్, వైద్యాధికారి క్రాంతికిరణ్, టీడబ్ల్యూ ఏఈ నజీమొద్దీన్, ఏపీఎం జగదీశ్వర్, ధనోర మాజీ ఉప సర్పంచ్ సయ్యద్ రిజ్వాన్ పాల్గొన్నారు.